హీరో అవ్వాలంటే నేనున్నా...
విజయవాడ : కామన్ మ్యానే నా సినిమాలో హీరో. తాత.. తండ్రులు... వారి పిల్లలు ఇలా ఎవరికి వారి కుటుంబాలకు చెందిన వారే హీరోలుగా వస్తే సామాన్యుడికి అవకాశం ఎలా వస్తుంది. అందుకే నేను అంతా కొత్త వారికి అవకాశాలు ఇచ్చి వారితో సినిమాలు చేస్తున్నా.. ఇకపై చేస్తానని సినీ దర్శకుడు తేజ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను తేజ దర్శించుక ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తేజకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీఐపీ ల్యాంజ్‌లో మీడియాతో ముచ్చటించారు. తేజతో ముచ్చట్లు మీ కోసం..
ప్రశ్న : హోరా హోరీ ఏలా ఉండబోతుంది..?
జవాబు : సినిమా అంతా కొత్త వారితో చేశాం. మీ విజయవాడ నుంచి ఓ కొత్త కుర్రాడు చైతన్యను విలన్‌గా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నా. అంతేకాదు చైతన్య ఈ సినిమా కృష్ణాజిల్లాకు డిస్టిబ్యూటర్ కూడా.
ప్రశ్న : తేజ సినిమా వచ్చి చాలా కాలం అయినట్లు ఉందీ..?
జ : డబ్బులు కోసం సినిమాలు చేయడం తేజకు ఇష్టం ఉండదు. మూడ్ వచ్చినప్పుడే మంచి సినిమాను చేయాలనే భావన కలుగుతుంది. సంతృప్తిగా ఉంటే సినిమా చేస్తా.
ప్రశ్న : సినిమా గురించి...?
జ : హోరాహోరీ సినిమా దాదాపు 80 శాతం వర్షంలోనే షూటింగ్ చేసుకుంది. హీరోగా దిలీప్, హీరోయిన్‌గా దక్షలను పరిచయం చేస్తున్నాం. ఇక ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం ఉన్న కర్ణాటకలోని ఆగుంబే అనే ఊరిలోనే చిత్రీకరించాం. ఇక మ్యూజిక్‌ను కోడూరు కళ్యాణ్ చాలా బాగా చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాం.
ప్రశ్న : మీ తదుపరి సినిమా...?
జ : అడ్వాన్స్ సైన్స్‌తో భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై సినిమా చేస్తున్నాం. మైండ్‌తో మెటల్‌ను ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చుననేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలోనూ అంతా కొత్త వారే.
ప్రశ్న : అంతా కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తారెందుకు...?
జ : తాత హీరో, మనవడు హీరో.. ఇలా అయితే కామన్ మేన్ ఎప్పుడు హీరో అవుతాడు. హీరో అవ్వాలంటే నేనున్నా. మామూలు మనుషులను కూడా హీరోలను చేస్తా. టాలెంట్ ఉన్న వారికి ఛాన్స్ ఇవ్వాలి. నా ద్వారా ఇప్పటి వరకు వెయ్యి మందిని పరిశ్రమకు పరిచయం చేశా. ప్రస్తుతం ఏ చిత్రం చేసినా నేను పరిచయం చేసిన వారు ఉన్నారు. జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లోనూ ఉన్నారు.
ప్రశ్న : బాహుబలి వంటి సినిమాను ఎప్పుడు చేస్తారు...?
జ : బాహుబలి లాంటి సినిమాలు చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి. బడ్జెట్ కావాలంటే 7, 8 హిట్స్ కావాలి. నాకు హిట్‌లు లేవు కదా.. హిట్ వచ్చాక చేస్తా. బాహుబలి రాజుల కాలం పౌరాణిక తరహా ఉంటే నా రాబోయే సినిమాలో అడ్వాన్స్ కథ ఉంటుంది. 2096వ సంవత్సరానికి వెళ్లి ప్రస్తుత కాలం నాటికి వస్తుంది.
ప్రశ్న : రాజధాని ప్రాంతంలో సినిమా పరిశ్రమ..?
జ : ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై ఉంటుంది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ నాగేశ్వరరావుతో వచ్చి బాగా నిలదొక్కుకుంది. శివ సినిమాతో అక్కడ నుంచి హైదరాబాద్‌లో సినీ రంగం నిలదొక్కుకుంది. అలాగే విజయవాడలో సినిమా షూటింగ్‌లకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని అధికారులు, ప్రభుత్వం చెబుతుంది. త్వరలోనే ఇక్కడ పరిశ్రమ నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి.