crores for vote
-
బాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయంపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయంపై తక్షణమే విచారణ జరపాలని శాసన మండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు మనుషులు డబ్బులిస్తామని ఆఫర్ చేశారని, దానిని తాను తిరస్కరించానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పడం, ఇది వాస్తవమేనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకోవడమే బాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయానికి నిదర్శనమన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలోనూ చంద్రబాబు ఇలాంటి ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికారని, ఆయన భ్రీఫ్డ్ మీ అనటం విన్నామని చెప్పారు. 1995లో వైశ్రాయ్ నుంచి నిన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు వరకూ బాబుది ఇదే తీరని చెప్పారు. ఈ విషయంలో సీబీసీఐడీ, ఈడీలు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ.10 నుంచి 20 కోట్లు ఇస్తామన్నారని ఎమ్మెల్యేలు రాపాక, మద్దాళి గిరి కూడా చెప్పారన్నారు. వీటన్నిటిపై సీబీసీఐడీ విచారణ జరిపి, ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన ‘ఓటుకు కోట్ల’ కేసును కూడా దీనితో కలిపి విచారించాలన్నారు. ఇంత డబ్బు ఎలా ప్రయాణం చేసింతో ఈడీలాంటి సంస్థలు దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఒకే వ్యక్తి వద్ద నుంచి ప్రారంభమైందని, అన్నీ ఒకే సోర్స్ నుంచి జరుగుతున్నాయని అన్నారు. శ్రీదేవి స్క్రిప్ట్ చంద్రబాబుదే శ్రీదేవి అమరావతి అన్నప్పుడే ఆ స్క్రిప్ట్ చంద్రబాబుదని అర్ధమైందన్నారు. వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా, శ్రీదేవి ఒక్కరే అమరావతి నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నారని ప్రశ్నించారు. ఆమె బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రాణ హాని ఉందని అనడం సరైనది కాదని అన్నారు. అంత పెద్ద వారి గురించి, అంతటి పెద్ద పెద్ద మాటలు ఎందుకని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారని, ఎమ్మెల్యే శ్రీదేవిని కూడా సీఎం గౌరవంగా చూసుకున్నారని తెలిపారు. శ్రీదేవికి భయం అక్కర్లేదని, ఆమె ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగొచ్చని చెప్పారు. ఆమెకు ఏం రక్షణ కావాలో ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. శ్రీదేవి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వివాదాలేనని, ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదని తెలిపారు. ఆమె విషయంలో వాస్తవంగా ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. ఆమె ఇలాంటి వివాదాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. -
కన్నడ ఎన్నికల ఖర్చు 13 వేల కోట్లు!
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో డబ్బుల వరద పారుతోంది. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు.. ఎన్నికల సంఘం సూచించిన మొత్తానికి వంద రెట్లు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీంతో కన్నడ అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలవనున్నాయి. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుతున్న సమయంలో ఏయే పార్టీలు.. ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చుచేయబోతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల ఖర్చు ఎంత? అంశాలపై ఓటర్లతోపాటు పరిశీలకుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతిష్టాత్మక పోరు కాబట్టే.. కర్ణాటక ఎన్నికలు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిచి 2019 సార్వత్రిక ఎన్నిలకు శక్తిని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. దక్షిణభారతంలో పార్టీ మనుగడ కోసం బీజేపీ శాయశక్తులా పనిచేస్తోంది. దీంతో ఇరుపార్టీలు ముఖ్యనేతలను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి.కాంగ్రెస్ తరపున అధ్యక్షుడు రాహుల్, సీనియర్ నేతలు శశిథరూర్, అశోక్ చవాన్, ఉమెన్ చాందీ, సుశీల్ కుమార్ షిండే, రఘువీరారెడ్డి సహా మాజీ కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను బీజేపీ రంగంలోకి దించింది. సగటున రూ.20 కోట్లు కన్నడ గడ్డపై 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు చేయాలి. కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు సగటున రూ.20 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాయి. రూ.30–50కోట్లు ఖర్చు చేసేవి, రూ.50–70 కోట్లు, వందకోట్లకుపైగా ఖర్చు చేసే నియోజకవర్గాలూ ఉన్నాయి. సగటున రూ.20 కోట్లుగా లెక్కేసినా.. ఒక్కోపార్టీకి 4,480 కోట్లు ఖర్చవుతుంది. కొన్ని కీలక నియోజకవర్గాల ఖర్చు పరిగణనలోకి తీసుకుంటే.. ఆ మొత్తం రూ.5 వేల కోట్ల పైమాటే. జేడీఎస్‌ను కలుపుకుంటే రూ.13 వేలకోట్లుపైనే ఉంటుందని అంచనా. ఆ మూడు చోట్ల.. 700 కోట్లు కర్ణాటకలో అత్యంత ఖరీదైన ఎన్నిక విజయనగరలో జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఎంపీవీ కిష్టప్ప, బీజేపీ తరపున హెచ్ రవీంద్ర బరిలో ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కిష్టప్ప రూ.1300 కోట్ల ఆస్తులు చూపించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. గోవిందరాజనగర్‌లో కిష్టప్ప కుమారుడు ప్రియాకృష్ణ కాంగ్రెస్‌పార్టీ నుంచి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ వీ. సోమన్న బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. అలాగే హోస్కొటే నుంచి ఎంపీవీ నాగరాజు (కాంగ్రెస్), బీజేపీ తరపున మాజీమంత్రి బచ్చేగౌడ కుమారుడు శరత్ బరిలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఏ మాత్రం ఖర్చుకు వెనకాడటం లేదు. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు జేడీఎస్ అభ్యర్థుల ఖర్చు మొత్తం రూ.700 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. బాదామీలోనూ బారెడు ఖర్చు బాదామీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీజేపీ ఎంపీ శ్రీరాములు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇద్దరు నేతలకూ ఈ పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక్కో అభ్యర్థి 70 నుంచి 90 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పరమేశ్వర ప్రాతినిథ్యం వహిస్తున్న తుమకూరు జిల్లా కొరటగేరే, సీఎం కుమారుడు యతీంద్ర ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణతో పాటు పలు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉందని తెలుస్తోంది. మోదీ మ్యాజిక్ పనిచేయదు శివాజీనగర: ‘కర్ణాటక ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయి.. రాష్ట్రంలో ఇక ప్రధాని మోదీ మ్యాజిక్ ఏదీ పనిచేయదు’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఆదివారం బెంగళూరులోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీ ట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుతున్న భాషను ప్రజలు ఛీకొడుతున్నారు. ఒక ప్రధాని నోటి నుంచి ఇలాంటి హీనమైన మాటలను వినాల్సి వస్తుందని వారు ఊహించలేదు’ అని మండిపడ్డారు. ‘2 ప్లస్ 1, టెన్ పర్సెంట్ ప్రభుత్వం, సీధా రూపయ్య’ అంటూ తమపై వ్యాఖ్యానాలు చేయటం ఇలాంటివేనని తెలిపారు. తమపై మోదీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదనీ, సీబీఐ తదితర దర్యాప్తు సంస్థలు ఆయన ఆధీనంలోనే ఉన్నందున విచారణ జరిపించి రుజువు చేయాలని సవాల్ విసిరారు. -
క్వాష్ పిటిషన్ ఎప్పుడు వేస్తారు?
-
క్వాష్ పిటిషన్ ఎప్పుడు వేస్తారు?
ఏసీబీ కోర్టులో తన మీద విచారణ జరగకుండా ఆపాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా ఆ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా.. తప్పుడు ఆరోపణలున్నా క్వాష్ పిటిషన్ వేస్తారు. కేసులో తనకు సంబంధం లేకున్నా ఇన్వాల్వ్ చేశారని వాదిస్తారు. సిఆర్‌పిసిలోని సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్‌ను కేవలం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో మాత్రమే వేస్తారు. అయితే, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో స్టీఫెన్సన్కు రేవంత్ డబ్బులు ఇస్తూ దొరికిపోవడం, దీంట్లో సహ నిందితుడిగా అరెస్టయిన సెబాస్టియన్ సెల్ ఫోన్లో సంభాషణలు దొరకడం, ఆ సంభాషణల్లో చంద్రబాబు నేరుగా స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు నిర్దారణ కావడం సంచలనం సృష్టించింది. ఆ టేపుల్లో ఉన్న గొంతు కూడా చంద్రబాబుదేనని తాజాగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు నిర్ధారించాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు మాట్లాడిన స్వరాన్ని, టేపుల్లో మనవాళ్లు దే బ్రీఫ్డ్ మీ అంటూ మాట్లాడిన స్వరాన్ని పోల్చి రెండూ ఒకటేనని తేల్చింది. ఫోరెన్సిక్ నివేదికతో ఈ టేపులు ఓ కీలక సాక్ష్యంగా మారాయి. దాంతో కేసుకు సూత్రధారి చంద్రబాబు అనే అభిప్రాయం వ్యక్తమైంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌తో హైకోర్టు ముందుకొచ్చారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ నేపథ్యంలో .. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో ఏముందున్నది ఆసక్తికరంగా మారింది. గత సోమవారం వచ్చిన ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చాలా స్పష్టంగా, సూటిగా ఉన్నాయి. ఉత్తర్వుల్లో ఎక్కడా ఎవరి పేరునూ పేర్కొనలేదు. తమ ముందు దాఖలైన పిటిషన్లో పిటిషన్ దారు కొన్ని సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారని, అవి నిజమైనవంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ధ్రువీకరణను ఇచ్చారని, వాటిని సంబంధిత పోలీసు అధికారులకు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్ష్యాలను పరీక్షించి, వాటిపై దర్యాప్తు చేసి, విచారణ నివేదికను నెల రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని సూచించారు. దీంట్లో చంద్రబాబు పేరు ఎక్కడా పేర్కొనలేదు. ఈ సమయంలో ఏసీబీ కోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ చంద్రబాబు కోరడం కోర్టుల ముందు నిలబడదన్నది న్యాయనిపుణుల వాదన. ఉత్తర్వుల్లో పోలీసులను దర్యాప్తు చేయాలని చెప్పారే కానీ చంద్రబాబు పేరు పేర్కొనలేదని, అలాంటప్పుడు కేసు ఎలా నిలబడుతుందని న్యాయ నిపుణులు అంటారు. -
చంద్రబాబు పర్యటన రద్దు.. కేసు ఎఫెక్టేనా?
-
చంద్రబాబు పర్యటన రద్దు.. కేసు ఎఫెక్టేనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తిరుపతి పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన ఉండాల్సి ఉన్నా.. దాన్ని తక్షణం రద్దు చేసుకున్నారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. కానీ హుటాహుటిన తంబళ్లపల్లి నుంచి హెలికాప్టర్లో బెంగళూరుకు ఆయన బయల్దేరారు. ఉండవల్లిలోని తన తాత్కాలిక నివాసానికి చేరుకున్న తర్వాత ఆయన న్యాయనిపుణులను సంప్రదించే అవకాశం కనిపిస్తోంది. రేపటినుంచి నాలుగు రోజుల పాటు అనంతపురం జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటన కొనసాగాల్సి ఉంది గానీ, అది కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరు నుంచి నేరుగా విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును కోరిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని
-
చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని: మత్తయ్య
ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకేం కాదు.. నేనున్నానంటూ చంద్రబాబు గతంలో జోల పాడారని, ఇప్పుడు తనను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టారని మత్తయ్య అన్నారు. చంద్రబాబు అసలు కథేంటో ఈ కేసులో తేలిపోతుందని చెప్పారు. తన కుటుంబానికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ తనతో ఆడుకుంటున్నారని వాపోయారు. తాను భయభ్రాంతులతో ఢిల్లీకి వచ్చానని.. తనకు ఏం జరిగినా కేసీఆర్, చంద్రబాబులదే బాధ్యత అని మత్తయ్య చెప్పారు. ఆయన సోమవారం తనకు ప్రాణహాని ఉందంటూ ఎన్హెచ్ఆర్సీ లో ఫిర్యాదు చేశారు. -
'19లోగా విచారణకు రావాలి'
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం సాయంత్రం అయిదు గంటల లోపు ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఏసీబీ సూచించింది. సండ్ర వెంకట వీరయ్యకు నిన్నరాత్రే ఏసీబీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. తొలుత హైదరాబాద్‌లో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్ట్స్‌లోని 208వ నంబర్ క్వార్టర్లో ఉన్న సండ్ర నివాసానికి ఏసీబీ అధికారులు వెళ్లారు. ఆసమయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో నోటీసులను క్వార్టర్ తలుపునకు అంటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జరిగిన కొనుగోళ్ల వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో సండ్ర వెంకట వీరయ్య బేరసారాలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. -
'ఏపీ ప్రజలతో మాకు శత్రుత్వం లేదు.. బాబుది తప్పే'
హైదరాబాద్: ఇప్పటికైనా తన తప్పును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒప్పుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ క్రమశిక్షణ తప్పిందని ఆరోపించారు. తప్పు చేసినందుకే చంద్రబాబునాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారేనని.. సూత్రధారి మాత్రం చంద్రబాబు అని చెప్పారు. -
సూట్ కేసు రాజకీయం బాబుదే
హైదరాబాద్: సూట్ కేసు రాజకీయం నడిపింది చంద్రబాబునాయుడేనని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయనను ఈ కేసులో ఏ-1 ముద్దాయిగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఆయన వేసిన రాజకీయ చదరంగంలో ఆయనే ఇరుక్కున్నారని చెప్పారు. ఇద్దరు చంద్రులు నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అని అనుకుంటున్నారని విమర్శించారు. ఆ ఇద్దరు రాజకీయ విలువలు కాపాడటం లేదని చెప్పారు. మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ దృష్టంతా రాజధాని హైదరాబాద్‌పైనే ఉందని, రాష్ట్రంలో రైతుల ఇబ్బందులను ఆయన పట్టించుకోవటం లేదని అన్నారు. రైతులు రుణ మాఫీ కాక ఆందోళన చెందుతున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీనిపై తాము ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కమీషన్ల కోసమే వాటర్ గ్రిడ్ పథకం చేపట్టారని, కేసీఆర్ కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని చెప్పారు.