చండీగఢ్: ఆప్ సర్కార్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్‌లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకొన్నాయి. తాను పంపిన లేఖలకు సీఎం భగవంత్ మాన్ సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్.. రాష్ట్రపతి పాలన పెట్టిస్తానని, ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తానని హెచ్చరించారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
వివరాల ప్రకారం.. సీఎం భగవంత్ మాన్‌కు పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం మాన్‌ను గవర్నర్ హెచ్చరించారు. తన లేఖలకు సమాధానం ఇవ్వకుంటే ఐపీసీలోని సెక్షన్ 124 కింద క్రిమినల్ చర్యలు కూడా తీసుకొంటానని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. తాను గతంలో రాసిన లేఖలకు మీరు(సీఎం మాన్) సమాధానం ఇవ్వకపోవడం పట్ల చాలా కలత చెందానని గవర్నర్ తన తాజా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ రాష్ట్రపతికి నివేదిక పంపిస్తానని హెచ్చరించారు.
పొలిటికల్ హీట్..
అంతేకాకుండా.. శిక్షణ నిమిత్తం 36 మంది పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను విదేశాలకు పంపడంతో పాటు పలు ఇతర అంశాలపై తాను గతంలో రాసిన లేఖ ద్వారా సమాచారం కోరానని, అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమస్యను నివారించేందుకు తీసుకొన్న చర్యలపై వివరాలు కోరానని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా సమాధానం నిరాకరిస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. గత కొన్నేండ్లుగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీలు పెరుగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. గవర్నర్ పురోహిత్ లేఖపై ఆప్ ఘాటుగా స్పందించింది. గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పంజాబ్‌కు బదులు మణిపూర్, హర్యానాలో రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటుందని కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.. వీలైతే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సూచించింది.
ఇది కూడా చదవండి: రైలు బోగీలో పేలిన సిలిండర్.. పలువురు మృతి
Comments
Please login to add a commentAdd a comment