రాజకీయంగా ఇద్దరూ హేమాహేమీలే. ఒకరిది సుదీర్ఘ రాజకీయానుభవమైతే.. మరొకరిది మాజీ ప్రధాని కుటుంబం. వీరిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. ఒకరు వాజ్‌పేయి శిష్యుడు ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ కాగా.. మరొకరు వాజ్‌పేయి అన్న కూతురు కరుణ శుక్లా. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందన్‌గావ్ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇద్దరికీ వాజ్‌పేయితో ఉన్న ఆత్మీయత కారణంగా.. ఆయన వారసత్వం తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు.
రాజ్‌నందన్‌గావ్ ప్రచారంలో వాజ్‌పేయి పేరే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది. తన గురువు, తమ పార్టీ నేత వాజ్‌పేయి అని సీఎం రమణ్‌సింగ్ ప్రచారం చేసుకుంటుంటే.. కాంగ్రెస్ అభ్యర్థి, వాజ్‌పేయి అన్నకూతురు కరుణ శుక్లా కూడా వాజ్‌పేయినే తమ ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. తనే వాజ్‌పేయికి అసలైన వారసురాలినంటున్నారు. మాజీ ప్రధాని పేరును వినియోగించుకునే హక్కు బీజేపీకి లేదని ఆమె విమర్శిస్తున్నారు. వాజ్‌పేయి ఆదర్శాలను తూచ తప్పకుండా పాటిస్తానని.. మహనీయుడి ఆదర్శాలను బీజేపీ గాలికొదిలేసిందని మండిపడుతున్నారు.
‘బీజేపీ భావజాలం, మార్గం అన్నీ మారిపోయాయి. ఇది ఎంతమాత్రం వాజ్‌పేయి, అడ్వాణీలు నడిపిన పార్టీ కాదు’ అని శుక్లా తన ప్రసంగాల్లో విమర్శిస్తున్నారు. వాజ్‌పేయి బోధనలు తన రక్తంలో ఉన్నాయంటున్నారు. తనతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిస్తే నీతివంతమైన పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలు బీజేపీలో ఉన్న కరుణ 2013లో పార్టీని వీడారు. 2014లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. దీంతో రమణ్‌పై కరుణను కాంగ్రెస్ బరిలో దించింది. రాజ్‌నందన్‌గావ్‌లో రమణ్ సింగ్, కరుణ శుక్లాలు ఎదురెదురు ఇళ్లలో ఉండటం విశేషం.
హమారా రమణ్!
అయితే నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రమణ్ సింగ్‌పై సానుకూలంగానే ఉన్నారు. రాష్ట్రాన్ని ఈయన అభివృద్ది చేశారని మధ్యతరగతి విశ్వసిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అది రమణ్ సింగ్ వల్లేనని స్థానికులంటున్నారు. అయితే జీఎస్‌టీ, నోట్ల రద్దుతో స్థానిక వ్యాపారుల్లో బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment