గువాహటి: అస్సాం నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత, నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. రాష్ట్ర 15వ సీఎంగా సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం తమ శాసనసభా పక్ష నేతగా శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత ఎన్‌డీఏ కూడా ఆయనను తమ శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
ఈ రేసులో ఎట్టకేలకు శర్మ విజయం సాధించారు. పార్టీ అధిష్టానం ఈ ఇద్దరు నేతలను శనివారం ఢిల్లీకి పిలిపించి, చర్చలు జరిపింది. శాసనసభాపక్ష భేటీలో హిమంత బిశ్వ శర్మ పేరును సర్బానంద సోనోవాలే ప్రతిపాదించడం విశేషం. అన్ని కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ అసెంబ్లీ భవనంలోని బీజేపీ కాన్ఫరెన్స్ హాల్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి శర్మ, సోనోవాల్ కలిసి ఒకే వాహనంలో వచ్చారు. అంతకుముందు, ఉదయం సీఎం సర్బానంద సోనోవాల్ గవర్నర్ జగదీశ్ ముఖికి రాజీనామా సమర్పించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడ్డాయి. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా, బీజేపీ సొంతంగా 60 సీట్లలో విజయం సాధించింది.
సోనోవాల్ నా మార్గదర్శి
హిమంత బిశ్వ శర్మ ఆదివారం సాయంత్రం గవర్నర్ జగదీశ్ ముఖిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఎన్డీయే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. శర్మతో పాటు సీఎం పదవి నుంచి దిగిపోతున్న సర్బానంద సోనోవాల్ కూడా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అస్సాం సీఎంగా శర్మతో సోమవారం మధ్యా హ్నం 12 గంటలకు శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు, శర్మ మాట్లాడుతూ.. సర్బానంద సోనోవాల్ తనకు మార్గదర్శిగా కొనసాగుతారన్నారు.
ముఖ్యమంత్రిగా ప్రజాసేవకు అవకాశం కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితర నేతలు, రాష్ట్ర ప్రజలకు శర్మ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా నిజాయితీగా, నిబద్ధతతో పని చేస్తానన్నారు. ముఖ్యమంత్రిగా సోనోవాల్ గొప్పగా పనిచేశారని, ఆయన హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని సోనోవాల్‌పై శర్మ ప్రశంసలు గుప్పించారు. ముందు చూపున్న, రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసిన, విలువలతో కూడిన నేత సోనోవాల్ అని పేర్కొన్నారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోదీ ఈశాన్య ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, తాజా ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్రమంతా పర్యటించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు.
అస్సాంను మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తారు
శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన హిమంత బిశ్వ శర్మ తనకు తమ్ముడులాంటి వాడని తాత్కాలిక సీఎం సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్‌డీఏ పక్షాల సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘హిమంతకు పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఆయనకు నా ప్రేమ, ఆశీస్సులు అందజేస్తున్నాను. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తారు’ అని ఆకాంక్షించారు.
Himanta Biswa Sarma: అస్సాం సీఎంగా హిమంత
Published Mon, May 10 2021 4:50 AM | Last Updated on Mon, May 10 2021 9:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment