సాక్షి, కామారెడ్డి: ఓట్ల గల్లంతుపై ‘సాక్షి’ చెప్పిందే నిజమైంది. వేల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించారని ‘సాక్షి’ ఏడాది కిందట చెప్పింది. ఇప్పుడదే జరిగింది. తాజా ఎన్నికల్లో జిల్లాలో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. వేలాది ఓటర్లు తమ ఓ టు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే వేలాది ఓట్లు గల్లంతయ్యాయని ‘42 వేల ఓట్లు గల్లంతు’ శీర్షికన గతేడాది మార్చి 7న ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేయడానికి వెళ్లిన ఎంతో మంది జాబితాలో తమ పేర్లు లేవని తెలిసి విస్తుపోయారు. కామారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఆయా నియోకజ వర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు మాయమయ్యాయని గతేడాది ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చినప్పటికీ అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో వేలాది ఓటర్లు ఓట్లు వేయలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాల ప్రదర్శనతో చదువుకున్న వారు కొందరు తమ పేర్లు ఉన్నాయో, లేదో చూసుకున్నారు. జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా చాలా మందివి తిరిగి ఓటరు జాబితాలో పేర్లు రాకపోవడంతో ఖంగుతినాల్సి వచ్చింది. జాబితాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయినపుడు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉండింది. కానీ, వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. గత ఎన్నికలకన్నా ఇప్పుడు పోలింగు శాతం పెరిగిందని సంబరపడుతున్నారే తప్ప ఓట్లు గల్లంతయిన విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
త్వరలోనే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వచ్చే నెలలోనే నిర్వహించే అవకాశం ఉంది. మరో నాలుగు నెలలు గడిస్తే పార్లమెంటు ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాల్లో పేర్లు లేని వారి విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నిరక్షరాస్యులైన ఓటర్లే ఎక్కువ మంది తమ ఓటు కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ఓట్ల గల్లంతు అటు రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. తమకు ఓట్లు వేస్తారనుకున్న వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో తమకు నష్టం జరిగిందన్న భావన అభ్యర్థుల్లో ఉంది.
రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి..
ఎన్నికలు వచ్చాయంటేనే ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు కోసం దండం పెట్టే రాజకీయ నేతలు బాధ్యతగా ఓటరు జాబితాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. పోలింగు రోజున ఓట్లు గల్లంతయ్యాయని గొడవ పడే కన్నా ఓటరు జాబితాల ప్రదర్శన సందర్భంగా ఓట్లు లేని వారి పేర్లను గుర్తించి వారితో దరఖాస్తు చేయించాల్సిన బాధ్యత ఆయా పార్టీల నేతలు తీసుకుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు.
Comments
Please login to add a commentAdd a comment