Candidate assets
-
అభ్యర్థుల ఆస్తులు.. అంతస్తులు
ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు. అయితే, కొంతమంది ఆస్తుల విలువ గతం కంటే ఇప్పుడు రెట్టింపు కాగా, మరికొంత మంది సంపద కూడా బాగానే పెరిగింది. స్వల్ప పెరుగుదల.. సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ నామినేషన్ వేసిన సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తనకు మొత్తం రూ.1.89 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు. 2014లో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ.58.50 లక్షల విలువైన ఆస్తులు ఉండేవి. వాటి ప్రకారం గత నాలుగున్నరేళ్లలో ఆయన ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. చరాస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో నగదు రూ.4,52,800, భార్య వద్ద రూ.2,46,700 ఉండగా.. 2014 లో ఆయన వద్ద రూ.2 లక్షలు మాత్రమే ఉన్నాయి. అప్పటికి, ఇప్పటికి వార్షికాదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. 2012–13 వార్షిక ఆదాయం రూ.6 లక్షలు ఉండగా, ప్రస్తుతం చూపించిన లెక్కల ప్రకారం 2017–18 వార్షికాదాయం రూ.19,72,810గా ఉంది. పాలసీలు, సేవింగ్స్ పేరిట 2014లో రూ.11 లక్షలు చూపించగా ఈ సారి రూ.15 లక్షల వరకు చూపించారు. వాహ నాలు, వాటి విలువ మారలేదు. ప్రస్తుతం కామారెడ్డి కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాలో రూ.28 లక్షలు, హైదరాబాద్ సెక్రెటేరియట్ ఎస్బీఐ బ్యాంకులో రూ.9.47 లక్షలు ఉన్నట్లుగా వెల్లడించారు. 2014లో అన్ని ఖాతాల్లో కలిపి రూ.20 వేల వరకు మాత్రమే ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే 2014లో ఆయన స్వగ్రామమైన బస్వాపూర్ వద్ద పాత ఇల్లు, 2.16 ఎకరాల వ్యవసాయ భూమి, ఎన్బీటీ నగర్ హైదరాబాద్‌లో స్వయంగా కొనుగోలు చేసిన రూ.38 లక్షల విలువైన ప్లాటు ఉండేవి. తాజాగా సమర్పించిన అఫిడవిట్ ప్రకా రం కామారెడ్డిలో రూ.45 లక్షల విలువైన ఇల్లు నిర్మించుకున్నారు. ఇవేకాకుండా ఈ నాలుగున్నరేళ్లలో రూ.25 లక్షలకు పైగా విలువైన మరో 7 ఎకరాల వ్యవసాయభూమి, రంగారెడ్డి జిల్లాలో రూ.15 లక్షల విలువైన ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. మొత్తమ్మీద గత ఎన్నికలతో పోలిస్తే గంప ఆస్తుల్లో కొద్దిపాటి పెరుగుదల ఉంది. మల్యాద్రి.. స్వతంత్ర అభ్యర్థి మల్యాద్రిరెడ్డి ఆస్తులను పరిశీలిస్తే.. ఆయన వద్ద బ్యాంకులో రూ.25 వేల డిపాజిట్, రూ.5లక్షల విలువ చేసే రెండు ఎల్ఐసీ పాలసీలు, ఒక మోటారు వాహనం, రూ.64 వేల విలువ చేసే 10 గ్రాముల బంగారం, భార్య వద్ద రూ.2.24లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగాచం, తల్లి వద్ద రూ.96 వేల విలువ చేసే 30 గ్రాముల బంగారం ఉంది. హైదరాబాద్‌లోని కొత్తపేటలో, మన్సూరాబాద్‌లో ఇళ్లు ఉన్నాయి. ఆయనపై వర్ని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ధన్పాల్ సాక్షి, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ అర్బన్‌లో శివసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నామినేషన్ దాఖలు సందర్భంగా తన ఆస్తులు వెల్లడించారు. గతంలో కంటే ఈసారి కొద్దిమేర ఆస్తులు పెరిగినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ధన్పాల్ బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ టికెట్ రాకపోవడంతో ఆయన శివసేన నుంచి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల సమయానికి ధన్‌పాల్‌కు రూ.26,55,114 విలువైన చరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.55,77,927 చరాస్తులు ఉన్నట్లు చూపారు. అప్పట్లో స్థిరాస్తుల విలువ రూ.2.71 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.3.65 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.5.44 లక్షల విలువైన ఇన్నోవా, రూ.19.6 లక్షల విలువైన క్రిస్టా, రూ.21.34 లక్షల మెర్సిడెస్ బెంజ్ కార్లున్నాయి. అలాగే, రూ.3.20 లక్షల విలువైన 105 గ్రాముల బంగారం ఉందని, 2017–18 వార్షికాదాయం రూ.5.77 లక్షలున్నట్లు చూపారు. భార్య మణిమాల పేరిట రూ.37.48 లక్షల చరాస్తులు, రూ.1.77 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన ముగ్గురు పిల్లల పేరిట రూ.4.60 కోట్ల స్థిరాస్తులు, రూ.24 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కాసుల గలగలలు.. సాక్షి, బాన్సువాడ: బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ ఆస్తులు గతంలో కంటే ప్రస్తుతం రెట్టింపయ్యాయి.! 2014 ఎన్నికల సమయంలో మొత్తం రూ.22.23 లక్షల విలువైన స్థిర, చరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.1.33 కోట్ల ఆస్తులున్నట్లు బాల్‌రాజ్ తాజాగా సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. 2014లో బాల్‌రాజ్ వద్ద నగదు రూపంలో కేవలం రూ.8 వేలు, రూ.17లక్షల విలువైన ఇన్నోవా, రూ.3లక్షల విలువైన ట్రాక్టర్, రూ.లక్ష విలువ చేసే ట్రాలీ, రూ.25 వేల విలువ చేసే బైక్, రూ.90 వేల విలువ చేసే 30 గ్రాముల బంగారం తదితరాలు కలిపి మొత్తం ఆస్తులు రూ.22,23,000 ఉన్నట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం తన వద్ద నగదు రూ.4 లక్షలు, బ్యాంకులో రూ.4.45 వేలు ఉన్నాయి. రూ.14 లక్షల విలువ చేసే ఇన్నోవా, రూ.2.65 లక్షల విలువ చేసే ట్రాక్టర్, భార్య పేర హీరోహోండా మోటర్ సైకిల్, కుమారుడి పేర మోటర్ సైకిల్ ఉన్నాయి. బాల్‌రాజ్ వద్ద రూ.1.50 లక్షల విలువ చేసే 50 గ్రాముల బంగారం, భార్య వద్ద రూ.3 లక్షల విలువ చేసే 100 గ్రాముల బంగారం, తల్లి వద్ద 1.50 లక్షల విలువ చేసే 50 గ్రాముల బంగారం ఉంది. బాల్‌రాజ్ పేర రూ.50 లక్షల విలువైన 7.05 ఎకరాల భూమి, రూ.65లక్షల విలువ చేసే ప్లాట్లు ఉన్నాయి. ఆయన ఆస్తుల మొత్తం విలువ రూ.1.33 కోట్లు కాగా, రూ.32 లక్షల అప్పులు ఉన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. పెరిగిన స్థిరాస్తులు, తగ్గిన చరాస్తులు సాక్షి,జామాబాద్అర్బన్: నిజామాబాద్ అర్బన్ టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తా తన స్థిరాస్తుల్లో పెరుగుదల ఉండగా, చరాస్తులు తగ్గినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. గణేశ్‌గుప్తా చరాస్తులు 2014 కంటే ఇప్పుడు రూ.17.90 లక్షల మేర తగ్గాయని, రూ.7.50 కోట్ల మేర స్థిరాస్తులు పెరిగినట్లు చూపించారు. 2014 ఎన్నికల సమయంలో తన పేరిట మొత్తం రూ.3.54 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.3.36 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో మార్కెట్ విలువ ప్రకారం రూ.17.39 కోట్ల స్థిరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.24.32 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు. వ్యక్తిగత రుణాలు రూ.99.27 లక్షలు ఉన్నాయి. బిగాల పేరిట రూ.20.62 లక్షల ఇన్నోవా క్రిస్టా, రూ.26.89 లక్షల విలువైన ఫార్చునర్ కార్లున్నాయి. బ్యాంకులో రూ.71 లక్షలు, రూ.19.50 లక్షల విలువైన 650 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపారు. అలాగే, 2017–18 వార్షిక ఆదాయం రూ.15.28 లక్షలని పేర్కొన్నారు. భార్య లత పేరిట రూ.1.78 కోట్ల చరాస్తులు, రూ.16.49 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.7.31 లక్షల పెట్టుబడులు, బ్యాంకులో నగదు రూపంలో రూ.17 లక్షలు, రూ.78 లక్షల విలువైన 2,600 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో వివరించారు. ఆమె పేరిట రూ.33.50 లక్షల వ్యక్తిగత రుణాలతో పాటు రూ.18 లక్షల విలువైన కారు ఉన్నట్లు తెలిపారు. వార్షికాదాయం రూ.7.41లక్షలున్నట్లు అఫిడవిట్లో చూపారు. -
అభ్యర్థులూ జాగ్రత్త.!
సాక్షి, రంగారెడ్డి: శాసనసభ ఎన్నికల్లో కీటక ఘట్టానికి తెర లేచింది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అయితే, అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలి. నామినేషన్ పత్రాలు పూర్తి చేయడం, అనుబంధ పత్రాలు జత చేసే సమయంలో ఎన్నికల సంఘం సూచనలు విధిగా పాటించాలి. లేకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈమేరకు అభ్యర్థులు పాటించాల్సిన, నామినేషన్ పత్రాలు పూర్తి చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నామినేషన్ పత్రాలు.. నామినేషన్ వేసే అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీకి చెందిన వారైతే సదరు అభ్యర్థిని అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిస్టర్డ్ ఆన్ రికగ్నైజ్డ్ పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే పక్షంలో అదే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు. ప్రత్యేక బ్యాంకు ఖాతా అభ్యర్థి తన ఎన్నికల ఖర్చును అధికారులకు పారదర్శకంగా అందజేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా నామినేషన్ వేయడానికి కనీసం 24 గంటల ముందు ప్రారంభించిన నూతన బ్యాంకు ఖాతా నంబర్‌ను ఆర్ఓకు అందజేయాలి. బ్యాంకు ఖాతా నంబరే కాకుండా బ్యాంకు పేరు, బ్రాంచి చిరునామా తదితర వివరాలు ఇవ్వాలి. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రతి పైసా ఈ ఖాతా నుంచే ఖర్చు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖాతా (జాయింట్ అకౌంట్) తెరవొద్దు. అభ్యర్థి ఒక్కరి పేరుతో మాత్రమే ఖాతా తెరవాలి. అర్హతలు ఇవీ.. శాసనసభకు పోటీ చేసేందుకు ఉండాల్సిన అర్హతలు, అనర్హతలపై ప్రజా ప్రాతనిథ్య చట్టం 1951 లోని 3వ అధ్యాయం 11వ అధికరణం ద్వారా వివరించారు. దీని ప్రకారం అభ్యర్థులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. 25 ఏళ్లు దాటిన వారికే పోటీ చేసే అవకాశం కల్పించారు. సెక్యూరిటీ డిపాజిట్ పోటీ చేసే అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలైతే రూ.5 వేలు చాలు. అయితే, వీరు సంబంధిత తహసీల్దార్ నుంచి తీసుకున్న కుల ధృవీకరణ పత్రం అందజేయాలి. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే వారు రెండు డిపాజిట్లు చెల్లించాలి. డిపాజిట్‌ను నేరుగా రిటర్నింగ్ అధికారికి నగదు రూపంలో అందజేయవచ్చు. ఇలా కాకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో లేదా ప్రభుత్వ ఖజానా (ట్రెజరీ)కు చలానా రూపంలో జమ చేయవచ్చు. వాహనాలు మూడు.. వ్యక్తులు ఐదుగురు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థి తన వెంట వాహన శ్రేణి (కాన్వాయ్)లో మూడు వాహనాల కన్నా ఎక్కువ ఉండకూడదు. వీటిని కూడా ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో నిలిపివేసి ఐదుగురు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతినిధి ద్వారా నామినేషన్ పోటీకి దిగాలనుకునే అభ్యర్థి నామినేషన్ వేసేందుకు నేరుగా రాలేని పక్షంలో ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించింది. ఈమేరకు తన ప్రతినిధుల ద్వారా రిటర్నింగ్ అధికారికి నామినేషన్లను పంపించొచ్చు. ఫారం– బీ ఎన్నికల్లోఅభ్యర్థి ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లయితే అందుకు గుర్తింపుగా పార్టీ అధిష్టానం ఇచ్చే బీ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. బీ ఫారంను నామినేషన్‌తోపాటు ఇవ్వలేకపోయినా.. నామినేషన్ల ఆఖరు తేదీ సాయంత్రం 3 గంటలలోపు ఇవ్వొచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థి స్థానిక నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకుంటే సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో పేరు, ఇతర వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అఫిడవిట్లు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతోపాటు ఆస్తులు, అప్పులు, కేసులు, విద్యార్హతలు తదితర పూర్తి వివరాలను ఫారం–26 ద్వారా ఆర్ఓకు అందజేయాలి. నేరుగానే కాకుండా వెబ్సైట్ ద్వారా అఫిడవిట్లు దాఖలు చేయొచ్చు. www.eci.nic.in వెబ్సైట్లో లాగిన్ అయి అడిగిన అన్ని కాలమ్స్ విధిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రింట్ రాదు. పూర్తి చేసిన అఫిడవిట్ ప్రింట్ తీసుకుని మొదటి శ్రేణి న్యాయమూర్తి లేదా నోటరీ అడ్వకేట్‌తో రూ.10 విలువైన నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించి నామినేషన్ పత్రానికి జతచేసి ఆర్ఓకు అందజేయాలి. -
ఓట్ల బాటలో ‘కోట్లు’!
అభ్యర్థుల్లో 47 శాతం మంది కోట్లకు పడగెత్తినవారే.. * రూ.రెండు వేల లోపు ఆస్తి చూపించినవారు 9 మంది * అసలు పైసా ఆస్తి కూడా లేదన్నవారు 14 మంది.. పింప్రి, న్యూస్‌లైన్: ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న పని.. అభ్యర్థిగా నిలుచున్న వ్యక్తికి నామినేషన్ వేసినప్పటినుంచి ఫలితాలు వెలువడేంతవరకు రోజూ లక్షలమీదే ఖర్చు ఉంటుంది.. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి అభ్యర్థీ ఎన్నికలైనంతవరకు కొందరు కార్యకర్తలను తనతోనే తిప్పుకోవాల్సి ఉంటుంది. దాంతో అద్దెవాహనాల అవసరం పడుతుంది. అలాగే సహచరులకు అన్ని ఖర్చులు తానే భరించాలి.. ప్రచార సభలు తప్పనిసరి.. వాటిని ఏర్పాటుచేద్దామనుకునే ప్రాంతానికి అద్దె చె ల్లించడం దగ్గర నుంచి సభ పూర్తవ్వడానికి అవసరమైన అన్ని ‘హంగు’లకూ సదరు అభ్యర్థి జేబుకు చిల్లు తప్పనిసరి.. ప్రస్తుతం బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చులు అనధికారికంగా కోట్లలోనే ఉంటాయి.. ఇటువంటి ఎన్నికలను తట్టుకోవాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారికే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ర్టంలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎంతమంది కోటీశ్వరులు.. ఎంతమంది సామాన్యులు వంటి సమాచారంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) స్వయం సేవాసంస్థ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 2,336 మంది అభ్యర్థుల్లో 1,095 మంది అంటే 47 శాతం అభ్యర్థులు రూ. కోటి, అంతకు పైగా ఆస్తులు ఉన్నట్లు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. పార్టీల వారీగా ఎన్సీపీ నుంచి మొత్తం 277 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వీరిలో 229 మంది కోటీశ్వరులు (83 శాతం), కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 287 మంది అభ్యర్థుల్లో 222 మంది (77 శాతం), బీజేపీ నుంచి 258 మంది అభ్యర్థుల్లో 210 (81), శివసేన నుంచి 278 మందిలో 197 మంది (71 శాతం), ఎమ్మెన్నెస్ నుంచి 218 మందిలో 100 మంది (46 శాతం), స్వతంత్రులు 489 మంది పోటీలో ఉండగా వీరిలో 62 మంది (13 శాతం) కోటీశ్వరులుగా తేలింది. ఇతరులు 529 మంది అభ్యర్థుల్లో 75 మంది (14 శాతం) మొత్తం అన్ని పార్టీల నుంచి 2,336 మంది పోటీలో ఉండగా వీరిలో 1,095 మంది (47) మంది కోటీశ్వర్లు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో మోహిత్ కుంబోజ్ (దిండోషి, బిజేపీ) రూ.353 కోట్లు ఆస్తులు చూపించి మొదటి స్థానంలో ఉండగా, డాక్టర్ నందకుమార్ తాస్గావ్కర్ (ఫల్టాణ, శివసేన) రూ.211 కోట్లు, మంగల ప్రభాత్ లోడా (మల్బార్ హిల్, బిజేపీ), రూ.198 కోట్లు, అబూ అసీమ్ ఆజామీ (మాన్‌ఖుర్డ్ శివాజీనగర్, సమాజ్‌వాది పార్టీ) రూ.156 కోట్లు, ప్రసాద్ మినేషా లాప్ (శివ కోలివాడ, ఎన్సీపీ) రూ.126 కోట్లు, జగదీష్ ములుక్ (వడగావ్‌శేరి, బీజేపీ) రూ.104 కోట్లు, హితేంద్ర ఠాకూర్ (వసై బహుజన వికాస్ పార్టీ) రూ.100 కోట్లు, వినయ్ బైన్ (పశ్చిమ మలాడ్-శివసేన) రూ.93 కోట్లు, హికమత్ ఉదాన్ (ధనసావంగి-శివసేన) రూ.92 కోట్లు ఆస్తులు చూపించని అభ్యర్థులు వీరే... ఒకవైపు కోట్లు ఉంటేగాని ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో కూడా వేలు, వందలు లేని అభ్యర్థులు ఉన్నారంటే ఆశ్చర్యమే. అలాంటి వారిలో తమకు ఏ ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్లో చూపెట్టిన వారు 14 మంది ఉన్నారు. వారిలో యువరాజ్ పాటిల్ (అమల్ నేర్-స్వతంత్య్ర అభ్యర్థి), సలీం అబ్దుల్ కరీం (బాలాపూర్-సమాజ్‌వాది పార్టీ), యోగేష్ కోరడే (సావనేర్-స్వతంత్ర), అశోక్ ఉమఠే (నాగ్‌పూర్ సెంట్రల్-స్వతంత్ర), చంద్రకాంత్ ఠాణేకర్ (వేగలుర్-స్వతంత్ర), ఆనంద్ పాటోల్ (పరతుర్ స్వతంత్ర), గౌతం ఆమరావు (పశ్చిమ ఔరంగాబాద్-ఎమ్మెన్నెస్), విలాస్ రణపిసే (పౌఠాణ్-స్వతంత్ర), యువరాజ్ ఆహిర్ (మాగఠాణే-ప్రబుద్ద్ రిపబ్లికన్ పార్టీ), నిలేష్ పాటిల్ (ములుండ్-బీఎస్పీ), అప్పారావు గాలఫడే (విలేపల్లి-స్వతంత్ర), జయంత్ వాఘ్మోరే (పశ్చిమ ఘాట్కోపర్ -స్వతంత్ర), షేక్ అబ్దుల్ రహీమ్ (పశ్చిమ బాంద్రా, స్వతంత్ర), సంజయ్ నకట్ (కొలాబా-బీఎస్పీ) ఉన్నారు. రూ.రెండు వేల లోపు ఆస్తి చూపించిన వారు.. మొదటి పది మందిలో సతీష్ బండారే (శిరోల్-స్వతంత్ర) రూ.822, ప్రమోద్ సుఖ్‌దేవ్ (బండారా-అంబేద్కర్ పార్టీ) రూ.1,000, జ్ఞానేశ్వర్ కురిల్ (బదనాపూర్-స్వతంత్ర) రూ.1,000, వికాస్ రోకడే (ధారావీ-స్వతంత్ర) రూ.1,000, అజిత్ మోడేకర్ (కాగల్ ఎమ్మెన్నెస్) రూ.1,000, నిలేష్ శేలార్ (పాచోరా, బహుజన్ ముక్తి పార్టీ) రూ.1,380, విశ్వాస్‌రావు ధరటే (ఇస్లాంపూర్-స్వతంత్ర) రూ.1,429, సంజయ్ సక్పాల్ (దిండోషి-స్వతంత్ర) రూ.2,000, యాసిన్ శేఖ్ (మలబార్ హిల్, స్వతంత్ర) రూ.2,050 ఆస్తి కలిగి ఉన్నట్లు తమ అఫిడవిట్లలో చూపించడం గమనార్హం.