మతభావోద్వేగాలను రెచ్చగొడుతూ బీజేపీ అధినాయకత్వం ఎన్నికల్లో సాగించిన ప్రచారాన్ని ఢిల్లీ ఓటర్లు తిప్పికొట్టారు. మోదీ, అమిత్ షాలతో సహా బీజేపీ ప్రచారంలో ఆర్థిక సంక్షోభం నివారణ, ఉపాధికల్పన, విద్యా, వైద్యం వగైరాల ఊసేలేదు. మరోవైపు అందివచ్చిన విజయాన్ని స్వీయ తప్పిదాలతో చేజార్చుకోకుండా కేజ్రీవాల్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అభివృధ్ధి మంత్రాన్నే ఎంచుకున్నారు. మోదీ, అమిత్ షాలు తనను ఎంత రెచ్చగొట్టినా స్పందించలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్నప్పటికీ షహీన్ బాగ్ శిబిరానికి వెళ్ళలేదు. ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, ఉచిత వైద్యం పథకాలు, విద్యా రంగంలో సంస్కరణలు కేజ్రీవాల్‌కు ‘అనుకూల వాతావరణం’ కల్పించాయి. బీజేపీ చీలిక విధానాలను పక్కకు తోసి అభివృద్ధిని దేశ రాజకీయ ఎజెండాగా మార్చడానికి ఢిల్లీ ఎన్నికలు నాంది పలికాయి. అందుకు దోహదపడిన ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు అభినందనలు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమకారులకు, గొప్ప ఊరట నిచ్చాయి. దేశాన్ని మతోన్మాద కారు మేఘాలు కమ్ముకుంటున్న ఒక చారిత్రక దశలో ఒక తొలకరి జల్లులా వచ్చిన ఫలితాలివి. మతోన్మాదంపై అభివృధ్ధి మంత్రం సాధించిన విజయం ఇది. 1992 డిసెంబరులో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత చెలరేగిన మత భావోద్వేగాలు సానుకూలంగా మారడంతో 1993 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఎన్నికల నినాదాలు రూపొందించడంలో గొప్ప నైపుణ్యం వున్న కమలనాథులు ‘‘ఇప్పుడు మినీ భారత్ (ఢిల్లీ) గెలిచాం, రేపు బిగ్ – భారత్ గెలుస్తాం’’ అంటూ అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రచారం చేసేవారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలు బిగ్–భారత్‌ను గెలిచాయి కానీ మినీ భారత్‌కు 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని చేపట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. కేంద్రంలోని అధికార పక్షం ఈసారి మినీ భారత్ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ‘‘దేశ్ బద్లా– అబ్ ఢిల్లీ బద్లో’’ (దేశం మారింది; ఇప్పుడు ఢిల్లీ నువ్వు మారు)! అనే నినాదంతో రంగంలో దిగింది. అయితే ఈ నినాదంలో ఒక తిరకాసు వుంది. లోక్‌సభ ఎన్నికల్లో మారిన దేశంలో ఢిల్లీ లేదా? అనే సందేహం వస్తుంది. నిజానికి దేశంలోని పది రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం బీజేపీయేతర ప్రభుత్వాలున్నాయి. దేశమంతా మారలేదనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా?
బీజేపీ ప్రచారం మొత్తం చీలిక విధానాలు, మతోన్మాద రాజకీయాలతోనే సాగింది. ఈ ఎన్నికల్ని ‘షహీన్ బాగ్‌పై భారత్ యుద్ధం’గా ఒకరు చిత్రిస్తే ‘పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం’గా మరొకరు చిత్రిం చారు. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర శాఖకు మనోజ్ తివారి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే బీజేపీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేíపీ నడ్డా ఉన్నారు. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలే స్వయంగా పార్టీ ప్రచారాన్ని, వ్యూహాలు ఎత్తుగడల్ని దగ్గరుండి నడిపించారు. మతభావోద్వేగాలు, లౌకిక విలువల మధ్య ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో కాంగ్రెస్ వుంది. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసి యుధ్ధరంగాన్ని వదిలివేయడంవల్ల ఆప్‌కు లాభిం చిన మాట నిజమేగానీ బీజేపీ ఓటమికి కాంగ్రెస్ తోడ్పడిన మాట అంతకన్నా వాస్తవం. ఇప్పటి పరిస్థితిలో కాంగ్రెస్ చురుగ్గా పనిచేసివుంటే అది బీజేపీకి లాభించివుండేది. బీజేపీ ప్రచారంలో ఆర్థిక సంక్షోభం నివారణ, ఉపాధికల్పన, విద్యా, వైద్యం వగైరాల ఊసేలేదు. మోదీ పాల్గొన్న సభలు సహితం ఆ బాటలోనే నడిచాయి. అభివృధ్ధి గురించి ఒక్క మాటైనా ప్రస్తావించలేదు.
షహీన్ బాగ్ ఉత్తేజంతో దేశంలో ఇప్పుడు దాదాపు 150 సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్íసీ వ్యతిరేక శిబిరాలు నడుస్తున్నాయి. ఒక చేతితో మువ్వన్నెల జాతీయ జెండాను, ఇంకో చేతితో రాజ్యాంగాన్ని పట్టుకుని, ఒళ్ళో మహాత్మా గాంధీజీ, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ల ఫొటోలు పెట్టుకుని, రాజ్యాంగ ప్రవేశికలోని ‘‘న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం’’ ఆదర్శాలను నినదిస్తూ సాగుతున్న మహత్తర లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ఇది. భావోద్వేగాలను రెచ్చగొట్టిమినీ భారత్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా లబ్ధి పొందడానికే బీజేపీ ముహూర్తం చూసి సరిగ్గా డిసెంబరులోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చింది. కేవలం ముస్లింలు మాత్రమే సీఏఏను వ్యతిరేకిస్తున్నారనే సంకేతాలు ఇచ్చి హిందూ ఓటు బ్యాంకును సమీకరించాలని స్వయంగా ప్రధాన మంత్రి కూడా ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆలస్యం అయిపోయింది. సిక్కులు మొదటి నుండీ షహీన్ బాగ్ నిరసనకారులకు అండగా వున్నారు. ఆ పిదప క్రైస్తవులేగాక, హిందూ సమాజానికి చెందిన అనేక సమూహాలు ఆ శిబిరానికి చేరుకున్నాయి. రోజూ షహీన్ బాగ్ శిబిరంలో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ మతసామరస్య పరిణామాల్ని మోదీజీ–అమిత్ జీ ద్వయం ఊహించలేదు. అది వారికి జీర్ణం కావడంలేదు.
మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనిని ముందుగా బీజేపీ ఎంపీ ప్రవేశ్ వర్మ మొదలెట్టారు. ‘‘షహీన్ బాగ్ నిరసనకారులు మీ ఇళ్ళలోనికి దూరి మీ మహిళల్ని చెరుస్తారు, మీ సోదరుల్ని హత్యలు చేస్తారు’’ అని జనాన్ని రెచ్చగొట్టారు. ప్రవేశ్ వర్మ మీద ఎన్నికల కమిషన్ నాలుగు రోజుల నిషేధాన్ని విధించింది. నిషేధం నుండి తిరిగి వచ్చిన వర్మ మరీ రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఏకంగా టెర్రరిస్టు అన్నారు. మళ్ళీ ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది. ఒక్క వారంలో రెండుసార్లు ఎన్నికల కమిషన్ నిషేధించడంతో పార్టీలో వర్మ స్థాయి పెరిగిపోయింది. రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చను ప్రవేశపెట్టే కీలక బాధ్యతను ప్రవేశ్ వర్మకు అప్పగించారు. ప్రజల్ని ఎంతగా రెచ్చగొడితే పార్టీలో అంత పెద్ద పీట వేస్తాం అని సంకేతాలిచ్చారు మోదీజీ–అమిత్ జీ. ప్రవేశ్ వర్మ ప్రేరణతో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇంకా రెచ్చిపోయారు. ‘‘దేశ్ కే గద్దారో కో; గోలీ మారో సాలో కో’’ (సాలేగాళ్ళు దేశద్రోహులు; కాల్చిచంపండి వాళ్ళని) అని రెచ్చగొట్టారు.
గాంధీజీని హత్య చేసిన రోజైన జనవరి 30న జామియా మిలియా శిబిరం వద్ద ఒక ఆగంతకుడు నిరసనకారుల మీద కాల్పులు జరిపాడు. ఆ తరువాత మరో మూడు రోజుల్లో షహీన్ బాగ్ దగ్గర రెండుసార్లు ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వీరుళ్ళు ముగ్గురూ ‘దేశ్ కే గద్దారో కో; గోలీ మారో సాలో కో’ నినాదాలే ఇవ్వడం విశేషం. ప్రచారంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తన సహజశైలిలో బుల్లెట్ల భాష మాట్లాడారు. షహీన్ బాగ్ నిరసనకారులు ‘‘మాటల భాషతో వినకపొతే తూటాల భాష దారికి తెస్తుంది’’ అన్నారాయన. కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్ తదితరులు తమ వంతు ఆజ్యం పోశారు. ప్రచారసారథి అమిత్ షా చెలరేగిపోయారు. ‘‘మీరంతా ఈవీఎం బటన్‌ను ఎంత గట్టిగా నొక్కాలంటే ఆ షాక్ షహీన్ బాగ్‌కు కొట్టాలి’’ అని పిలుపిచ్చారాయన. ‘‘11వ తారీఖున ఎన్నికల్లో మనం గెలిచిన వార్త రాగానే సాయంత్రం ఆరు గంటల లోగా విద్యార్థి నాయకులు షర్జీల్ ఇమామ్, కన్హయ్య కుమార్‌ల మీద చార్జిషీట్ తయారయిపోతుంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడిన గంటలోపులోనే వాళ్ళు జైల్లో వుంటారు’’ అన్నారాయన. ఇంతటి ద్వేషపూరిత ప్రచారం గతంలో ఎన్నడూ చూడలేదు.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం చేజిక్కగానే బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షా చేసిన మొదటి ప్రకటన ‘‘ఒక్క పార్టీ కూడా తమ ప్రణాళికల్లో లౌకికవాదం ఊసే ఎత్తలేదు’’ అని. లౌకికవాదాన్ని భారత ప్రజలు తిరస్కరించారు అని చెప్పడం వారి అభిమతం. అలాగే, ఢిల్లీ ఎన్నికల్లో గెలవగానే ప్రజలు అభివృధ్ధిని కోరుకోవడంలేదు; వాళ్ళకు మత భావోద్వేగాలే ముఖ్యం అని ప్రకటించి వుండేవారు. అదృష్టవశాత్తు వారికి ఆ అవకాశం రాలేదు. మరోవైపు, ఈ ఎన్నికల్లో నోటిఫికేషన్ వెలువడిన రోజే ఆప్ గెలుపు ఖాయం అయిపోయింది. అందివచ్చిన విజయాన్ని స్వీయ తప్పిదాలతో చేజార్చుకోకుండా కేజ్రీవాల్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మోదీ, అమిత్ షాలు తనను ఎంత రెచ్చగొట్టినా స్పందించలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్నప్పటికీ షహీన్ బాగ్ శిబిరానికి వెళ్ళలేదు. కేవలం అభివృధ్ధి మంత్రాన్నే ఎంచుకున్నారు. సీబీఎస్‌ఈ పరీక్షల్లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ సగటుకన్నా, ప్రైవేటు విద్యా సంస్థల కన్నా మెరుగైన ఫలితాలను సాధించారు. ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, ఉచిత వైద్యం పథకాలు, విద్యా రంగంలో సంస్కరణలు కేజ్రీవాల్‌కు ‘‘అనుకూల వాతావరణం’ కల్పించాయి. కమలనాథులకు రాజకీయ ప్రాణవాయువుగా పని చేస్తున్న మతోన్మాదాన్ని, చీలిక విధానాలని పక్కకు తోసి అభివృధ్ధిని దేశ రాజకీయ ఎజెండాగా మార్చడానికి ఈ ఎన్నికలు నాంది పలికాయని ఆశించవచ్చు. అందుకు దోహదపడిన ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు అభినందనలు.
డానీ
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు, రచయిత,
సమాజ విశ్లేషకులు ‘ మొబైల్: 90107 57776
Comments
Please login to add a commentAdd a comment