ఒకడే ఒక్కడు.. అతడే కేసీఆర్‌ | 5 States Election Result Is CM Candidates Win Or Lose | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 11 2018 3:45 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

5 States Election Result Is CM Candidates Win Or Lose - Sakshi

న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమి ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా.. మిజోరాంలో మాత్రం ఎమ్‌ఎన్‌ఎఫ్‌ గెలుపొందింది. మిజోరాం ఓటమితో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇక తెలంగాణలో మాత్రం జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు భారీ షాక్‌ తగిలింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దాదాపు 76 స్థానాల్లో గెలుపొంది సిగిల్‌ మెజారిటీ పార్టీగా నిలిచింది. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, చత్తీసగఢ్‌ రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓటమి పాలు కాగా.. తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీనే మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఆ వివరాలు..

తెలంగాణ : కేసీఆర్‌
తెలంగాణలో కేసీఆర్‌ ‍ప్రభంజనం సృష్టించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ముందస్తుకెళ్లి 2018 ఎన్నికల్లో కూడా ప్రభంజనం సృష్టించారు. కూటమిని కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు. ప్రస్తుతానికి 65 స్థానాల్లో గెలుపొంది.. 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది టీఆర్‌ఎస్‌. అయితే ఈ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌ రెడ్డి మీద 51,546 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

మధ్యప్రదేశ్‌ : శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ - కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగుతుంది. రెండు పార్టీలు దాదాపు 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో 116 స్థానాల్లో గెలుపొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సీహోర్‌ జిల్లా బుధ్ని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2005 నుంచి శివరాజ్‌ సింగ్‌ ఈ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి అరుణ్‌ యాదవ్‌, శివరాజ్‌ సింగ్‌పై పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అరుణ యాదవ్‌ చాలా దూకుడగా వ్యవహరించారు. ముఖ్యంగా విదిశలో జరిగిన ఇసుక మాఫీయా గురించి ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. అరుణ్‌ యాదవ్‌ ఎంత ధీటుగా ప్రచారం నిర్వహించినప్పటికి.. శివరాజ్‌ సింగ్‌ చౌహనే ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది.

రాజస్తాన్‌ : వసుంధర రాజే
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝలావర్ పట్టణంలోని ఝలపతాన్‌ నుంచి ఎన్నికల బరిలో ఈ పాల్గొన్నారు. 2003, 2008, 2013 ఎన్నికల్లో రాజే ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం నాలుగో సారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు రాజే.

అయితే ఈ సారి రాజే గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత జస్వంత్ సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్, రాజేకు గట్టి పోటీ ఇస్తున్నా‍రు.  2014 లోక్‌సభ ఎన్నికల్లో మాన్వేంద్ర సింగ్‌ తండ్రి జస్వంత్‌ సింగ్‌ బీజేపీ తరఫున గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మాన్వేంద్ర సింగ్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీచేస్తున్నారు. అయితే​ ప్రస్తుతానికి ఇక్కడ వసుంధర రాజేనే అధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ పార్టీ ఓడిపోయింది.

చత్తీస్‌గఢ్‌ : రమణ్‌ సింగ్‌
రమణ్ సింగ్ 2003 నుంచి చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో రమణ్‌ సింగ్‌ లోక్‌సభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. 2004 లో చత్తీస్‌గఢ్‌లోని రాజ్నందగావ్ జిల్లాలో దొంగార్గావ్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు రమణ్‌ సింగ్‌. 2008 లో అసెంబ్లీ ఎన్నికలో ఆయన రాజ్నాంద్గావ్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

అయితే ఈ ఎన్నికల్లో రమణ్‌ సింగ్‌ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రమణ్‌ సింగ్‌ ప్రత్యర్థిగా కరుణ శుక్లా పోటీ చేస్తున్నారు. ఈమె మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి మేనకోడలు. 2013 వరకూ బీజేపీలో ఉన్నారు కరుణ. జంజిగిర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి 2004, 2009లో గెలుపొందిన కరుణ.. 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు.

మోదీ, బీజేపీ నాయకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అటల్‌ బిహారి వాజ్‌పేయి పేరును వాడుకుంటున్నారని ఆరోపించిన కరుణ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఇమె కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజ్నందగావ్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ రమణ్‌ సింగ్‌ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ  ఓటమి వైపు అడుగులేస్తోంది

మిజోరాం : లాల్‌ తన్హావాలా
మిజోరం ముఖ్యమంత్రి లాల్‌ తన్హావాలా సెర్‌చిప్‌, చంపాయి స్థానాల నుంచి ఆయ‌న పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ ఆయ‌న ఓడిపోయారు. ప్రస్తుతం మిజోరాంలో ఎంఎన్‌ఎఫ్‌ 26, కాంగ్రెస్‌ 5 స్థానాల్లో విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement