న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు పెరుగుతోంది. రోజురోజుకి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా మరోసారి ట్విటర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ముస్లిం లీగ్‌గా మార్చుకోవాలి. ఉమర్ ఖలీద్, అఫ్జల్ గురు, బుర్హాన్ వనీ వంటి ఉగ్రవాదులను తమవారిగా భావించేవారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కి భయపడుతున్నారు’ అంటూ ఆప్‌పై కపిల్‌మిశ్రా విమర్శలు గుప్పించారు. కాగా ఆప్ నేత సంజయ్ సింగ్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మత కలహాలు సృష్టిస్తారని.. ఢిల్లీలో ఆయన ప్రచారం చేయకుండా నిషేధించాలని వ్యాఖ్యానించారు. సంజయ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యలో కపిల్ మిశ్రా ఆప్‌పై వివాదాస్పద విమర్శలు చేయడం గమనార్హం.
ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్- పాక్ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్ తన ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా స్పందించి కపిల్ మిశ్రాపై 48 గంటల పాటు ఢిల్లీలో ప్రచార నిషేధం విధించింది. ఈ నిషేదం తర్వాత మళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కపిల్ మిశ్రా మరోసారి తీవ్రమైన విమర్శలకు దిగారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment