ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి వస్తున్న దివ్యాంగురాలు (ఫైల్), దివ్యాంగుడిని పోలింగ్ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న సిబ్బంది (ఫైల్)
వారు దివ్యాంగులే కానీ అందరికీ ఆదర్శవంతులు.. నడవ రాకున్నా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.. కళ్లు కనబడకున్నా కదిలొచ్చారు.. మేము సైతం అంటూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఓటేసేందుకు బద్ధకించిన వారి కళ్లు తెరిపించారు. పోలింగ్ శాతంలో సాధారణ ఓటర్ల కంటే దివ్యాంగ ఓటర్లే ముందుండడం విశేషం.
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఇటీవలి ఎన్నికల్లో సాధారణ ఓటర్ల కంటే దివ్యాంగ ఓటర్లే అధిక సంఖ్యలో ఓటు వేసి తమ ఉనికి చాటుకున్నారు. జిల్లాలో 84 శాతం ఓటింగ్ నమోదు చేసి తాము ఎందులో తీసిపోలేమని మరోసారి నిరూపించుకున్నారు. అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం జిల్లాలో 17,886 మంది దివ్యాంగ ఓటర్లుంటే, 1,369 పోలింగ్ కేంద్రాల్లో కలిపి 15,060 మంది (84శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో విశేషమేమిటంటే కళ్లు లేకున్నా 1,876 మంది ఇంటి నుంచి కదిలి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. అవయవాలన్నీ సక్రమంగా ఉండి ఓటు వేయని వారికి వీరు ఆదర్శంగా నిలిచారు.
అలాగే మూగ, చెటివి వారి విషయానికి వస్తే 1,396 మంది, అత్యధికంగా శారీరక వికలాంగులు 9,585 మంది, ఇతరులు 2,203 మంది ఓటు వేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే, అత్యధికంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 3,361 మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో స్థానంలో బాల్కొండ నియోజకవర్గం ఉండగా, మూడవ స్థానంలో ఆర్మూర్ నియోజకవర్గం ఉంది. అత్యల్పంగా నిజామాబాద్ అర్బన్‌లో 896 మంది మాత్రమే ఓటేశారు. అయితే, జిల్లా పోలింగ్ శాతం 76.23 ఉండగా, ఇందులో దివ్యాంగులది 84 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం.
ప్రత్యేక దృష్టి సారించడంతోనే..
రాష్ట్ర ఎన్నికల సంఘం దివ్యాంగ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఓటు హక్కు ఉన్న దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా వారికి పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇందుకు ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు నిర్మించారు. ఇంటి నుంచి కదల్లేని, నడవలేని వారిని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించేలా రవాణా ఏర్పాట్లు చేశారు.
వారి కోసం ప్రత్యేకంగా 400 లకు పైగా వీల్ చైర్‌లను తెప్పించిన అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచారు. వలంటీర్లను కూడా నియమించారు. ఆటోల ద్వారా ఇంటి నుంచి దివ్యాంగ ఓటర్లను తీసుకుని వచ్చి వీల్‌చైర్ల ద్వారా పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లారు. మళ్లీ పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి అదే ఆటోలలో తరలించారు. వారికి కల్పించిన సౌకర్యాలను తెలుసుకుని దివ్యాంగ ఓటర్లు ధీమాగా ఓటేయడానికి ముందుకు కదిలారు. ఇటు అంధులు సులభంగా ఓటే వేసేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ యూనిట్‌లపై బ్రెయిలీ లిపిని ఏర్పాటు చేశారు. తద్వారా దివ్యాంగ ఓటర్ల పోలింగ్ శాతం పెరగడానికి కారణమైంది.
వివరాలు సేకరించిన అధికారులు..
అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిన నేపధ్యంలో జిల్లాలో ఎంత మంది దివ్యాంగ ఓటర్లున్నారో తెలుసుకోవడానికి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వివరాలను సేకరించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 3,084 మంది, బోధన్‌లో 3,164, బాన్సువాడలో 2,729, నిజామాబాద్ అర్బన్‌లో 1,313, నిజామాబాద్ రూరల్‌లో 4,053, బాల్కొండ నియోజకవర్గంలో 3,543 మంది ఓటర్లున్నట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా దివ్యాంగ ఓటర్లు 17,886 మంది ఓటర్లున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ప్రస్తుతం 15,060 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని వారి ఉనికిని చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment