హిట్ కోసం హోరాహోరీ
కొత్త సినిమా గురూ!
తెర వెనుక కబుర్లు
* విపరీతంగా వర్షపాతం ఉండే కర్ణాటకలోని ఆగుంబెలో ప్రధాన భాగం చిత్రీకరించారు. ఆ చిత్తడి నేలలో జలగలు, పాములు ఎక్కువ.
* అతి తక్కువ మంది యూనిట్‌తో చిత్రీకరణ జరిపారు. లొకేషన్‌లో 23 మందితో, హీరో నుంచి లైట్‌బాయ్ దాకా అందరికీ ఒకే ఫుడ్, ట్రీట్‌మెంట్‌తో పొదుపుగా సినిమా తీశారు.
* ‘హోరాహోరీ’లో కృత్రిమంగా సృష్టించే షూటింగ్ వాన కూడా రియల్‌గా అనిపించేలా జాగ్రత్త పడ్డారు. ‘రెయిన్ మిషన్’ తయారు చేశారు.
* హీరో, హీరోయిన్, విలన్ - ఈ ముగ్గురికీ షూటింగ్ కన్నా ముందే క్యాస్టింగ్ డెరైక్టర్ రామానంద్ దగ్గర ప్రత్యేక శిక్షణనిప్పించారు. ‘చిత్రం’ టైమ్‌లో ఉదయ్ కిరణ్ నుంచి చాలా మంది కొత్తవాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే!
* కెమేరామన్ దీపక్ భగవంత్ సినిమాల్లోకి రాక ముందు తంజావూరు బృహదీశ్వరాలయంలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్.
ఈ కొత్త మిలీనియమ్ ప్రారంభంలో టీనేజ్ లవ్‌స్టోరీ ‘చిత్రం’తో తెలుగు సినిమా సరికొత్త ప్రయాణానికి దిశ చూపించిన దర్శకుడు తేజ. ఆ తరువాత ‘నువ్వు - నేను’, ‘జయం’ లాంటి హిట్సిచ్చిన ఈ మాజీ సినిమాటోగ్రాఫర్‌కు మళ్ళీ అంత పెద్ద విజయాలు దక్కలేదు. వైఫల్యా లను ఎదుర్కొంటున్న ఆయన ఈసారి ‘హోరాహోరీ’ (ఉపశీర్షిక ‘ఫైట్ ఫర్ లవ్’)తో ముందుకొచ్చారు.
జయము... జయము... టీనేజ్ లవ్‌స్టోరీకి!
టీనేజ్ ప్రేమకథల్లో పెద్ద హిట్టయి, ఒక దశ తరువాత తేజ చేతులకూ, కాళ్ళకూ అడ్డంగా మారిన ‘జయం’ సినిమా తాలూకు ప్రభావం ఈ సినిమా మీదా ఉంది. హైదరాబాద్‌లో అభిరామ్ పోలీసు ఉన్నతాధికారి. చెల్లెలు మైథిలి (దక్ష) పెళ్ళికి ఇవ్వాల్సిన కట్నం కోసం బసవన్న (ఛస్వా) అనే పెద్ద గూండా నుంచి పాతిక లక్షలు తీసుకుంటాడు. నడిరోడ్డు మీద హత్యలు చేసిన సదరు గూండావర్యుడు డబ్బు ఇవ్వడానికి వచ్చి, కాబోయే పెళ్ళికూతురును తొలి చూపులోనే మోహిస్తాడు.
ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడా నికి వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపించేస్తుంటాడు. దాంతో మానసికంగా కుంగిపోయి, మాట్లాడ కుండా తయారై, పెళ్ళికొడుకుల హత్య గుర్తొచ్చి నప్పుడల్లా హీరోయిన్ హిస్టీరికల్‌గా మారిపోతుం టుంది. తాతయ్య సహా కుటుంబం ఆమెను మామూలు మనిషిని చేయడానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం తీసుకువెళుతుంది. అక్కడ నుంచి కథ కర్ణాటకలోని వర్షపాతం ఎక్కువగా ఉండే ఆగుంబెలో నడుస్తుంది. హీరోది ఆ ఊరే. తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో కష్టపడి ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ బామ్మ (సీమ) చాటున ఉండే టీనేజ్ కుర్రాడు స్కంద (దిలీప్).
వరకట్నం వేధింపులకు గురవుతున్న మేనత్తను కాచుకొనే బాధ్యత కూడా అతనిదే. హీరోయిన్‌ను మామూలు మనిషిని చేయడానికి ఇంట్లోవాళ్ళు కాలేజీకి పంపుతారు. ఆమె ద్వారా ఇంటర్నెట్ సెంటర్ బిజినెస్‌ను నిలబెట్టుకోవాలని హీరో ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో హీరో యిన్‌ను హీరో మామూలు మని షిని చేస్తాడు. వాళ్ళి ద్దరూ ప్రేమలో పడ తారు. మరోపక్క హీరోయిన్ కోసం గాలిస్తున్న విలన్ ఆ ఊరికి వస్తాడు. విలన్ ప్రేమిస్తు న్నది తన లవర్‌నే అని తెలియని హీరో, అతనికి ‘లవ్ గురు’ అవుతాడు. తీరా విషయం తెలిశాక హీరో, విలన్ ఏం చేశారన్నది మిగతా సినిమా.
కొత్త, పాతల సమ్మేళనం
గతంలో ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్ లాంటి కొత్త హీరోలను పరిచయం చేసిన తేజ ఈసారి దిలీప్ అనే పాలకొల్లు కుర్రాణ్ణి తెరపైకి తెచ్చారు. హీరోయిన్ దక్ష ఆకర్షణీయంగా ఉన్నా, హావభావాలు పలికించడానికి కృషి మొదలు పెట్టాలి. ఏకకాలంలో నాలుగు వేర్వేరు సినిమాలు వేసుకొని చూసే వెరైటీ విలన్‌గా ఛస్వా బాగు న్నాడు. దక్షిణాదిని ఒకప్పుడు ఊపేసిన పేరున్న సీనియర్ మలయాళ నటి సీమ - హీరో బామ్మ పాత్రలో కనిపించడం ఫ్రెష్‌నెస్సే! రచయిత ఎం.వి.ఎస్. హరనాథరావు హీరోయిన్ తాతగా కనిపిస్తారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలిచ్చి, దర్శకత్వం కూడా వహించడం ఎవరికైనా టఫ్. తేజ కోరి ఆ ఛాలెంజ్‌ను భుజానికెత్తుకున్నారు.
కెమేరా కంటితో... ప్రకృతి అందం
చెట్టుచేమల మధ్య వర్షం పడుతుండగా తీసిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ప్రాణం. సినిమాటోగ్రాఫర్ దీపక్ భగవంత్ కెమేరా యాంగిల్స్, లైటింగ్, వర్షంలో సన్నివేశాల చిత్రీకరణ, పల్లె వాతావరణాన్ని చిత్రీకరించిన తీరు బాగున్నాయి. కల్యాణి కోడూరి బాణీల్లో పాటలన్నీ ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తాయి. ఆ బాణీలకు పెద్దాడ మూర్తి రచన తోడై, ఒకటి రెండు పాటలు బాగున్నాయి. టైటిల్ థీవుసాంగ్ కొంతకాలం వెంటాడుతుంది.
కథ తెలిసిందే! కథనమే...
సినిమా మొదటి పావుగంట ఉత్కంఠగా సాగుతుంది. కథ కర్ణాటకకు షిఫ్టయ్యాక, లవ్‌స్టోరీ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం నిదానిస్తుంది. ఒక దశకు వెళ్ళాక, కథ ఎలా ముందుకు సాగుతుందన్నది సగటు ఆడియన్‌సకు తెలిసిపోతుంది. ఇక, స్క్రీన్‌ప్లే చమత్కారం కోసమే ఆశగా ఎదురు చూస్తాడు. విలన్ కాసేపు పెద్ద రౌడీగా, మరో సారి డి.జి.పి. సైతం తన వెంట వి.ఐ.పి.గా తీసుకొచ్చే బడాబాబుగా సీన్ అవసరాలకు తగ్గట్లు కనిపిస్తారు.
బ్లూటూత్‌లో విలన్ పంపే ఫొటోలను అందుకొని ఫ్లెక్సీ ప్రింట్లు తీయడానికి సిద్ధపడే హీరో ఇంకా ట్రెడిల్ మిషన్‌తో నడిచే ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తుంటాడు. ఇంటర్నెట్ సెంటర్ల మధ్య పోటీ ఒకప్పటి టైప్ ఇన్‌స్టిట్యూ ట్‌ల బాణీలో నిమిషానికి ఎన్ని అక్షరాలు టైప్ చేస్తారనే ధోరణిలో సాగుతుంది. ‘అలా మొద లైంది’, ‘అంతకు ముందు - ఆ తరువాత’తో ఆకట్టుకున్న నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ ఈ కథను తెరకెక్కించడానికి బాగా శ్రమించారు. అది తెరపై కనిపిస్తుంది. వెరసి, ఇది బాక్సాఫీస్ వద్ద గత వైభవం కోసం ‘ఫైట్ ఫర్ లవ్’ అంటూ తేజ ‘హోరాహోరీ’గా చేసిన పోరాటం.