రాయ్‌పూర్: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆయన మేనకోడలు, కాంగ్రెస్ నేత కరుణ శుక్లా ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం రమణ్ సింగ్ గత పదేళ్లలో ఏనాడు వాజ్‌పేయి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించలేదని.. కానీ ఇప్పడు మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఆయన పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. వాజ్‌పేయి మరణానంతరం బీజేపీ స్వప్రయోజనాల కోసం ఆయన అస్థికలను, పేరును వాడుకోవటం దారుణమని మండిపడ్డారు. ఇది తనకు చాలా బాధ కలిగిస్తుందన్నారు. తొలుత బీజేపీలోనే కొనసాగిన కరుణ.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా, ఛత్తీస్‌గఢ్ నూతన రాజధాని కాబోయే నయా రాయ్‌పూర్ పేరును అటల్ నగర్‌గా నామకరణం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ మార్పు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదే కాకుండా కొత్త రాజధానిలోని పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు వాజ్‌పేయి పేరు పెట్టాలని రమణ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం భేటీ అయిన మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం రమణ్ సింగ్ మాట్లాడుతూ... 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అందుకే ఆయన పేరు కొత్త రాజధానికి పెడుతున్నట్లు, అలాగే స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. మరోవైపు వాజ్‌పేయి అస్థికలను దేశంలోని పలు నదుల్లో నిమజ్జనం చేయాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అస్థికలను వివిధ రాష్ట్రాలకు తరలించారు. బుధవారం ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు ధరమ్‌లాల్ కౌశిక్, వాజ్‌పేయి అస్థికలను ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment