అభ్యర్థులూ జాగ్రత్త.! | MLA Candidates Should Take these Precautions | Sakshi
Sakshi News home page

అభ్యర్థులూ జాగ్రత్త.!

Published Tue, Nov 13 2018 3:14 PM | Last Updated on Tue, Nov 13 2018 3:37 PM

MLA Candidates Should Take these Precautions - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రంగారెడ్డి: శాసనసభ ఎన్నికల్లో కీటక ఘట్టానికి తెర లేచింది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అయితే, అభ్యర్థులు నామినేషన్‌ వేసే సమయంలో ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలి. నామినేషన్‌ పత్రాలు పూర్తి చేయడం, అనుబంధ పత్రాలు జత చేసే సమయంలో ఎన్నికల సంఘం సూచనలు విధిగా పాటించాలి. లేకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈమేరకు అభ్యర్థులు పాటించాల్సిన, నామినేషన్‌ పత్రాలు పూర్తి చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

నామినేషన్‌ పత్రాలు..

  • నామినేషన్‌ వేసే అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీకి చెందిన వారైతే సదరు అభ్యర్థిని అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది.
  • రిజిస్టర్డ్‌ ఆన్‌ రికగ్నైజ్డ్‌ పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే పక్షంలో అదే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.
  • ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయొచ్చు.

ప్రత్యేక బ్యాంకు ఖాతా

  • అభ్యర్థి తన ఎన్నికల ఖర్చును అధికారులకు పారదర్శకంగా అందజేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా నామినేషన్‌ వేయడానికి కనీసం 24 గంటల ముందు ప్రారంభించిన నూతన బ్యాంకు ఖాతా నంబర్‌ను ఆర్‌ఓకు అందజేయాలి.
  • బ్యాంకు ఖాతా నంబరే కాకుండా బ్యాంకు పేరు, బ్రాంచి చిరునామా తదితర వివరాలు ఇవ్వాలి.  
  • అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రతి పైసా ఈ ఖాతా నుంచే ఖర్చు చేయాలి.
  • ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖాతా (జాయింట్‌ అకౌంట్‌) తెరవొద్దు. అభ్యర్థి ఒక్కరి పేరుతో మాత్రమే ఖాతా తెరవాలి.  

అర్హతలు ఇవీ..

  • శాసనసభకు పోటీ చేసేందుకు ఉండాల్సిన అర్హతలు, అనర్హతలపై ప్రజా ప్రాతనిథ్య చట్టం 1951 లోని 3వ అధ్యాయం 11వ అధికరణం ద్వారా వివరించారు. దీని ప్రకారం అభ్యర్థులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. 25 ఏళ్లు దాటిన వారికే పోటీ చేసే అవకాశం కల్పించారు.

సెక్యూరిటీ డిపాజిట్‌

  • పోటీ చేసే అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలైతే రూ.5 వేలు చాలు. అయితే, వీరు సంబంధిత తహసీల్దార్‌ నుంచి తీసుకున్న కుల ధృవీకరణ పత్రం అందజేయాలి. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే వారు రెండు డిపాజిట్లు చెల్లించాలి. డిపాజిట్‌ను నేరుగా రిటర్నింగ్‌ అధికారికి నగదు రూపంలో అందజేయవచ్చు. ఇలా కాకుంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో లేదా ప్రభుత్వ ఖజానా (ట్రెజరీ)కు చలానా రూపంలో జమ చేయవచ్చు.  

వాహనాలు మూడు.. వ్యక్తులు ఐదుగురు

  • రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి నామినేషన్‌ వేసేందుకు వచ్చే అభ్యర్థి తన వెంట వాహన శ్రేణి (కాన్వాయ్‌)లో మూడు వాహనాల కన్నా ఎక్కువ ఉండకూడదు. వీటిని కూడా ఆర్‌ఓ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో నిలిపివేసి ఐదుగురు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది.  

ప్రతినిధి ద్వారా నామినేషన్‌

  • పోటీకి దిగాలనుకునే అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు నేరుగా రాలేని పక్షంలో ఎన్నికల కమిషన్‌ వెసులుబాటు కల్పించింది. ఈమేరకు తన ప్రతినిధుల ద్వారా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్లను పంపించొచ్చు.

ఫారం– బీ

  • ఎన్నికల్లోఅభ్యర్థి ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లయితే అందుకు గుర్తింపుగా పార్టీ అధిష్టానం ఇచ్చే బీ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. బీ ఫారంను నామినేషన్‌తోపాటు ఇవ్వలేకపోయినా.. నామినేషన్ల ఆఖరు తేదీ సాయంత్రం 3 గంటలలోపు ఇవ్వొచ్చు.
  • పోటీ చేస్తున్న అభ్యర్థి స్థానిక నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకుంటే సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో పేరు, ఇతర వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.  

అఫిడవిట్లు

  • పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతోపాటు ఆస్తులు, అప్పులు, కేసులు, విద్యార్హతలు తదితర పూర్తి వివరాలను ఫారం–26 ద్వారా ఆర్‌ఓకు అందజేయాలి.
  • నేరుగానే కాకుండా వెబ్‌సైట్‌ ద్వారా అఫిడవిట్లు దాఖలు చేయొచ్చు. www.eci.nic.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి అడిగిన అన్ని కాలమ్స్‌ విధిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రింట్‌ రాదు. పూర్తి చేసిన అఫిడవిట్‌ ప్రింట్‌ తీసుకుని మొదటి శ్రేణి న్యాయమూర్తి లేదా నోటరీ అడ్వకేట్‌తో రూ.10 విలువైన నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై నోటరీ చేయించి నామినేషన్‌ పత్రానికి జతచేసి ఆర్‌ఓకు అందజేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement