
కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: బల నిరూపణ కంటే ముందే యెడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వేళ.. కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీజేపీ అప్రజాస్వామిక ప్రయత్నాలు విఫలం అయ్యాయని, మెజార్టీ కోసం వాళ్లు చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విభాగం ట్వీట్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమి.. ఇక తటస్థ ప్రభుత్వంతో అభివృద్ధిపై దృష్టిసారిస్తుందని పేర్కొంది. మరోపక్క సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు.
‘బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ దారుణంగా విఫలం అయ్యింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న వాళ్ల ప్రయత్నాలు బెడిసి కొట్టింది. అసమర్థుడినని ఒప్పుకున్న యెడ్యూరప్ప సభ నుంచి పరారయ్యారు. కర్నాటకలో ప్రజాస్వామ్యం వర్థిల్లింది’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ‘బీజేపీ కుట్ర ఫలించలేదు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాలనుకుని నిండా మునిగిపోయారు’ అని సిద్ధరామయ్య ఓ ట్వీట్ కూడా చేశారు. ‘ప్రజలే స్పీకర్లుగా మారి అసెంబ్లీలో జరిగిన మొత్తాన్ని వీక్షించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యానిదే గెలుపు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ట్వీట్ చేశారు. బీజేపీ ‘హైజాక్ కర్ణాటక అసెంబ్లీ ఫెయిల్’ అయ్యిందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణ్ దీప్ సింగ్ సుజ్రేవాలా పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లట్, దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లు పరిణామాలపై హర్షం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు స్పందిస్తూ... బీజేపీ కుయుక్తులు ఫలించలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment