- ప్రసవానంతరం ఉచిత రవాణా సదుపాయం
- మాతా శిశువును ఇంటికి చేర్చేందుకు నూతన అంబులెన్‌సలు
- నగు-మగు పథకాన్ని ప్రారంభించిన గులామ్ నబీ ఆజాద్, సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : ప్రసవానంతరం మాతా, శిశు మరణాలను తగ్గించే చర్యల్లో భాగంగా ‘నగు-మగు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక అంబులెన్స్‌లను ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకున్న తర్వాత తల్లి బిడ్డలను ఉచితంగా ఇంటికి చేర్చడం కోసం ఈ వాహనాలను ఉపయోగిస్తారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ జాతీయ పట్టణ ఆరోగ్య అభియాన్ (నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్-ఎన్‌యూహెచ్‌ఎం)ను నగరంలోని ఫ్రీడం పార్కులో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యూటీ.
ఖాదర్‌తో కలిసి ఈ వాహనాలను ఆరోగ్య శాఖకు అప్పగించారు. అనంతరం ఖాదర్ మాట్లాడుతూ... జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే) కింద ఇప్పటి వరకూ గర్భిణులను ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చేవారన్నారు. ప్రసవించిన తర్వాత సొంత ఖర్చులతో బిడ్డతో పాటు తల్లిఇంటికి చేరుకునే వారని తెలిపారు. సరైన వాహన సదుపాయం లేకపోవడం వల్ల కొంత మంది తల్లులు, శిశువులు అనారోగ్యానికి గురికావడమే కాకుండా, కొన్ని సార్లు మృ్యు వాత పడుతున్నారని చెప్పారు.
ఇలాంటి వాటిని నివారించడానికి అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన ‘నగు-మగు’ వాహనాలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. వాహనాల్లో నైపుణ్యం గల సిబ్బంది ఉంటారన్నారు. బాల స్వస్థ కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) పథకం కింద 0-18 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి వీలుగా రాష్ట్రంలో తాలూకాకు రెండు చొప్పున వైద్య బృదాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఒక్కో బృదంలో డాక్టరు, నర్సు, కంటి వైద్యుడు ఉంటారని వివరించారు. అంగన్‌వాడీలు సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను సందర్శించి ఈ బృదాలు రోజుకు కనీసం 150 మంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీరు రెఫర్ చేసిన పిల్లలకు శస్త్ర చికిత్స సహా అవసరమైన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించడం కోసం వైద్య రంగానికి ఎక్కువ నిధులను కేటాయించనున్నట్లు వెల్లడించారు.