బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక సమరం చివరి అంకానికి చేరింది. శనివారం (మే12న) జరగనున్న ఎన్నికల కోసం ప్రధానపార్టీల హోరాహోరీ సుదీర్ఘ ప్రచారానికి గురువారంతో తెరపడింది. చివరి 20రోజులు ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇక పోలింగ్‌పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ప్రచారఘట్టం ముగిసిన తర్వాత కన్నడనాట రాజకీయ పరిస్థితులు, అధికార కాంగ్రెస్ పాలనపై ప్రజల అభిప్రాయం, నరేంద్రమోదీ రాకతో పరిస్థితుల్లో మార్పు, కులాల ప్రభావం తదితర అంశాలపై రాష్ట్ర పలు ప్రాంతాల్లోని ఓటర్లను ‘సాక్షి’ కలిసింది. వారు వెల్లడించిన, తాజా పరిస్థితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
యూపీ ఎన్నికలతో పోలిక
కర్ణాటక ఎన్నికలను కొందరు గతేడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలుస్తున్నారు. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరం నియోజకవర్గానికి చెందిన వీరభద్రయ్య అనే ఉద్యోగి మాట్లాడుతూ.. అఖిలేశ్ సర్కారు బాగా పనిచేసిందని, ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించారని మీడియా బాగా ప్రచారం చేసిందని.. కానీ మొదటి నాలుగేళ్లపాటు ఆ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దారుణంగా ఉన్న విషయాన్ని కావాలని పక్కన పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
అలాగే కర్ణాటకలో సిద్దరామయ్య పాలన బాగుందని, ఇందిరా క్యాంటీన్లు ప్రవేశపెట్టారని మీడియా ప్రచారం చేస్తోందని.. కానీ ప్రభుత్వ పథకాల్లో అవినీతి, 3,500 మంది రైతుల ఆత్మహత్యలను అస్సలు పట్టించుకోలేదంటున్నారు. మతఘర్షణలతో యూపీ అట్టుడికిందని.. అదే తరహాలో ఇక్కడ కూడా టిప్పుసుల్తాన్ జయంతి రోజు ఇద్దరు వీహెచ్‌పీ కార్యకర్తల హత్య, పీఎఫ్‌ఐ తీవ్రవాదాల చేతుల్లో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు చనిపోవటం యూపీ పరిస్థితులతో సరిపోతుందన్నారు. అఖిలేశ్ మళ్లీ గెలుస్తారని సర్వేలు చెప్పినా ఫలితాలు వేరేలా ఉన్నట్లు.. కర్ణాటకలోనూ కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వేల ఫలితాలు వేరేలా ఉంటాయన్నారు.
‘లింగాయత్ మైనార్టీ హోదా’ కీలకం
రెండువైపులా పదునున్న కత్తిని చేతిలో పట్టుకున్న సిద్దరామయ్య.. అది తనకే చేటుచేస్తుందని అర్థం చేసుకోలేకపోయారని సదాశివనగర్‌లోని నంజుండప్ప, వీరకేశవ, మధుసూదన్‌లు అభిప్రాయపడ్డారు. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించటం, లింగాయత్‌లకు మైనార్టీ హోదా అధికార కాంగ్రెస్‌కే నష్టం చేస్తాయన్నారు. సిద్ధరామయ్య ‘విభజించు–పాలించు’ నినాదంతో సమాజాన్ని కులం, మతం ఆధారంగా విభజించారన్నారు. లింగాయత్‌లకు మైనారిటీ హోదాపై ఈ వర్గంలో మెజారిటీల అసంతృప్తితో పాటు హిందువుల్లోని పలు వర్గాలను కాంగ్రెస్‌కు దూరం చేస్తుందన్న విషయాన్ని సీఎం గుర్తించలేకపోయారన్నారు. ఇది కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
కులంపైనే పార్టీల దృష్టి
కన్నడ రాజకీయ పార్టీలు కులసమీకరణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో ఇదే ఫార్ములాను అన్ని పార్టీలూ అమలుచేశాయి. కన్నడలో ‘అహిందా’ (బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు) ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ బోలెడు ఆశలు పెట్టుకుంది. ఇది తమకు స్థిరమైన ఓటు బ్యాంకుగా భావిస్తోంది. సిద్దరామయ్య కురబ సామాజికవర్గం నేత. రాష్ట్ర జనాభాలో వీరు 7%. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, ఎస్టీలు, బలహీన వర్గాలను కలుపుకుంటే (అందరూ కలిపి 43%) తమదే విజయమని కాంగ్రెస్ విశ్వసిస్తోంది.
ఇదే క్రమంలో బ్రాహ్మణులు, లింగాయత్, వక్కలిగలకు మేం వ్యతిరేకం కాదని సిద్దరామయ్య ప్రచారంలో పేర్కొన్నారు. అయితే లింగాయత్ ఓటు తమ చేజారదని బీజేపీ భావిస్తోంది. దీనికి తోడు మోదీ ప్రచారమంతా ఈ ‘అహిందా’ వర్గాన్ని ప్రభావితం చేసేలాగే సాగింది. కాంగ్రెస్‌కు దళితులపై ప్రేమ లేదని, ఖర్గేను సీఎం చేయకపోవడమే అందుకు తార్కాణమని మోదీ చెప్పటం కచ్చితంగా ప్రభావం చూపుతుందని బీజేపీ భావిస్తోంది. అటు, కన్నడ ఓటర్లలో 11% వక్కలిగ ఓటర్లు ఉన్నారు. 15–16% ఉన్నట్లు ఆ సామాజికవర్గం 54 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకంగా ఉన్నారు. దీంతో కనీసం 40 సీట్లు తమ పార్టీకి వస్తాయని జేడీఎస్ భావిస్తోంది.
పీఠం నీదా – నాదా?
కన్నడనాట ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. కొందరు ఓటర్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో 30కి పైగా సీట్లు గెలిచే జేడీఎస్ కింగ్‌మేకర్ కానుంది. ఒకవేళ బీజేపీ, జేడీఎస్ కలిసి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేస్తే తమకే సీఎం పీఠం ఇవ్వాలని కుమారస్వామి పట్టుబట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మెజార్టీ స్థానాలు తాము గెలిచామని, కేబినెట్‌లో శాఖల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినా.. జేడీఎస్ వినకపోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఈ డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకోకపోతే, జేడీఎస్ ఓ షరతుతో కాంగ్రెస్‌తో జట్టు కట్టే అవకాశాన్ని కొట్టి పారేయలేమంటున్నారు. సిద్దరామయ్య కాకుండా మిగిలిన వారెవరినైనా సీఎంగా ప్రకటిస్తే మద్దతు ఇవ్వాలని జేడీఎస్ భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment