
రాయ్‌పూర్‌లో పోలింగ్ సామగ్రిని సరిచూసుకుంటున్న పోలింగ్ సిబ్బంది
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 19 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. పోలింగ్ దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. లక్షమందికి పైగా భద్రతాబలగాలను మోహరించారు. మొత్తం 90 సీట్లలో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్‌లో ఈ నెల 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 8 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది. మిగిలిన మావో ప్రభావిత జిల్లాలైన గరియాబంద్, ధంతరి, మహాసముంద్, కబీర్దమ్, జష్‌పూర్, బల్‌రామ్‌పూర్ జిల్లాల్లో నేడు పోలింగ్ జరగనుంది. రమణ్‌సింగ్ ప్రభుత్వం లోని 9 మంది మంత్రులు, స్పీకర్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఈ 72 సీట్లలో 46 జనరల్, 9 ఎస్సీ, 17 ఎస్టీలకు కేటాయించారు. 2013లో ఈ 72లో 43 స్థానాలను బీజేపీ, 27 సీట్లకు కాంగ్రెస్ చెరో సీటును బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు.
ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కనీసం 65 స్థానాలు గెలుచుకుని వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment