వాళ్లు రైట్... నేనే రాంగ్! | Teja interview about Hora Hori | Sakshi
Sakshi News home page

వాళ్లు రైట్... నేనే రాంగ్!

Published Thu, Sep 10 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

వాళ్లు రైట్... నేనే రాంగ్!

వాళ్లు రైట్... నేనే రాంగ్!

తేజ అంటేనే ఓ ఫైర్‌బ్రాండ్ డెరైక్టర్. కొత్త ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను పరిచయం చేయడంలో ఆయనది సెపరేట్ స్టయిల్. ఆయన ఏదైనా బోల్డ్‌గా మాట్లాడతారు. లేటెస్ట్‌గా తీసిన ‘హోరా హోరీ’ మీద తేజ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తేజ చాలా విషయాలు ముచ్చటించారు.

 


 
 సక్సెస్ కోసమే ఈ ‘హోరా హోరీ’ అనుకోవచ్చా...?
 (నవ్వుతూ).. కథ పరంగా చెప్పాలంటే.. ‘ఫైట్ ఫర్ లవ్’. నా పరంగా చెప్పాలంటే ఫైట్ ఫర్ సక్సెస్.

 రిస్కీ లొకేషన్‌లో షూటింగ్ చేశారు కదా.. దాని గురించి?
 కథానుగుణంగా అత్యధిక వర్షపాతం ఉన్న ఆగుంబే (కర్నాటక)  ప్రాంతంలో తీశాం. అది కింగ్ కోబ్రాలకు హెడ్ క్వార్టర్స్‌లాంటి లొకేషన్. పాములు కనిపించేవి. నేను ఆర్టిస్ట్‌లను హింసపెడతానేమో కానీ పాముల్ని, ఇతర మూగజీవాలను హింసించను. నా సినిమా యూనిట్‌ని హింసపెట్టడం నా ఇంటి పెళ్లి కోసం కాదు. సినిమా భవిష్యత్తు కోసం... వాళ్ల భవిష్యత్తు కోసం.
 
 మేకింగ్ పరంగా ఏదైనా ప్రత్యేకత ఉందా?
 ఈ సినిమాని ‘ఫోర్త్ వాల్’ స్టయిల్‌లో తీశా. నాలుగు గోడలు ఉన్న గదిలో కూర్చుని యూనిట్ సభ్యులం మాట్లాడుతుంటాం. మూడు గోడలు మేమైతే నాలుగో గోడ ప్రేక్షకులు. అంటే..  సినిమా మొదలైన ఐదు నిమిషాలకు ప్రేక్షకులు స్క్రీన్ లోకి వెళ్లిపోయినట్లుగా భావిస్తారు. కళ్ల ముందు జరుగుతున్న నిజంలా భావిస్తారు. ఆస్కార్ అవార్డ్ పొందిన హాలీవుడ్ చిత్రం ‘బర్డ్ మ్యాన్’ ఈ స్టయిల్‌లో రూపొందినదే. ఇప్పటివరకూ తెలుగులో ఈ స్టయిల్‌లో ఎవరూ చేయలేదు. కాకపోతే, మా బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని ‘బర్డ్ మ్యాన్’ స్థాయిలో తీయలేం కాబట్టి, మాకు తగ్గట్టుగా తీశాం.
 
 తక్కువ బడ్జెట్‌లో ముగించడానికి పొదుపుగా వ్యవహరించారట?
  మామూలుగా సినిమాకి 24 శాఖలు పని చేస్తాయంటారు కదా. ఈ చిత్రానికి మహా అయితే  ఐదారు డిపార్ట్‌మెంట్స్ చేసి ఉంటాయి. పని చేసింది జస్ట్ 23 మంది మాత్రమే. అలాగే హీరో, డెరైక్టర్, లైట్ బోయ్స్.. ఇలా అందరికీ ఒకే రకం ఫుడ్డే. వడ్డించేవాళ్లను కూడా పెట్టుకోలేదు. బఫే పద్ధతిలో క్యూలో నిలబడి తినేవాళ్లం. నేనూ లైన్లోనే. ఎందుకంటే ఫుడ్, నిద్ర దగ్గర రాజు-పేద అనే తేడా ఉండదు. మా లొకేషన్లో కుర్చీలు ఉండేవి కాదు. నేను కూర్చోను. ఎవర్నీ కూర్చోనిచ్చేవాణ్ణి కాదు. టీలు ఇచ్చేవాళ్లు ఉండేవారు కాదు. తక్కువ సభ్యులతో సినిమా చేయడంలో ఓ వెసులుబాటు ఉంటుంది. 20 మందిని సెలైన్స్ అనడం ఈజీ.  200 మందితో సినిమాలు తీసే డెరైక్టర్స్‌కి మెగాఫోన్ అవసరం ఉంటుంది. ఆ మెగాఫోన్‌లో కూడా మెల్లిగా మాట్లాడరు. అరుస్తూనే ఉంటారు. నేను అరవను. మైల్లిగా చెబుతాను. పైగా.. ఈడు కొడతాడు అనే పేరుంది కదా నాకు. అందుకని సెలైంట్‌గా చేసేస్తారు.
 
 మరి.. ఈ సినిమా టైమ్‌లో ఎవరినైనా కొట్టారా?
  హీరోయిన్ దక్ష ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఓ సీన్లో హీరోని చాచి లెంపకాయ కొట్టాలి. కొట్టిన తర్వాత ఏడుస్తూ డైలాగ్ చెప్పే బదులు నవ్వింది. దాంతో చెంప మీద జస్ట్ అలా అన్నాను. ఏడ్చింది. అంతే. సీన్ ఓకే అయిపోయింది.
 
 మీరు ఇబ్బందిపెట్టారని, ఇక మీతో సినిమా చేయనని ఈ చిత్రసంగీత దర్శకుడు కల్యాణి కోడూరి అన్నారు..?
 (నవ్వుతూ). సినిమాకి ఏం కావాలో అది పోరాడి పోరాడి చేయించుకున్నా. నాకు నా భార్యాపిల్లలు సెకండరీ. సినిమాయే ఫస్ట్. నేనలా ఉంటాను కాబట్టి నా టీమ్ కూడా అలానే ఉండాలనుకుంటాను. నాలా వాళ్లెలా ఉంటారు? అందుకే వాళ్లే రైట్... నేను రాంగ్. నేను పని పిచ్చోణ్ణి. ఒక్కోసారి ‘ఇతనితో పని చేయడం కష్టం’ అని నిర్మాత దామోదర ప్రసాద్‌గారితో కల్యాణి అనేవారు. మర్నాడు నేను ఫోన్ చేసేవాణ్ణి. వచ్చేవారు. వర్క్ మీద లవ్ ఉన్నవాళ్లు అన్నీ మర్చిపోతారు. ఆయన మంచి టెక్నీషియన్. నాతో సినిమాలెందుకు చేయరు.. చేస్తారు.
 
 ‘హోరా హోరీ’ ఎలాంటి సినిమా?
 సినిమాలు రెండు రకాలు. బి. నర్సింగరావుగారు తీసిన ‘దాసి’ ఆర్ట్ సినిమా. కమర్షియల్ సినిమాలు రెండో రకం. మన కమర్షియల్ సినిమాల్లో హీరో భూమ్మీద నిలబడకుండా స్ప్రింగులు కట్టుకుని గాల్లో ఎగరడం, సుమోలు గాల్లో లేవడం లాంటివన్నీ ఉంటాయి. ఇది బ్రేక్ అవ్వాలి. అప్పుడే సినిమా డెవలప్ అవుతుంది. ‘పాత్ బ్రేకింగ్’ మూవీస్ అంటారు. గతంలో ‘సత్య’ వంటి సినిమాతో రామ్‌గోపాల్ వర్మగారు హిందీలో పాత్  బ్రేక్ చేశారు. ఇప్పుడు ‘క్వీన్’ వంటి సినిమాలు పాత్ బ్రేకింగ్. తమిళంలో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అవి ఆర్ట్ ఫిలింలా ఉంటూ కమర్షియల్‌గా ఉంటాయి. కానీ తెలుగులో అలాంటివి రావు. ఈ సినిమా ద్వారా అటు ఆర్ట్, ఇటు కమర్షియల్‌ని కలపడానికి ట్రై చేశాను. రషెస్ చూసినవాళ్లు రియల్ లైఫ్ చూస్తున్నట్లు ఉందన్నారు. ఇది సక్సెస్ అయితే తెలుగు సినిమా డెఫినెట్‌గా మారొచ్చు. అందరూ ఇలాంటి సినిమా చేయాలనుకుంటారు.
 
   సినిమాల గురించి ఎవరైనా ఏదైనా కామెంట్ చేసేస్తుంటారు.. అలాంటివి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది?
 ఈ మధ్య సినిమా లెంగ్త్ గురించి మాట్లాడేవాళ్లు ఎక్కువైపోయారు. మొన్న ఎవరో సినిమా కొనడానికి వచ్చి ‘ఇంతకన్నా లెంగ్త్ ఉంటే చూడరు’ అన్నారు. ఈ లెంగ్త్ అనే పిచ్చితో ఎడిటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ప్లాన్ చేసి, తెలుగు సినిమాని చంపేశారు. అసలు లెంగ్త్‌కీ, సినిమాకీ సంబంధం ఏంటి? ఏ సినిమా ఎంత లెంగ్త్ ఉండాలో డిసైడ్ చేసేది కథ. హాలీవుడ్ చిత్రాలు ‘టైటానిక్’, ‘అవతార్’, హిందీ ‘లగాన్’ వంటి చిత్రాల లెంగ్త్ దాదాపు మూడు గంటలు పైనే. వాటిని చూడలేదా? రామాయణాన్ని రెండు గంటల్లో, మహాభారతాన్ని నాలుగు గంటల్లో చెప్పగలుగుతామా? దమ్మున్న కథను నాలుగు గంటలైనా చూస్తారు.


 
 లెంగ్తీ చిత్రాలను చూసే ఓపిక ప్రేక్షకులకు పోయిందేమో?
 స్క్రీన్ మీద జరిగేదంతా అబద్ధం అని తెలిసి కూడా ప్రేక్షకుడు టికెట్ కొనుక్కుని ‘ఓకే.. నన్ను ఇడియట్‌ని చెయ్యి’ అని ప్రిపేర్ అయ్యి, సీట్లో కూర్చుంటాడు. అతను తన భార్యను, పిల్లలను బైక్ మీద కూర్చోబెట్టుకుని రద్దీ రోడ్లు దాటి, థియేటర్‌కి తీసుకొచ్చి, కుర్చీలో సెటిల్ అవుతాడు. కూర్చోగానే సినిమా ఒక్క ఊపుతో స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి వేగంగా పరిగెత్తుతుంది. దాంతో ప్రేక్షకులు కామెడీ ట్రాక్స్‌కి కనెక్ట్ అవుతున్నారు కానీ, ఎమోషన్‌తో కనెక్ట్ కావడంలేదు. ఎమోషన్‌తో ఎందుకు కనెక్ట్ కావడంలేదంటే లెంగ్త్ ఇవ్వడంలేదు. ప్రేక్షకులు స్టార్స్‌తో కనెక్ట్ అవ్వరు. కథతో అందులో ఉన్న ఎమోషన్‌తో కనెక్ట్ అవుతారు. ఆర్ట్ ఫార్మ్‌కి రూల్స్ లేవు. విపులంగా చెప్పాల్సిన కథను అలానే చెప్పాలి.
 
 ప్రేమకథా చిత్రాలు చేయడం మీకు కంఫర్టబుల్‌గా ఉంటుందా?
 ఏ సినిమా అయినా కంఫర్టబుల్‌గానే ఉంటుంది. ‘చిత్రం’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘నిజం’, ‘జై’, ‘ఒక విచిత్రం’, ‘వెయ్యి అబద్ధాలు’ లవ్ స్టోరీస్ కాదు. కానీ నా మీద లవ్‌స్టోరీ అనే స్టాంప్ వేసేశారు. నేను అన్ని రకాలూ ట్రై చేశాను. ‘నిజం’లాంటివి తీస్తే ఎందుకు సార్  ‘జయం’ లాంటివి చేయండంటారు. ‘జయం’ చేస్తే మళ్లీ లవ్‌స్టోరీ ఏంటి? అంటారు. వరుసగా యాక్షన్ సినిమాలు తీసే డెరైక్టర్స్‌ని ‘మళ్లీ మళ్లీ యాక్షన్ సినిమాలు తీస్తున్నారేంటి?’ అని అడగరేం. వాస్తవానికి ‘జయం’ కల్ట్ మూవీ అవుతుందనుకోలేదు. ఎక్కడికెళ్లినా ‘జయం’ డెరైక్టర్ అంటారు. నేను తీసిన సినిమాల్లో అదే గొప్ప అనుకుంటారు. అంత గొప్పదా కాదా అనేది నాకు తెలియదు. నాకైతే ‘జయం’ డెరైక్టర్ అంటే కొంచెం చిరాకుగానే ఉంటుంది. అసలు ‘జయం’ ఎందుకు తీశాన్రా అనిపిస్తుంది.
 
 తెలంగాణ వర్కర్స్‌తో ‘హోరా హోరీ’ చేసినందువల్ల ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయట?
 నేనెప్పుడూ ఎవరు వీక్‌గా ఉంటే వాళ్లని సపోర్ట్ చేస్తాను కదా. దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఇది. తెలంగాణ వర్కర్స్‌తో సినిమా చేశానని వైజాగ్‌లో షూటింగ్ ఆపారు. ఆ తర్వాత అది సాల్వ్ అయ్యింది.
 
 వేరే సినిమాల గురించి ఈజీగా కామెంట్ చేసేస్తారెందుకని?
 చేస్తే తప్పేంటి? రూముల్లో కూర్చుని కామెంట్ చేయకుండా ఓపెన్‌గా మాట్లాడేస్తా. అందుకే నేను కామెంట్ చేస్తున్న విషయం నలుగురికీ తెలుస్తోంది. చాలామంది నాలుగు గోడల మధ్య చేసే కామెంట్స్ బయటికి రావు.

 మీ నెక్ట్స్ మూవీ?
 ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నా.
 
 అంటే భారీ బడ్జెట్‌తో ఎక్కువ రోజులు తీస్తారేమో?
 అప్పుడూ బడ్జెట్ లిమిట్‌లోనే ఉంటుంది. రోజుల తరబడి తీసే ప్రసక్తే లేదు. అలా ప్లాన్ చేసుకుంటా. ఇప్పుడు మనం తీస్తున్నవి ‘అల్లూరి సీతారామరాజు’, ‘దానవీర శూరకర్ణ’ కన్నా గొప్ప సినిమాలా? కృష్ణగారు ‘అల్లూరి సీతారామరాజు’లాంటి చిత్రాన్ని చాలా తక్కువ రోజుల్లో తీశారు. రామారావుగారు, నాగేశ్వరరావుగారు, కృష్ణగారిలాంటి గొప్ప హీరోలు ఉండేవారు. ఇప్పుడు అంత క్యాలిబర్ ఉన్న హీరోలు లేరు. వాళ్లకి ఒకళ్లో ఇద్దరో హెల్పర్స్  ఉండేవాళ్లు. ఇప్పుడేమో హీరో వెనకాల ఐదు నుంచి పది మంది ఉంటున్నారు. అప్పటికన్నా టెక్నాలజీ పెరిగినా ఇప్పుడు మనం ఎక్కువ రోజులు తీసుకుంటున్నాం. కొన్ని సినిమాలకు తప్పదు... ఎక్కువ రోజులు పడుతాయి. కానీ, మామూలు సోషల్ సినిమాలను కూడా ఎక్కువ రోజులు తీస్తున్నాం. పెద్దగా ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఇంట్రస్ట్ తగ్గడంవల్ల ఇలా జరుగుతోంది.
 
 మీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని స్టార్స్‌తో తీస్తారా?
 నాకు హిట్లు లేకపోతే ఏ పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వరు. నాకు హిట్లు ఉన్నాయనుకోండి... పెద్ద హీరోతో నాకు పని లేదు (నవ్వుతూ). చూద్దాం..
 
 ఫైనల్లీ... కమల్‌హాసన్‌తో సినిమా గురించి?
 ముందు నేను స్టడీగా నిలబడి,  ఆ తర్వాత పెద్ద హీరో దగ్గరికెళ్లాలి.  ఒక సక్సెస్‌తో వెళ్లాలి. కథ-స్క్రీన్‌ప్లే అన్నీ ఆయనవే. ప్రొడక్షన్, డెరైక్షన్ నాది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement