Cost of elections
-
ఒక్కో ఓటుపై రూ.700
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే మొత్తానికి, ఎన్నికల సంఘానికి సమర్పించే వివరాలకు పొంతన ఉండదు. తాజాగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఈసీ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన వ్యయం, తాయిలాలను ఇందులో లెక్కించినట్లు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 10 నుంచి చివరి విడత ఎన్నికలు జరిగిన మే 19 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఇతర రూపాల్లో ఖర్చుపెట్టిన మొత్తాన్ని ఇందులో కలిపినట్లు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి రూ.100 కోట్లను ఖర్చు పెట్టినట్లు తేల్చింది. అంటే ఒక్కో ఓటు కోసం సగటున రూ.700 ఖర్చు పెట్టారన్నమాట. ఒకవేళ ఈసీ ఎన్నికల నిర్వహణ ఖర్చులను, ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగిస్తే ఒక్కో ఓటుపై రాజకీయ పార్టీలు రూ.583 ఖర్చుపెట్టినట్లు అవుతుంది. పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం.. మనదేశంలో రాష్ట్రాలను బట్టి ఒక్కో లోక్‌సభ సభ్యుడు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. అదే అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయొచ్చు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 8,049 అభ్యర్థులు బరిలో నిలవగా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3,589 మంది పోటీ చేశారు. నిజానికి ఈసీ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు చేసిన వ్యయం రూ.6,639.22 కోట్లు దాటకూడదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ఖర్చు రూ.24,000 కోట్లు దాటిపోయిందని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, విలువైన లోహాలతో పాటు మత్తుపదార్థాలను సైతం తాయిలాలుగా అందించినట్లు వెల్లడైంది. కేవలం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనే రూ.1,280 కోట్ల డ్రగ్స్‌ను సీజ్ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 3 రెట్లు అధికంగా నగదును ఈసీ జప్తు చేసింది. ఎన్నికల రారాజు బీజేపీ.. ఈ సార్వత్రిక ఎన్నికల ఖర్చులో సింహభాగం బీజేపీదే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా రూ.24,750 కోట్ల నుంచి రూ.30,250 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం. మొత్తం ఎన్నికల ప్రచార వ్యయంలో బీజేపీ వాటా 45 నుంచి 55 శాతానికి చేరుకోగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 15 నుంచి 20 శాతానికి పరిమితమైంది. ధనప్రవాహం ఎక్కడిది? సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి రాకపోవడం రాజకీయ పార్టీల పాలిట వరంగా మారుతోంది. దీంతో తమకు విరాళాలు ఇచ్చింది ఎవరన్న విషయాన్ని పార్టీలు బయటపెట్టకపోవడంతో పారదర్శకత అన్నది కొరవడింది. దీనికితోడు ఎలక్టోరల్ బాండ్లు కూడా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పాతరేశాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల చివరివరకూ 4,794 ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడయ్యాయని చెప్పింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, రియల్ఎస్టేట్, మైనింగ్, టెలికం, రవాణా రంగాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనం తేల్చింది. వీటికితోడు పలు విద్యాసంస్థలు, కాంట్రాక్టర్లు, ఎన్జీవో సంస్థలు కూడా తమ ప్రయోజనాల రీత్యా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయని చెప్పింది. ఎన్నికల వ్యయ నియంత్రణ, పారదర్శకత విషయమై 54 దేశాల్లో తాము జరిపిన అధ్యయనంలో భారత్ 31 పాయింట్లు సాధించినట్లు సెంటర్ ఫర్ స్టడీస్ తెలిపింది. అంటే భారత్ ఈ జాబితాలో దిగువ నుంచి 12వ స్థానంలో ఉందని పేర్కొంది. -
కన్నడ నాట ఎన్నికల ఖర్చు 13 వేల కోట్లు!
-
కన్నడ ఎన్నికల ఖర్చు 13 వేల కోట్లు!
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో డబ్బుల వరద పారుతోంది. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు.. ఎన్నికల సంఘం సూచించిన మొత్తానికి వంద రెట్లు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీంతో కన్నడ అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలవనున్నాయి. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుతున్న సమయంలో ఏయే పార్టీలు.. ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చుచేయబోతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల ఖర్చు ఎంత? అంశాలపై ఓటర్లతోపాటు పరిశీలకుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతిష్టాత్మక పోరు కాబట్టే.. కర్ణాటక ఎన్నికలు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిచి 2019 సార్వత్రిక ఎన్నిలకు శక్తిని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. దక్షిణభారతంలో పార్టీ మనుగడ కోసం బీజేపీ శాయశక్తులా పనిచేస్తోంది. దీంతో ఇరుపార్టీలు ముఖ్యనేతలను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి.కాంగ్రెస్ తరపున అధ్యక్షుడు రాహుల్, సీనియర్ నేతలు శశిథరూర్, అశోక్ చవాన్, ఉమెన్ చాందీ, సుశీల్ కుమార్ షిండే, రఘువీరారెడ్డి సహా మాజీ కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను బీజేపీ రంగంలోకి దించింది. సగటున రూ.20 కోట్లు కన్నడ గడ్డపై 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు చేయాలి. కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు సగటున రూ.20 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాయి. రూ.30–50కోట్లు ఖర్చు చేసేవి, రూ.50–70 కోట్లు, వందకోట్లకుపైగా ఖర్చు చేసే నియోజకవర్గాలూ ఉన్నాయి. సగటున రూ.20 కోట్లుగా లెక్కేసినా.. ఒక్కోపార్టీకి 4,480 కోట్లు ఖర్చవుతుంది. కొన్ని కీలక నియోజకవర్గాల ఖర్చు పరిగణనలోకి తీసుకుంటే.. ఆ మొత్తం రూ.5 వేల కోట్ల పైమాటే. జేడీఎస్‌ను కలుపుకుంటే రూ.13 వేలకోట్లుపైనే ఉంటుందని అంచనా. ఆ మూడు చోట్ల.. 700 కోట్లు కర్ణాటకలో అత్యంత ఖరీదైన ఎన్నిక విజయనగరలో జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఎంపీవీ కిష్టప్ప, బీజేపీ తరపున హెచ్ రవీంద్ర బరిలో ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కిష్టప్ప రూ.1300 కోట్ల ఆస్తులు చూపించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. గోవిందరాజనగర్‌లో కిష్టప్ప కుమారుడు ప్రియాకృష్ణ కాంగ్రెస్‌పార్టీ నుంచి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ వీ. సోమన్న బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. అలాగే హోస్కొటే నుంచి ఎంపీవీ నాగరాజు (కాంగ్రెస్), బీజేపీ తరపున మాజీమంత్రి బచ్చేగౌడ కుమారుడు శరత్ బరిలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఏ మాత్రం ఖర్చుకు వెనకాడటం లేదు. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు జేడీఎస్ అభ్యర్థుల ఖర్చు మొత్తం రూ.700 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. బాదామీలోనూ బారెడు ఖర్చు బాదామీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీజేపీ ఎంపీ శ్రీరాములు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇద్దరు నేతలకూ ఈ పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక్కో అభ్యర్థి 70 నుంచి 90 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పరమేశ్వర ప్రాతినిథ్యం వహిస్తున్న తుమకూరు జిల్లా కొరటగేరే, సీఎం కుమారుడు యతీంద్ర ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణతో పాటు పలు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉందని తెలుస్తోంది. మోదీ మ్యాజిక్ పనిచేయదు శివాజీనగర: ‘కర్ణాటక ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయి.. రాష్ట్రంలో ఇక ప్రధాని మోదీ మ్యాజిక్ ఏదీ పనిచేయదు’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఆదివారం బెంగళూరులోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీ ట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుతున్న భాషను ప్రజలు ఛీకొడుతున్నారు. ఒక ప్రధాని నోటి నుంచి ఇలాంటి హీనమైన మాటలను వినాల్సి వస్తుందని వారు ఊహించలేదు’ అని మండిపడ్డారు. ‘2 ప్లస్ 1, టెన్ పర్సెంట్ ప్రభుత్వం, సీధా రూపయ్య’ అంటూ తమపై వ్యాఖ్యానాలు చేయటం ఇలాంటివేనని తెలిపారు. తమపై మోదీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదనీ, సీబీఐ తదితర దర్యాప్తు సంస్థలు ఆయన ఆధీనంలోనే ఉన్నందున విచారణ జరిపించి రుజువు చేయాలని సవాల్ విసిరారు. -
ఓట్ల బాటలో ‘కోట్లు’!
అభ్యర్థుల్లో 47 శాతం మంది కోట్లకు పడగెత్తినవారే.. * రూ.రెండు వేల లోపు ఆస్తి చూపించినవారు 9 మంది * అసలు పైసా ఆస్తి కూడా లేదన్నవారు 14 మంది.. పింప్రి, న్యూస్‌లైన్: ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న పని.. అభ్యర్థిగా నిలుచున్న వ్యక్తికి నామినేషన్ వేసినప్పటినుంచి ఫలితాలు వెలువడేంతవరకు రోజూ లక్షలమీదే ఖర్చు ఉంటుంది.. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి అభ్యర్థీ ఎన్నికలైనంతవరకు కొందరు కార్యకర్తలను తనతోనే తిప్పుకోవాల్సి ఉంటుంది. దాంతో అద్దెవాహనాల అవసరం పడుతుంది. అలాగే సహచరులకు అన్ని ఖర్చులు తానే భరించాలి.. ప్రచార సభలు తప్పనిసరి.. వాటిని ఏర్పాటుచేద్దామనుకునే ప్రాంతానికి అద్దె చె ల్లించడం దగ్గర నుంచి సభ పూర్తవ్వడానికి అవసరమైన అన్ని ‘హంగు’లకూ సదరు అభ్యర్థి జేబుకు చిల్లు తప్పనిసరి.. ప్రస్తుతం బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చులు అనధికారికంగా కోట్లలోనే ఉంటాయి.. ఇటువంటి ఎన్నికలను తట్టుకోవాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారికే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ర్టంలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎంతమంది కోటీశ్వరులు.. ఎంతమంది సామాన్యులు వంటి సమాచారంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) స్వయం సేవాసంస్థ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 2,336 మంది అభ్యర్థుల్లో 1,095 మంది అంటే 47 శాతం అభ్యర్థులు రూ. కోటి, అంతకు పైగా ఆస్తులు ఉన్నట్లు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. పార్టీల వారీగా ఎన్సీపీ నుంచి మొత్తం 277 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వీరిలో 229 మంది కోటీశ్వరులు (83 శాతం), కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 287 మంది అభ్యర్థుల్లో 222 మంది (77 శాతం), బీజేపీ నుంచి 258 మంది అభ్యర్థుల్లో 210 (81), శివసేన నుంచి 278 మందిలో 197 మంది (71 శాతం), ఎమ్మెన్నెస్ నుంచి 218 మందిలో 100 మంది (46 శాతం), స్వతంత్రులు 489 మంది పోటీలో ఉండగా వీరిలో 62 మంది (13 శాతం) కోటీశ్వరులుగా తేలింది. ఇతరులు 529 మంది అభ్యర్థుల్లో 75 మంది (14 శాతం) మొత్తం అన్ని పార్టీల నుంచి 2,336 మంది పోటీలో ఉండగా వీరిలో 1,095 మంది (47) మంది కోటీశ్వర్లు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో మోహిత్ కుంబోజ్ (దిండోషి, బిజేపీ) రూ.353 కోట్లు ఆస్తులు చూపించి మొదటి స్థానంలో ఉండగా, డాక్టర్ నందకుమార్ తాస్గావ్కర్ (ఫల్టాణ, శివసేన) రూ.211 కోట్లు, మంగల ప్రభాత్ లోడా (మల్బార్ హిల్, బిజేపీ), రూ.198 కోట్లు, అబూ అసీమ్ ఆజామీ (మాన్‌ఖుర్డ్ శివాజీనగర్, సమాజ్‌వాది పార్టీ) రూ.156 కోట్లు, ప్రసాద్ మినేషా లాప్ (శివ కోలివాడ, ఎన్సీపీ) రూ.126 కోట్లు, జగదీష్ ములుక్ (వడగావ్‌శేరి, బీజేపీ) రూ.104 కోట్లు, హితేంద్ర ఠాకూర్ (వసై బహుజన వికాస్ పార్టీ) రూ.100 కోట్లు, వినయ్ బైన్ (పశ్చిమ మలాడ్-శివసేన) రూ.93 కోట్లు, హికమత్ ఉదాన్ (ధనసావంగి-శివసేన) రూ.92 కోట్లు ఆస్తులు చూపించని అభ్యర్థులు వీరే... ఒకవైపు కోట్లు ఉంటేగాని ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో కూడా వేలు, వందలు లేని అభ్యర్థులు ఉన్నారంటే ఆశ్చర్యమే. అలాంటి వారిలో తమకు ఏ ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్లో చూపెట్టిన వారు 14 మంది ఉన్నారు. వారిలో యువరాజ్ పాటిల్ (అమల్ నేర్-స్వతంత్య్ర అభ్యర్థి), సలీం అబ్దుల్ కరీం (బాలాపూర్-సమాజ్‌వాది పార్టీ), యోగేష్ కోరడే (సావనేర్-స్వతంత్ర), అశోక్ ఉమఠే (నాగ్‌పూర్ సెంట్రల్-స్వతంత్ర), చంద్రకాంత్ ఠాణేకర్ (వేగలుర్-స్వతంత్ర), ఆనంద్ పాటోల్ (పరతుర్ స్వతంత్ర), గౌతం ఆమరావు (పశ్చిమ ఔరంగాబాద్-ఎమ్మెన్నెస్), విలాస్ రణపిసే (పౌఠాణ్-స్వతంత్ర), యువరాజ్ ఆహిర్ (మాగఠాణే-ప్రబుద్ద్ రిపబ్లికన్ పార్టీ), నిలేష్ పాటిల్ (ములుండ్-బీఎస్పీ), అప్పారావు గాలఫడే (విలేపల్లి-స్వతంత్ర), జయంత్ వాఘ్మోరే (పశ్చిమ ఘాట్కోపర్ -స్వతంత్ర), షేక్ అబ్దుల్ రహీమ్ (పశ్చిమ బాంద్రా, స్వతంత్ర), సంజయ్ నకట్ (కొలాబా-బీఎస్పీ) ఉన్నారు. రూ.రెండు వేల లోపు ఆస్తి చూపించిన వారు.. మొదటి పది మందిలో సతీష్ బండారే (శిరోల్-స్వతంత్ర) రూ.822, ప్రమోద్ సుఖ్‌దేవ్ (బండారా-అంబేద్కర్ పార్టీ) రూ.1,000, జ్ఞానేశ్వర్ కురిల్ (బదనాపూర్-స్వతంత్ర) రూ.1,000, వికాస్ రోకడే (ధారావీ-స్వతంత్ర) రూ.1,000, అజిత్ మోడేకర్ (కాగల్ ఎమ్మెన్నెస్) రూ.1,000, నిలేష్ శేలార్ (పాచోరా, బహుజన్ ముక్తి పార్టీ) రూ.1,380, విశ్వాస్‌రావు ధరటే (ఇస్లాంపూర్-స్వతంత్ర) రూ.1,429, సంజయ్ సక్పాల్ (దిండోషి-స్వతంత్ర) రూ.2,000, యాసిన్ శేఖ్ (మలబార్ హిల్, స్వతంత్ర) రూ.2,050 ఆస్తి కలిగి ఉన్నట్లు తమ అఫిడవిట్లలో చూపించడం గమనార్హం.