
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాలతో పాటు కావేరీ జల వివాదంపై దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర స్థాయిలో స్పందించారు. కావేరీ జల వివాదంపై రజనీ చేసిన వ్యాఖ్యలను తాను స్వీకరించలేనన్నారు. కుమారస్వామి ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి రజనీకాంత్, తాను ఏ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులం కాదన్నారు. సాధారణ పౌరుడిగా నేను రజనీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓసారి ఇక్కడికి వచ్చి రిజర్వాయర్లలో నీటి నిల్వను పరిశీలించండి. మా రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో గమనిస్తే రజనీకాంత్ తన మనసు మార్చుకుంటారని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించి మంత్రి మండలిపై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఐదేళ్లపాటు ప్రభుత్వం కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కుమారస్వామి చర్చించనున్నారు.
రజనీ మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో ఆదివారం భేటీలో రజనీ మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. బలపరీక్షకు 15 రోజులు గడువు ఇవ్వడం జోక్ అన్న రజనీ.. కావేరీ జలాల బోర్డును కర్ణాటక ఆధీనంలో కాకుండా.. సీనియర్ ఐఏఎస్ పర్యవేక్షణలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో రజనీ కర్ణాటకలో తమ పరిస్థితులు అర్థం చేసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని కుమారస్వామి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment