సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కపిల్ మిశ్రా గురవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఫిబ్రవరి 8న భారత్-పాకిస్తాన్ మధ్య పోరు జరుగుతోంది. దీని కోసం మారాణాయుధాలతో పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ సమీపంలోని షెహన్‌బాగ్‌కు చేరుకుంది. భారత్ చట్టాలను గౌరవించకుండా అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నుతోంది’ అని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆమ్‌ఆద్మీ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార ఆప్ సర్కార్‌పై బీజేపీ నేతలు మాటాల దాడిని ప్రారంభించారు. ఢిల్లీలోని మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కపిల్ మిశ్రా బరిలో నిలిచారు.
అయితే బుధవారం ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై ఆప్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్‌లో పొందుపరిచారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా వారు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతల చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన కపిల శర్మ ఆ పార్టీనేతలను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా అభివర్ణించారు. కాగా ఆయన వ్యాఖ్యలపై ఆప్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలిన ఈసీని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్రాపై గతంలో శాసనసభలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తీరుతో తీవ్రంగా విభేదించిన మిశ్రా పార్టీకి రాజీనామా చేసి గత ఆగస్ట్‌లో బీజేపీలో చేరారు.ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment