మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది ఆప్ మద్దతుదారులు (ఇన్‌సెట్లో)
ఎస్‌బీఎస్ నగర్ (పంజాబ్): ‘‘పంజాబ్ అభివృద్ధి కోసం ఈ రోజు నుంచే రంగంలోకి దిగుతాం. ఒక్క రోజు కూడా వృథా చేయం. మనమిప్పటికే 70 ఏళ్లు ఆలస్యమయ్యాం. అవినీతి, నిరుద్యోగాలను రాష్ట్రం నుంచి పారదోలతాం’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ సింగ్ మాన్ (48) ప్రతిజ్ఞ చేశారు. పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
భగత్‌సింగ్ స్వగ్రామం కట్కర్‌కలాన్‌లో భారీ జన సందోహం సమక్షంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. భగత్‌సింగ్‌కు అత్యంత ఇష్టమైన రంగ్ దే బసంతి పాట మారుమోగుతుండగా, జనం హర్షధ్వానాల మధ్య కార్యక్రమం జరిగింది. ఆప్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు భగత్‌సింగ్‌కు చిహ్నంగా భావించే పసుపురంగు తలపాగాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనం కూడా అవే తలపాగాలు ధరించి కన్పించారు. వారినుద్దేశించి మాన్ మాట్లాడారు. ముందుగా ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై, జో బోలే సో నిహాల్ అంటూ నినదించి జనాల్లో జోష్ నింపారు. వాళ్లు కూడా ఆయనతో ఉత్సాహంగా గొంతు కలిపారు. ఆప్‌కు బంపర్ మెజారిటీ కట్టబెట్టి రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని మాన్ కొనియాడారు. ‘‘రాష్ట్రంలో స్కూళ్లు, ఆస్పత్రులను ఢిల్లీ తరహాలో మెరుగుపరుస్తాం.
వాటిని చూసేందుకు విదేశాల నుంచి కూడా జనం వచ్చేలా చేస్తాం’’ అని చెప్పారు. అహంకారానికి తావివ్వొద్దని, వినయ విధేయతలతో మసలుకోవాలని ఆప్ ఎమ్మెల్యేలకు సూచించారు. పంజాబ్ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన మాన్ కూతురు సీరత్ (21), దిల్షాన్ (17) ప్రమాణ స్వీకారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మాన్ దంపతులు 2015లో విడిపోయారు. అప్పటినుంచీ పిల్లలు తల్లితో పాటు అమెరికాలో ఉంటున్నారు.
కమెడియన్ నుంచి సీఎం దాకా...
ప్రమాణ స్వీకారం తర్వాత చండీగఢ్‌లోని సీఎం కార్యాలయంలో మాన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయనొక్కరే ప్రమాణం చేశారు. ఆయన మంత్రివర్గం శనివారం రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరిస్తుందని ఆప్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు, ఒడిశా సీఎంలు ఎంకే స్టాలిన్, నవీన్ పట్నాయక్ తదితరులు మాన్‌ను అభినందించారు. పంజాబ్ సంక్షేమానికి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కలిసి పని చేద్దామని మాన్‌తో మోదీ చెప్పారు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన మాన్ ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగి రెండుసార్లు సంగ్రూర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2022 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు ఏకంగా 92 స్థానాల్లో ఆప్ ఘనవిజయం సాధించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment