ఓట్ల బాటలో ‘కోట్లు’! | crore's route in voters votes! | Sakshi
Sakshi News home page

ఓట్ల బాటలో ‘కోట్లు’!

Published Sun, Oct 12 2014 10:22 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

crore's route in voters votes!

అభ్యర్థుల్లో 47 శాతం మంది కోట్లకు పడగెత్తినవారే..
* రూ.రెండు వేల లోపు ఆస్తి చూపించినవారు 9 మంది
* అసలు పైసా ఆస్తి కూడా లేదన్నవారు 14 మంది..
పింప్రి, న్యూస్‌లైన్: ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న పని.. అభ్యర్థిగా నిలుచున్న వ్యక్తికి నామినేషన్ వేసినప్పటినుంచి ఫలితాలు వెలువడేంతవరకు రోజూ లక్షలమీదే ఖర్చు ఉంటుంది.. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి అభ్యర్థీ ఎన్నికలైనంతవరకు కొందరు కార్యకర్తలను తనతోనే తిప్పుకోవాల్సి ఉంటుంది.

దాంతో అద్దెవాహనాల అవసరం పడుతుంది. అలాగే సహచరులకు అన్ని ఖర్చులు తానే భరించాలి.. ప్రచార సభలు తప్పనిసరి.. వాటిని ఏర్పాటుచేద్దామనుకునే ప్రాంతానికి అద్దె చె ల్లించడం దగ్గర నుంచి సభ పూర్తవ్వడానికి అవసరమైన అన్ని ‘హంగు’లకూ సదరు అభ్యర్థి జేబుకు చిల్లు తప్పనిసరి.. ప్రస్తుతం బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చులు అనధికారికంగా కోట్లలోనే ఉంటాయి.. ఇటువంటి ఎన్నికలను తట్టుకోవాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారికే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ర్టంలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎంతమంది కోటీశ్వరులు.. ఎంతమంది సామాన్యులు వంటి సమాచారంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) స్వయం సేవాసంస్థ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 2,336 మంది అభ్యర్థుల్లో 1,095 మంది అంటే 47 శాతం అభ్యర్థులు రూ. కోటి, అంతకు పైగా ఆస్తులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
 
పార్టీల వారీగా ఎన్సీపీ నుంచి మొత్తం 277 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వీరిలో 229 మంది కోటీశ్వరులు (83 శాతం), కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 287 మంది అభ్యర్థుల్లో 222 మంది (77 శాతం), బీజేపీ నుంచి 258 మంది అభ్యర్థుల్లో 210 (81), శివసేన నుంచి 278 మందిలో 197 మంది (71 శాతం), ఎమ్మెన్నెస్ నుంచి 218 మందిలో 100 మంది (46 శాతం), స్వతంత్రులు 489 మంది పోటీలో ఉండగా వీరిలో 62 మంది (13 శాతం) కోటీశ్వరులుగా తేలింది. ఇతరులు 529 మంది అభ్యర్థుల్లో 75 మంది (14 శాతం) మొత్తం అన్ని పార్టీల నుంచి 2,336 మంది పోటీలో ఉండగా వీరిలో 1,095 మంది (47) మంది కోటీశ్వర్లు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
 
వీరిలో మోహిత్ కుంబోజ్ (దిండోషి, బిజేపీ) రూ.353 కోట్లు ఆస్తులు చూపించి మొదటి స్థానంలో ఉండగా, డాక్టర్ నందకుమార్ తాస్‌గావ్‌కర్ (ఫల్టాణ, శివసేన) రూ.211 కోట్లు, మంగల ప్రభాత్ లోడా (మల్‌బార్ హిల్, బిజేపీ), రూ.198 కోట్లు, అబూ అసీమ్ ఆజామీ (మాన్‌ఖుర్డ్ శివాజీనగర్, సమాజ్‌వాది పార్టీ) రూ.156 కోట్లు, ప్రసాద్ మినేషా లాప్ (శివ కోలివాడ, ఎన్సీపీ) రూ.126 కోట్లు, జగదీష్ ములుక్ (వడగావ్‌శేరి, బీజేపీ) రూ.104 కోట్లు, హితేంద్ర ఠాకూర్ (వసై బహుజన వికాస్ పార్టీ) రూ.100 కోట్లు, వినయ్ బైన్ (పశ్చిమ మలాడ్-శివసేన) రూ.93 కోట్లు, హికమత్ ఉదాన్ (ధనసావంగి-శివసేన) రూ.92 కోట్లు

ఆస్తులు చూపించని అభ్యర్థులు వీరే...
ఒకవైపు కోట్లు ఉంటేగాని ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో కూడా వేలు, వందలు లేని అభ్యర్థులు ఉన్నారంటే ఆశ్చర్యమే. అలాంటి వారిలో తమకు ఏ ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో చూపెట్టిన వారు 14 మంది ఉన్నారు. వారిలో యువరాజ్ పాటిల్ (అమల్ నేర్-స్వతంత్య్ర అభ్యర్థి), సలీం అబ్దుల్ కరీం (బాలాపూర్-సమాజ్‌వాది పార్టీ), యోగేష్ కోరడే (సావనేర్-స్వతంత్ర), అశోక్ ఉమఠే (నాగ్‌పూర్ సెంట్రల్-స్వతంత్ర), చంద్రకాంత్ ఠాణేకర్ (వేగలుర్-స్వతంత్ర), ఆనంద్ పాటోల్ (పరతుర్ స్వతంత్ర), గౌతం ఆమరావు (పశ్చిమ ఔరంగాబాద్-ఎమ్మెన్నెస్), విలాస్ రణపిసే (పౌఠాణ్-స్వతంత్ర), యువరాజ్ ఆహిర్ (మాగఠాణే-ప్రబుద్ద్ రిపబ్లికన్ పార్టీ), నిలేష్ పాటిల్ (ములుండ్-బీఎస్పీ), అప్పారావు గాలఫడే (విలేపల్లి-స్వతంత్ర), జయంత్ వాఘ్‌మోరే (పశ్చిమ ఘాట్కోపర్ -స్వతంత్ర), షేక్ అబ్దుల్ రహీమ్ (పశ్చిమ బాంద్రా, స్వతంత్ర), సంజయ్ నకట్ (కొలాబా-బీఎస్పీ) ఉన్నారు.
 
రూ.రెండు వేల లోపు ఆస్తి చూపించిన వారు..
మొదటి పది మందిలో సతీష్ బండారే (శిరోల్-స్వతంత్ర) రూ.822, ప్రమోద్ సుఖ్‌దేవ్ (బండారా-అంబేద్కర్ పార్టీ) రూ.1,000, జ్ఞానేశ్వర్ కురిల్ (బదనాపూర్-స్వతంత్ర) రూ.1,000, వికాస్ రోకడే (ధారావీ-స్వతంత్ర) రూ.1,000, అజిత్ మోడేకర్ (కాగల్ ఎమ్మెన్నెస్) రూ.1,000,  నిలేష్ శేలార్ (పాచోరా, బహుజన్ ముక్తి పార్టీ) రూ.1,380, విశ్వాస్‌రావు ధరటే (ఇస్లాంపూర్-స్వతంత్ర) రూ.1,429, సంజయ్ సక్‌పాల్ (దిండోషి-స్వతంత్ర) రూ.2,000, యాసిన్ శేఖ్ (మలబార్ హిల్, స్వతంత్ర) రూ.2,050 ఆస్తి కలిగి ఉన్నట్లు తమ అఫిడవిట్లలో చూపించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement