కుమారస్వామి, శివకుమార్ (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కేబినెట్ కూర్పుపై చర్చలు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య మంత్రి పదవుల పంపకాలపై అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. కీలక పదవులైన హోంశాఖను కాంగ్రెస్‌కు అప్పగించాలని, జేడీఎస్‌కు ఆర్థిక శాఖ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్థికశాఖను ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్వహించనున్నారు. హోంమంత్రి రేసులో కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, రామలింగారెడ్డి ఉండగా, మరికొందరు సీనియర్లు తమకు పదవి ఇస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరో కీలకశాఖ విద్యుత్ శాఖను తమకు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతోంది. నేటి (గురువారం) సాయంత్రం కర్ణాటక కేబినెట్‌పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కర్ణాటక ప్రజలు పట్టం కట్టకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. తొలుత అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ వజుభాయ్ వాలా అవకాశం ఇవ్వగా యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేశారు. ఆపై సంఖ్యాబలం లేని కారణంగా బలనిరూపణకు వెళ్లకుండానే యెడ్డీ రాజీనామా చేయగా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బలాన్ని నిరూపించుకున్న సీఎం కుమారస్వామి ఐదేళ్లపాటు ప్రభుత్వం నడిపించడం, మంత్రి పదవుల కేటాయింపులపై కాంగ్రెస్ అధిష్టానంతో సమాలోచన చేశారు.
ఆర్థిక, హోం, ప్రజా పనులు, విద్యుత్తు, నీటిపారుదల, పట్టణాభివృద్ధి తదితర కీలక మంత్రిత్వ శాఖల పంపకాలపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర ఇప్పటికే ప్రమాణం చేశారు. ఒప్పందం ప్రకారం ఇంకా కాంగ్రెస్‌కు 21, జేడీఎస్‌కు 11 మంత్రిపదవులు దక్కాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment