‘న్యూటన్‌’ కంటే ముందే.. ఓ హీరో! | Mangal kunjam's similar attempt like 'Newton' movie | Sakshi
Sakshi News home page

‘న్యూటన్‌’ కంటే ముందే.. ఓ హీరో!

Nov 6 2018 3:47 AM | Updated on Nov 6 2018 3:47 AM

Mangal kunjam's similar attempt like 'Newton' movie - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బస్తర్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ ఎలా జరిగిందనే అంశంపై తీసిన ‘న్యూటన్‌’ సినిమా గుర్తుంది కదా.. ఎన్ని కష్టాలొచ్చినా, చివరకు మావోయిస్టులు ఎదురైనా.. హీరో రాజ్‌ కుమార్‌ రావ్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఎన్నికలు నిర్వహించిన తీరుతో ఈ చిత్రం 2018 సంత్సరానికి భారత్‌ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ఇప్పుడెందుకు ఈ సంగతి అనేగా మీ అనుమానం.. సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే 2013 ఎన్నికల సమయంలో దంతేవాడ జిల్లాలో జరిగింది.

ఆ గ్రామానికి చెందిన 24ఏళ్ల యువకుడు మంగల్‌ కుంజం కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ మవోయిస్టులు తీవ్రంగా హెచ్చరించి వదిలేయడంతో.. చావుతప్పి కన్నులొట్టబోయి సైలెంటయ్యాడు. 2013లోనూ ఇప్పటిలాగే మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే కుంజం మాత్రం ఈ హెచ్చరికలను బేఖాతను చేస్తూ.. ఘమియాపల్‌ పంచాయతీ (20 తండాలు)లో ఊరూరా తిరిగి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేశాడు.

పోలీసులు రక్షణ కల్పిస్తామన్నా ఎవరూ ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ప్రాతంలోని 68% నియోజకవర్గాల్లో ఒక్క ఓటు కూడా నమోదవలేదు. మిగిలిన చోట్ల 20 ఓట్ల కన్నా ఎక్కువ రాలేదు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత కుంజంను స్థానిక దళ కమాండర్‌ పిలిపించి బెదిరించాడు. మరోసారి ఈ తప్పుచేయనని కుంజం బతిమాలుకోవడంతో.. తీవ్రంగా హెచ్చరించి వదిలిపెట్టాడు. నాటి ఘటనను కుంజం గుర్తుచేసుకుంటూ.. ‘పోలీసులు ఎన్నికల వరకే ఉంటారు. ఆ తర్వాత మా పరిస్థితేం కావాలి. అందుకే మావోయిస్టులు చెప్పినట్లుగా ఈసారి మేమెవరమూ ఓటేయబోం’ అని ఆవేదనగా చెప్పాడు.

అక్కడ మాత్రమే బీజేపీతో దోస్తీ !
కేంద్రంలోని ఎన్డీయేలో లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) భాగస్వామిగా ఉంది. ఈ పార్టీ చీఫ్‌ రాంవిలాస్‌ పాశ్వాన్‌ కీలకమైన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ వ్యవహారాలు చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బిహార్‌లో కుదిరిన పొత్తుల్లోనూ ఈ పార్టీకి తగిన∙గౌరవం ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది.

అయితే అదంతా అక్కడి లెక్కేనని.. రాజస్తాన్‌లో మాత్రం తమ దారివేరని ఎల్జేపీ తేల్చేసింది. బీజేపీతో పొత్తుల విషయం తేలకపోవడంతో మొత్తం 200 సీట్లలో పోటీ చేస్తామని స్పష్టంచేసింది. బిహార్‌లో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో ఎల్‌జేపీకి మంచి పట్టుంది. అయితే ఈ దళితుల ఓట్లపైనే ఆధారపడి రాజస్తాన్‌లో పోటీచేయాలనేది ఈ పార్టీ ఆలోచన. అయితే.. దళితుల ఓట్లను చీల్చి బీజేపీకి మేలుచేయడమే పాశ్వాన్‌ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement