
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. ప్రచారం నుంచి మొదలు పెడితే ఫలితాలు, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం వరకు గంటకో మలుపు తిరిగాయి. శనివారం ఎట్టకేలకు వాటికి ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి యడ్డీ అవిస్వాస తీర్మానానికి ముందుగానే రాజీనామా చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. అధికారం దక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సామభేదదండోపాయాలను ప్రయోగించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ సభ్యులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
వందల కోట్లు, పదవులను బీజీపీ ఎరగా వేసినా.. తమ పార్టీల ఎమ్మెల్యేలు 117 మంది ఒకేతాటిపై ఉన్నారని ఆజాద్ తెలియచేశారు. 15 రోజుల నుంచి రెండు రోజులకు బలనిరూపణ వ్యవధి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం కోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండు వారాల సమయంలో బీజేపీ నేతలు ఫిరాయింపులను ప్రోత్సహించేవారిని ఆరోపించారు. బీజేపీకి బలం లేని కారణంగానే గవర్నర్ రెండు వారాల గడువు ఇచ్చారని విమర్శించారు. ప్రస్తుతం ఇది ప్రజాస్వామ్య, రాజ్యాంగం, సుప్రీంకోర్టు విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గవర్నర్ నుంచి కుమారస్వామి పిలుపు కోసం ఎదురుచూస్తున్నామని, గవర్నర్ ముందున్న కర్తవ్యం అదేనని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల విజయమని అని చెప్పిన ఆజాద్, వారికి సోనియా, రాహుల్ గాంధీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.