సాక్షి, బెంగళూరు : కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగాలని భావిస్తున్నారు. అందుకు ఏ అడ్డంకులు తనకు ఎదురుకావొద్దని హసన్‌లోని లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు ఢిల్లీకి వెళ్లి కేబినెట్‌పై కాంగ్రెస్ చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఆలయాన్ని సందర్శించడం గమనార్హం. కాగా, కర్ణాటక రాజకీయాలు నేటి మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకోనున్నాయి.
సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సమావేశం కానున్నారు. అనంతరం 4:30 గంటలకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన భేటీ అవుతారు. కర్ణాటక మంత్రిమండలి కూర్పు, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, సమన్వయ కమిటీ ఏర్పాటుపై చర్చిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ స్థిరత్వంపై కుమారస్వామి దృష్టి సారిస్తున్నారు. అయిదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని ఆయన ఇదివరకే కుండబద్దలుకొట్టారు. మరోవైపు రొటేషన్ సీఎంకు జేడీఎస్ కూడా నో చెబుతోంది. కీచులాటలు, విభేదాలతో కూటమిని విచ్ఛిన్నం చేయవద్దన్న భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. బీజేపీని నిలువరించడం కోసం ఐదేళ్ల పాటు కూటమికి బీటలు వారకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు సీనియర్ నేతలు కసరత్తులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment