సాక్షి, బెంగళూరు: హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిన నేపథ్యంలో మంత్రిమండలి కూర్పుపై ప్రస్తుతం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రిమండలి విషయంలో రెండు పార్టీలు ఆమోదయోగ్యమైన నిర్ణయానికి వచ్చేందుకు ప్రస్తుతం తీవ్రస్థాయిలో మేథోమథనాన్ని జరుపుతున్నాయి. మంత్రిమండలి కూర్పుపై శనివారం సాయంత్రం కాంగ్రెస్-జేడీఎస్ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఆదివారం కూడా ఈ చర్చలు కొనసాగనున్నాయి. ఇరుపార్టీలకు ఆమోదయోగ్యమైన ఫార్మూలా తెరపైకి వచ్చేవరకు చర్చలు కొనసాగనున్నాయి. 20-13 ఫార్మూలా ప్రకారం కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల మధ్య కేబినెట్ బెర్తులు పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు ఈ చర్చలను దగ్గర నుంచి గమనిస్తున్న సన్నిహిత వర్గాలు తెలిపాయి. 78 ఎమ్మెల్యేలను గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి గరిష్టంగా 20 కేబినెట్ బెర్తులను ఇవ్వాలని, ఇక, జేడీఎస్‌కు 13 బెర్తులను అప్పగించాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు.
ముఖ్యమంత్రి పదవితోపాటు ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా కుమారస్వామి తనతోపాటు ఉంచుకునే అవకాశముందని అంటున్నారు. అధిక ఎమ్మెల్యే సీట్లు ఉన్నప్పటికీ సీఎం సీటును వదులుకున్న కాంగ్రెస్ పార్టీ.. కేబినెట్ బెర్తుల విషయంలో గట్టిగా పట్టుబట్టాలని భావిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ జీ పరమేశ్వరకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని భావిస్తున్నారు. ఇక, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్‌కు కూడా కీలక కేబినెట్ బెర్తు ఖాయమని వినిపిస్తోంది. కేబినెట్ బెర్తుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ‘కేబినెట్ కూర్పు విషయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. మాది జాతీయ పార్టీ అయినప్పటికీ రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌కు మద్దతునిచ్చాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ కూర్పులో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తాం’ అని ఖర్గే అన్నారు. బుధవారం కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రిమండలి కూడా ప్రమాణస్వీకారం చేయనుందని తెలుస్తోంది.
Published Sun, May 20 2018 12:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment