క్వాష్ పిటిషన్ ఎప్పుడు వేస్తారు?
ఏసీబీ కోర్టులో తన మీద విచారణ జరగకుండా ఆపాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా ఆ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా.. తప్పుడు ఆరోపణలున్నా క్వాష్ పిటిషన్ వేస్తారు. కేసులో తనకు సంబంధం లేకున్నా ఇన్వాల్వ్ చేశారని వాదిస్తారు. సిఆర్‌పిసిలోని సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్‌ను కేవలం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో మాత్రమే వేస్తారు.
అయితే, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో స్టీఫెన్‌సన్‌కు రేవంత్ డబ్బులు ఇస్తూ దొరికిపోవడం, దీంట్లో సహ నిందితుడిగా అరెస్టయిన సెబాస్టియన్ సెల్ ఫోన్లో సంభాషణలు దొరకడం, ఆ సంభాషణల్లో చంద్రబాబు నేరుగా స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు నిర్దారణ కావడం సంచలనం సృష్టించింది. ఆ టేపుల్లో ఉన్న గొంతు కూడా చంద్రబాబుదేనని తాజాగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు నిర్ధారించాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు మాట్లాడిన స్వరాన్ని, టేపుల్లో మనవాళ్లు దే బ్రీఫ్‌డ్ మీ అంటూ మాట్లాడిన స్వరాన్ని పోల్చి రెండూ ఒకటేనని తేల్చింది. ఫోరెన్సిక్ నివేదికతో ఈ టేపులు ఓ కీలక సాక్ష్యంగా మారాయి. దాంతో కేసుకు సూత్రధారి చంద్రబాబు అనే అభిప్రాయం వ్యక్తమైంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌తో హైకోర్టు ముందుకొచ్చారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ నేపథ్యంలో .. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో ఏముందున్నది ఆసక్తికరంగా మారింది. గత సోమవారం వచ్చిన ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చాలా స్పష్టంగా, సూటిగా ఉన్నాయి. ఉత్తర్వుల్లో ఎక్కడా ఎవరి పేరునూ పేర్కొనలేదు. తమ ముందు దాఖలైన పిటిషన్‌లో పిటిషన్ దారు కొన్ని సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారని, అవి నిజమైనవంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ధ్రువీకరణను ఇచ్చారని, వాటిని సంబంధిత పోలీసు అధికారులకు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్ష్యాలను పరీక్షించి, వాటిపై దర్యాప్తు చేసి, విచారణ నివేదికను నెల రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని సూచించారు. దీంట్లో చంద్రబాబు పేరు ఎక్కడా పేర్కొనలేదు. ఈ సమయంలో ఏసీబీ కోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ చంద్రబాబు కోరడం కోర్టుల ముందు నిలబడదన్నది న్యాయనిపుణుల వాదన. ఉత్తర్వుల్లో పోలీసులను దర్యాప్తు చేయాలని చెప్పారే కానీ చంద్రబాబు పేరు పేర్కొనలేదని, అలాంటప్పుడు కేసు ఎలా నిలబడుతుందని న్యాయ నిపుణులు అంటారు.