అభ్యర్థుల ఆస్తులు.. అంతస్తులు | Candidates Wealth Details In Nizamabad | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ఆస్తులు.. అంతస్తులు

Published Wed, Nov 21 2018 1:49 PM | Last Updated on Wed, Nov 21 2018 2:59 PM

Candidates Wealth Details In Nizamabad - Sakshi

ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్‌ రూపంలో సమర్పించారు. అయితే, కొంతమంది ఆస్తుల విలువ గతం కంటే ఇప్పుడు రెట్టింపు కాగా, మరికొంత మంది సంపద కూడా బాగానే పెరిగింది. 

స్వల్ప పెరుగుదల..

సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ నామినేషన్‌ వేసిన సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌ రూపంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. తనకు మొత్తం రూ.1.89 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు. 2014లో దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం ఆయనకు రూ.58.50 లక్షల విలువైన ఆస్తులు ఉండేవి. వాటి ప్రకారం గత నాలుగున్నరేళ్లలో ఆయన ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.  చరాస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో నగదు రూ.4,52,800, భార్య వద్ద రూ.2,46,700 ఉండగా.. 2014 లో ఆయన వద్ద రూ.2 లక్షలు మాత్రమే ఉన్నాయి. అప్పటికి, ఇప్పటికి వార్షికాదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. 2012–13 వార్షిక ఆదాయం రూ.6 లక్షలు ఉండగా, ప్రస్తుతం చూపించిన లెక్కల ప్రకారం 2017–18 వార్షికాదాయం రూ.19,72,810గా ఉంది. పాలసీలు, సేవింగ్స్‌ పేరిట 2014లో రూ.11 లక్షలు చూపించగా ఈ సారి రూ.15 లక్షల వరకు చూపించారు.

వాహ నాలు, వాటి విలువ మారలేదు. ప్రస్తుతం కామారెడ్డి కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఖాతాలో రూ.28 లక్షలు,  హైదరాబాద్‌ సెక్రెటేరియట్‌ ఎస్‌బీఐ బ్యాంకులో రూ.9.47 లక్షలు ఉన్నట్లుగా వెల్లడించారు. 2014లో అన్ని ఖాతాల్లో కలిపి రూ.20 వేల వరకు మాత్రమే ఉన్నాయి.  స్థిరాస్తుల విషయానికి వస్తే 2014లో ఆయన స్వగ్రామమైన బస్వాపూర్‌ వద్ద పాత ఇల్లు, 2.16 ఎకరాల వ్యవసాయ భూమి, ఎన్‌బీటీ నగర్‌ హైదరాబాద్‌లో స్వయంగా కొనుగోలు చేసిన రూ.38 లక్షల విలువైన ప్లాటు ఉండేవి. తాజాగా సమర్పించిన అఫిడవిట్‌ ప్రకా రం కామారెడ్డిలో రూ.45 లక్షల విలువైన ఇల్లు నిర్మించుకున్నారు. ఇవేకాకుండా ఈ నాలుగున్నరేళ్లలో రూ.25 లక్షలకు పైగా విలువైన మరో 7 ఎకరాల వ్యవసాయభూమి, రంగారెడ్డి జిల్లాలో రూ.15 లక్షల విలువైన ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. మొత్తమ్మీద గత ఎన్నికలతో పోలిస్తే గంప ఆస్తుల్లో కొద్దిపాటి పెరుగుదల ఉంది.

మల్యాద్రి..

స్వతంత్ర అభ్యర్థి మల్యాద్రిరెడ్డి ఆస్తులను పరిశీలిస్తే.. ఆయన వద్ద బ్యాంకులో రూ.25 వేల డిపాజిట్, రూ.5లక్షల విలువ చేసే రెండు ఎల్‌ఐసీ పాలసీలు, ఒక మోటారు వాహనం, రూ.64 వేల విలువ చేసే 10 గ్రాముల బంగారం, భార్య వద్ద రూ.2.24లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగాచం, తల్లి వద్ద రూ.96 వేల విలువ చేసే 30 గ్రాముల బంగారం ఉంది. హైదరాబాద్‌లోని కొత్తపేటలో, మన్సూరాబాద్‌లో ఇళ్లు ఉన్నాయి. ఆయనపై వర్ని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.  

ధన్‌పాల్‌ 

సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ అర్బన్‌లో శివసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా నామినేషన్‌ దాఖలు సందర్భంగా తన ఆస్తులు వెల్లడించారు. గతంలో కంటే ఈసారి కొద్దిమేర ఆస్తులు పెరిగినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ధన్‌పాల్‌ బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ టికెట్‌ రాకపోవడంతో ఆయన శివసేన నుంచి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల సమయానికి ధన్‌పాల్‌కు రూ.26,55,114 విలువైన చరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.55,77,927 చరాస్తులు ఉన్నట్లు చూపారు. అప్పట్లో స్థిరాస్తుల విలువ రూ.2.71 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.3.65 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.5.44 లక్షల విలువైన ఇన్నోవా, రూ.19.6 లక్షల విలువైన క్రిస్టా, రూ.21.34 లక్షల మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లున్నాయి. అలాగే, రూ.3.20 లక్షల విలువైన 105 గ్రాముల బంగారం ఉందని, 2017–18 వార్షికాదాయం రూ.5.77 లక్షలున్నట్లు చూపారు. భార్య మణిమాల పేరిట రూ.37.48 లక్షల చరాస్తులు, రూ.1.77 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన ముగ్గురు పిల్లల పేరిట రూ.4.60 కోట్ల స్థిరాస్తులు, రూ.24 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

కాసుల గలగలలు..

 సాక్షి, బాన్సువాడ: బాన్సువాడ కాంగ్రెస్‌ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్‌ ఆస్తులు గతంలో కంటే ప్రస్తుతం రెట్టింపయ్యాయి.!  2014 ఎన్నికల సమయంలో మొత్తం రూ.22.23 లక్షల విలువైన స్థిర, చరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.1.33 కోట్ల ఆస్తులున్నట్లు బాల్‌రాజ్‌ తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించారు. 2014లో బాల్‌రాజ్‌ వద్ద నగదు రూపంలో కేవలం రూ.8 వేలు, రూ.17లక్షల విలువైన ఇన్నోవా, రూ.3లక్షల విలువైన ట్రాక్టర్, రూ.లక్ష విలువ చేసే ట్రాలీ, రూ.25 వేల విలువ చేసే బైక్, రూ.90 వేల విలువ చేసే 30 గ్రాముల బంగారం తదితరాలు కలిపి మొత్తం ఆస్తులు రూ.22,23,000 ఉన్నట్లు తెలిపారు.

అయితే, ప్రస్తుతం తన వద్ద నగదు రూ.4 లక్షలు, బ్యాంకులో రూ.4.45 వేలు ఉన్నాయి. రూ.14 లక్షల విలువ చేసే ఇన్నోవా, రూ.2.65 లక్షల విలువ చేసే ట్రాక్టర్, భార్య పేర హీరోహోండా మోటర్‌ సైకిల్, కుమారుడి పేర మోటర్‌ సైకిల్‌ ఉన్నాయి. బాల్‌రాజ్‌ వద్ద రూ.1.50 లక్షల విలువ చేసే 50 గ్రాముల బంగారం, భార్య వద్ద రూ.3 లక్షల విలువ చేసే 100 గ్రాముల బంగారం, తల్లి వద్ద 1.50 లక్షల విలువ చేసే 50 గ్రాముల బంగారం ఉంది. బాల్‌రాజ్‌ పేర రూ.50 లక్షల విలువైన 7.05 ఎకరాల భూమి, రూ.65లక్షల విలువ చేసే ప్లాట్లు ఉన్నాయి. ఆయన ఆస్తుల మొత్తం విలువ రూ.1.33 కోట్లు కాగా, రూ.32 లక్షల అప్పులు ఉన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.

పెరిగిన స్థిరాస్తులు, తగ్గిన చరాస్తులు

సాక్షి,జామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ అర్బన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తా తన స్థిరాస్తుల్లో పెరుగుదల ఉండగా, చరాస్తులు తగ్గినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గణేశ్‌గుప్తా చరాస్తులు 2014 కంటే ఇప్పుడు రూ.17.90 లక్షల మేర తగ్గాయని, రూ.7.50 కోట్ల మేర స్థిరాస్తులు పెరిగినట్లు చూపించారు. 2014 ఎన్నికల సమయంలో తన పేరిట మొత్తం రూ.3.54 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.3.36 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో మార్కెట్‌ విలువ ప్రకారం రూ.17.39 కోట్ల స్థిరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.24.32 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు. వ్యక్తిగత రుణాలు రూ.99.27 లక్షలు ఉన్నాయి. బిగాల పేరిట రూ.20.62 లక్షల ఇన్నోవా క్రిస్టా, రూ.26.89 లక్షల విలువైన ఫార్చునర్‌ కార్లున్నాయి.

బ్యాంకులో రూ.71 లక్షలు, రూ.19.50 లక్షల విలువైన 650 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపారు. అలాగే, 2017–18 వార్షిక ఆదాయం రూ.15.28 లక్షలని పేర్కొన్నారు. భార్య లత పేరిట రూ.1.78 కోట్ల చరాస్తులు, రూ.16.49 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.7.31 లక్షల పెట్టుబడులు, బ్యాంకులో నగదు రూపంలో రూ.17 లక్షలు, రూ.78 లక్షల విలువైన 2,600 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్‌లో వివరించారు. ఆమె పేరిట రూ.33.50 లక్షల వ్యక్తిగత రుణాలతో పాటు రూ.18 లక్షల విలువైన కారు ఉన్నట్లు తెలిపారు. వార్షికాదాయం రూ.7.41లక్షలున్నట్లు అఫిడవిట్‌లో  చూపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement