సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం యడ్యూరప్ప చివరి వరకూ విశ్వప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే సీఎం కుర్చీ ఆయనకు ఏ మాత్రం కలిసి రానట్టే ఉంది. కర్ణాటకలో చక్రం తిప్పుదామనుకున్న ప్రతిసారి ఆయన్ను విధి వెక్కిరించింది. పూర్తిస్థాయిలో ప్రజలను పాలించే అదృష్టం యడ్డీకి ఏమాత్రం కలగలేదు. అధికారంలో ఐదేళ్లు ఉండాలని ఆయన ఈరోజు వరకూ గజినీ మహ్మద్ తరహాలో దండయాత్ర చేస్తూనే ఉన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీ అందినట్టే అంది చేజారి పోయింది.
- 2007 నవంబర్ 12న యడ్యూరప్ప తొలిసారి సీఎం కుర్చీ అధిష్టించారు. అయితే ఆ ఆనందం పట్టుమని పదిరోజులు కూడా మిగల్లేదు. కేవలం 8 రోజులు మాత్రమే ఆయన సీఎంగా కొనసాగారు. అయితే పలు వివాదాలు చెలరేగిన నేపథ్యంలో నవంబర్ 12న ఆయన పదవి నుంచి దిగిపోయారు. అనంతరం అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.
- రాష్ట్రపతి పాలన అనంతరం 2008 మే 30న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ సారి దాదాపు మూడేళ్ల, రెండు నెలల రెండు రోజులు పాటు పదవిలో కొనసాగారు. కుదురుగా ఐదేళ్లు పరిపాలన అందిస్తారనుకున్న సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2011 జులై 31న యడ్యూరప్ప రాజీనామా చేశారు.
- చివరగా 2018లో జరిగిన ఈ ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద మెజారిటీ పార్టీగా అవతరించింది. దీంతో గవర్నర్ వజుభాయ్ వాలా ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 111 సీట్లు లేవంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. నేడు (శనివారం) విశ్వాస పరీక్ష పెట్టకముందే తన సీఎం పదవికి రాజీనామా చేశారు
అయితే తగిన సంఖ్యాబలం లేని కారణంగా ఆయన మూడో సారి తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 55 గంటలు మాత్రమే సీఎంగా విధులు నిర్వర్తించారు. ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరి ఉంటే యడ్యూరప్ప సీఎంగా కొనసాగేవారు.
Comments
Please login to add a commentAdd a comment