
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో పరిణామాలు, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరికాసేపట్లో అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో వేగంగా పార్టీల బలాబలాలు మారుతున్నాయి. కాంగ్రెస్ గూటి నుంచి జారిపోయి బీజేపీ వైపు ఆకర్షితులైనట్టు భావించిన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ అసెంబ్లీ చేరుకున్నారు. మరో ‘మిస్సింగ్’ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ కూడా గోల్డ్‌ఫించ్ హోటల్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. గతంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకే ఓటేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పటిష్టమైన పోలీసుల భద్రత మధ్య ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాగానే.. వారిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్యలోనే వారు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్‌సింగ్, ప్రతాపగౌడ కాంగ్రెస్‌కు ద్రోహం చేయబోరని ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ తెలిపారు.
ఇటు బలపరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ శిబిరంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీఎల్పీ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయి మంతనాలు జరుపుతున్నారు. కేంద్రమంత్రులు జవదేకర్, జేపీ నడ్డా, అనంతకుమార్, సందానంద గౌడ, పార్టీ నేతలు యడ్యూరప్ప, శ్రీరాములు, జగదీశ్ షెట్టర్ ఈ భేటీలో పాల్గొని.. బలపరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు బేరసారాలు జరిపిన వీడియోలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో బీజేపీ నేత శ్రీరాములు బేరసారాలు ఆడిన ఫోన్ సంభాషణను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నాలుగు ఆడియో టేపులను విడుదల చేసినట్టు అయింది.
Comments
Please login to add a commentAdd a comment