సాక్షి, శ్రీకాకుళం: ‘జనానికి మేలు చేయాలన్న మనస్తత్వం ఉండాలి. అనుకునేదానిని ఆచరణలో పెట్టాలన్న పట్టుదల అణువణువునా జ్వలించాలి. కార్యాచరణ ప్రణాళికపై స్పష్టత కుదరాలి. అడుగు ముందుకేయాలన్న ఆరాటం అంతరంగంలో అలలా వెల్లువెత్తాలి. ఇన్ని కలగలిస్తేనే ఓ పాలకుడి వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.’ పై లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న నాయకుడే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి నేటికి 1000 రోజులైంది. ఈ వెయ్యి రోజుల పాలనలో సిక్కోలుపై సంక్షేమ పథకాల జల్లు కురిసింది. కోవిడ్ సమయంలోనూ ఏ పథకాన్నీ ఆపకుండా కొనసాగించారు. జిల్లాలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య పరంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఆరోగ్యమస్తు..
►కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు వీలుగా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇందుకు అనుసంధానంగా కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేశారు. ఇప్పుడా పనులు జోరుగా సాగుతున్నాయి.
►సీతంపేటలో రూ.49 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేశారు.
►ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ని ఏడు మండలాలకు ఇంటింటికీ మంచినీటిని కుళాయిల ద్వారా నిరంతరం అందించేలా ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇందుకోసం రూ.700 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు.
►ఆరోగ్యశ్రీ పథకంతో పాటు – నాడు–నేడు కింద 83 ఆస్పత్రులను అభివృద్ధి చేశారు.
►పాతపట్నం 50 పడకల సామాజిక ఆస్పత్రిని రూ.4.2కోట్లతో, జొన్నవలస ఆస్పత్రిని రూ.2.45కోట్లతో, లావేరులో రూ.1.20 కోట్లతో, సోంపేట సామాజిక ఆస్పత్రిని రూ. 4.60కోట్లతో, బారువ సామాజిక ఆస్పత్రిని రూ.5.60కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.
చదవండి: (కోవిడ్ తర్వాత పెరిగిన ఆ సమస్యలు.. జాగ్రత్త లేకుంటే ప్రమాదమే..)
అతివలకు అండగా..
జిల్లాలో వైఎస్సార్ చేయూత కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కులాల మహిళలకు ఒక్కో ఏడాదికి రూ.18,750 చొప్పున 10,309 మందికి అందజేస్తున్నారు. వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా సంఘాలు గత ఎన్నికల ముందు తీసుకున్న రుణాన్ని ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తోంది. 51,764 సంఘాల్లోని 5,71,369 మందికిరూ.1508.71కోట్లు చెల్లిస్తోంది. ఇప్పటికే రెండు విడతల రుణ మొత్తాన్ని మహిళల ఖాతాలకు జమ చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద బ్యాంకుల నుంచి డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలపై పడిన వడ్డీ తిరిగి చెల్లించే కార్యక్రమం కింద 2020లో 48,634 సంఘాల్లోని 5,48,723 మందికి రూ.31.68కోట్లు, రెండో విడత కింద 53,950 సంఘాలకు రూ.31.92కోట్లు చెల్లించింది.
గంగపుత్రుల బెంగ తీరేలా..
భావనపాడులో రూ.3200కోట్లతో పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే బుడగట్లపాలెంకు రూ. 332కోట్లతో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేశారు. మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణం చేపడుతున్నారు. మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ అందజేస్తున్నారు.
విద్యకు అగ్రపీఠం
►జగనన్న అమ్మఒడి కింద 2020లో 2,41,562 మందికి రూ.362.34కోట్లు, 2021లో 3,48,331 మందికి రూ.487.86కోట్లు చెల్లించింది. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది.
►జగనన్న విద్యా కానుక కింద 2020లో 2,49,405మందికి, 2021లో 2,74,509 మందికి కిట్లు పంపిణీ చేసింది. జగనన్న విద్యావసతితో విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది.
అన్నదాతకు వెన్నుదన్ను..
►జిల్లాలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీని అందించారు. నేరడి బ్యారేజీ వివాదాన్ని కొలిక్కి తెచ్చారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అగ్రీ ల్యాబ్, ఆక్వా ల్యాబ్, భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పాలకొండ, పలాసకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేశారు. వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద 27,523 మంది రైతులకు రూ.23.30 కోట్ల ప్రయోజనం చేకూర్చారు.
ఇంకా కొన్ని..
►జిల్లాలో 1,10,825 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో 91,600 ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేశారు. ఇప్పటికే 60వేల వరకు ఇళ్ల పనులు జరుగుతున్నాయి.
►3,83,590 మంది వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు.
►జగనన్న తోడు కింద వీధి చిరువ్యాపారులకు రుణ సౌకర్యం కల్పించారు.
►జగనన్న చేదోడు కింద రజక, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment