సాక్షి, బెంగళూరు: మరికొద్ది గంటల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు కౌంటింగ్‌కు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గెలుపు ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ వైపే మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రారంభానికి ముందు తెర వెనుక మంతనాలు తారాస్థాయికి చేరాయి.
జేడీఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ఆ పార్టీకి గాలమేస్తున్నాయి. జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కుమారస్వామితో అంతర్గతంగా చర్చలు కొనసాగిస్తున్నాయి. దీనికితోడు ఉన్నపళంగా కుమారస్వామి సింగపూర్ వెళ్లటం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్య పరీక్షల కోసమని పార్టీ శ్రేణులు చెబుతున్నప్పటికీ, సింగపూర్ నుంచే ఆయన రాజకీయ పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఓవైపు సిద్ధరామయ్య జేడీఎస్‌తో పొత్తు విషయంపై సంకేతాలు ఇవ్వగా.. మరోవైపు బీజేపీ కూడా దోస్తీ కోసం ప్రతిపాదన పంపింది. అయితే గత అనుభవాల దృష్ట్యా బీజేపీతో పొత్తు వద్దని జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధాని దేవగౌడ తనయుడు కుమారస్వామికి ఇదివరకే హెచ్చరికలు జారీ చేశారు.
అయితే కుమారస్వామి మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తూ.. రహస్యంగా ఇరు పార్టీలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రికల్లా ఆయన బెంగళూరు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం వెలువడబోయే ఫలితాలు, ఒకవేళ ఎగ్జిట్ ఫలితాల జోస్యం నిజమైతే జేడీఎస్ మద్ధతు ఎవరికి? తదితర పరిణామాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
కాయ్ రాజా కాయ్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. మంత్రుల స్థానాలతోపాటు కీలక అసెంబ్లీ స్థానాలపై ఈ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. వాహనాలు, క్యాష్, ఆస్తులు, భూములు ఇలా అన్నింటిపైనా పందెం రాయుళ్లు బెట్టింగ్‌లు కాస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పదుల సంఖ్యలో అరెస్టులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment