విందు సందర్భంగా కాబోయే మంత్రులతో కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(51) ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదానం వేదిక కానుంది. మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్ ఈసారి.. రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులు ఉంటారని ఆప్ నేత మనీశ్ సిసోడియా వెల్లడించారు.
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సుమిత్ నగల్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐఐటీ సీటు సాధించిన విజయ్ కుమార్, మొహల్లా క్లినిక్ డాక్టర్ ఆల్కా, బైక్ అంబులెన్స్ సర్వీస్ అధికారి యుధిష్టిర్ రాఠీ, నైట్ షెల్టర్ కేర్ టేకర్ సబీనా నాజ్, మెట్రో పైలట్ నిధి గుప్తా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి 1.25లక్షల మంది ప్రజలు తరలివస్తారని భావిస్తున్నామని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రధాని మోదీతోపాటు ఢిల్లీకి చెందిన బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ప్రజలను ఆహ్వానించారు. రాంలీలా మైదానం, పరిసరాల్లో ఢిల్లీ పోలీసు, పారామిలిటరీ దళాలు, సీఆర్‌పీఎఫ్ కలిపి సుమారు 3 వేల మందిని మోహరించనున్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతోపాటు మైదానం చుట్టుపక్కల బ్యాగేజి స్కానర్లను, డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లను అమర్చారు. మైదానంలోపలా బయటా ‘ధన్యవాద్ ఢిల్లీ’ అంటూ కేజ్రీవాల్ ఫొటో ఉండే భారీ కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు.
ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: బీజేపీ
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ జారీ చేసిన ఆదేశాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కోరారు. ఈ ఆదేశం నియంతృత్వాన్ని తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానిం చారు. ఉపాధ్యాయులకు తాము ఆహ్వానాలు పంపామేతప్ప, ఆదేశాలు కాదని ఆప్ నేత మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు.
కాబోయే మంత్రులకు కేజ్రీవాల్ విందు
ఢిల్లీ అభివృద్ధి కార్యాచరణతోపాటు వచ్చే మూడు నెలల్లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కేజ్రీవాల్ కాబోయే మంత్రులతో చర్చించారు. గత మంత్రివర్గంలోని ఆరుగురికి శనివారం తన నివాసంలో కేజ్రీవాల్ విందు ఇచ్చారు. ఢిల్లీలో రెండు కోట్ల మొక్కలు నాటడం, యమునా నదిని శుద్ధి చేయడం, కాలుష్యం తగ్గించడం వంటి ప్రజలకిచ్చిన 10 హామీల అమలుకు రంగంలోకి దిగాలని సహచరులను కేజ్రీవాల్ కోరారని ఆప్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు. గత మంత్రివర్గంలో ఉన్న సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్ సహా ఆరుగురు మంత్రులు కేజ్రీవాల్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment