ఉద్ధండుడిపై యుద్ధానికి | Introduction of Karuna Shukla | Sakshi
Sakshi News home page

ఉద్ధండుడిపై యుద్ధానికి

Published Mon, Nov 12 2018 1:01 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Introduction of Karuna Shukla - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ పోలింగ్‌. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మీద.. ఒకప్పుడు అదే పార్టీలో ఉండి, బయటికి వచ్చిన మహిళ...ఇప్పుడు పోటీ పడుతున్నారు. గెలుస్తానన్న ధీమా ఆయనకు ఉన్నా, ‘ఓడిపోను కదా..’ అనే సంశయాన్నీ ఆ మహిళ ఆయనకు కలిగిస్తున్నారు! ఆయన రమణ్‌సింగ్‌. ఆమె కరుణాశుక్లా. అంతటి ఉద్ధండుడికి దీటుగా నిలబడిన కరుణలోని వ్యక్తిగత, రాజకీయ ప్రత్యేకతలే ఈవారం మన ‘పరిచయం’.

పుట్టింది: 1950, ఆగస్టు ఒకటవ తేదీన, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో
చదివింది: ఎం.ఎ సోషియాలజీ, భోపాల్‌లోని హమిదియా యూనివర్సిటీ నుంచి 1971లో.
భర్త మాధవ్‌ ప్రసాద్‌ శుక్లా డాక్టర్, ఒక కొడుకు, ఒక కూతురు, నివాసం రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో.
రాజకీయ పార్టీలు: 1982 నుంచి 2013 వరకు బీజేపీలో, 2014 నుంచి కాంగ్రెస్‌పార్టీ.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం మోగింది. ఎన్నికల కమిషన్‌ అక్టోబర్‌లో ఎన్నికల నగారా మోగించింది. హేమాహేమీలంతా నామినేషన్లు వేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కి వరుసగా మూడవ దఫా గద్దెనెక్కిన రికార్డు ఉంది. ఇప్పుడు కూడా నామినేషన్‌ వేయడం, గెలవడం లాంఛనమే అనుకున్నారాయన.

తన నియోజకవర్గం రాజ్‌నంద్‌గాన్‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో, అత్యంత జాగ్రత్తగా, ఆచితూచి, మొక్కుబడిగా నాలుగైదు ప్రాంతాలను సందర్శించి ప్రచారం అయిందనిపించడమే ఈసారి కూడా అనుకున్నారు ఎప్పటిలాగానే. అయితే అదే నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కరుణా శుక్లా అనే బాణాన్ని ఎక్కుపెట్టడంతో రమణ్‌సింగ్‌ ఉలిక్కి పడ్డారు. ఆందోళనను దాచుకుంటూ గెలిచేది మేమేనంటూ ఆయన అభిమానులు ఢంకా బజాయిస్తున్నారు. అయితే.. రమణ్‌సింగ్‌ని అంతటి గగుర్పాటుకు గురిచేసిన ఆ కరుణా శుక్లా ఎవరు?

వాజ్‌పేయి గారింటి అమ్మాయి
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అన్న సుధా బిహారీ వాజ్‌పేయి కూతురు కరుణా శుక్లా!! మరి ఆమె బీజేపీలోనే కదా ఉండాల్సింది?! అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, కానీ ఆమె ఆ పార్టీని వదలడం వల్లనే ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. కరుణా శుక్లాకు వాజ్‌పేయి స్వయానా చిన్నాన్న. ఆయన మీద ఎనలేని ప్రేమాభిమానాలున్నాయామెకి. పార్టీ స్థాపించినప్పటి నుంచి చిన్నాన్నతో కలిసి పనిచేశారు. అదే పార్టీ నుంచి 1993లో బాలోద బాజార్‌ నియోజకవర్గం నుంచి మధ్యప్రదేశ్‌ (అప్పటికి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడలేదు) శాసనసభకు ఎన్నికయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడిన తర్వాత 2004లో జంజ్‌గిర్‌ లోక్‌సభస్థానం నుంచి గెలిచారు. 2009లో కోర్బా నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి చరణ్‌దాస్‌ మహంత్‌ చేతిలో ఓడిపోయారు. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బిలాస్‌పూర్‌ శాసనసభ స్థానానికి పోటీ చేసి విజయానికి దూరంగానే ఉండిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజ్‌నంద్‌గాన్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మీద పోటీలో ఉన్నారు. రమణ్‌సింగ్‌– కరుణాశుక్లాలు నువ్వా – నేనా అంటూ పోటీ పడుతున్న ఆ ఎన్నిక ఈ రోజే (నవంబర్‌ 12). ఈ పరిణామాల వెనుక ఏం జరిగింది?

పార్టీని వీడుతూ...
కరుణాశుక్లా బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలను, భారతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా విధులను,  పార్టీలో మరికొన్ని కీలక బాధ్యతలనూ నిర్వహించారు. 1992 నుంచి 2013 వరకు రెండు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధాన్ని ఒక్కసారిగా వదులుకున్నారామె.

ఆ ఏడాది డిసెంబర్‌ 25వ తేదీన భారతీయ జనతాపార్టీని వీడుతూ... ‘‘అధికారం, ప్రభుత్వం చేతిలో ఉన్న కొందరు వ్యక్తుల ప్రభావంలో పార్టీ మునిగిపోతోంది, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌.. పార్టీని, ప్రభుత్వాన్ని ఒన్‌ మ్యాన్‌ షోగా నడిపిస్తున్నారు, అందుకే ఆ పార్టీని వీడుతున్నాను. నేను విలువలతో కూడిన రాజకీయాలనే నిర్వహించాను. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా జీవించాను. బీజేపీలో చివరి ఐదేళ్లు గడిపిన జీవితం నా నమ్మకాలకు పూర్తిగా వ్యతిరేకం. అందుకే పార్టీని వీడాను. బీజేపీ రూపు మారింది. మారిన బీజేపీ నా అవసరం లేదనిపించింది’’ అన్నారామె.

వాజ్‌పేయి కోసం గళం
కరుణాశుక్లా బీజేపీని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత కూడా చిన్నాన్న వాజ్‌పేయి కోసం గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. వాజ్‌పేయి చితాభస్మాన్ని బీజేపీ శ్రేణులు అన్ని రాష్ట్రాలకూ తీసుకెళ్తున్న సమయంలో ఆ చర్యను కరుణా శుక్లా తీవ్రంగా దుయ్యబట్టారు. ‘దాదాపు దశాబ్దకాలంగా ఆ పార్టీ వాజ్‌పేయిని మర్చిపోయింది. ఆయన అనారోగ్యంతో మంచం పడితే, ఆ నాయకులు కనీసం ఆయనను చూడటానికి కూడా రాలేదు. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడటంతోపాటు ఆ పార్టీ మునిగిపోయే క్లిష్టపరిస్థితుల్లో ఉండటంతో, రాజకీయంగా తాము కోల్పోయిన ప్రాధాన్యం తిరిగి రాబట్టుకోవడానికి వాజ్‌పేయి చితాభస్మాన్ని కూడా వాడుకుంటోంద’ని ఆమె ఆరోపించారు.

‘వాజ్‌పేయి చితాభస్మాన్ని రమణ్‌సింగ్‌ తన రాజకీయ ప్రయోజనాలకు మలచుకుంటున్నాడు. వాజ్‌పేయి పేరు ఉపయోగించుకునే నైతిక అర్హత రమణ్‌సింగ్‌కు లేదు. ఎందుకంటే ఆయన నిర్వహించిన రాజ్యోత్సవ్‌లో వాజ్‌పేయికి ఎక్కడా ఒక్క పోస్టర్‌ కూడా వేయలేదు. అతడి సేవలను కూడా తెరమరుగు చేసేసింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికి ఆయన పేరు, ఫొటోలను వాడుతోంది’ అని తన ప్రచారంలో ఎండగడుతున్నారామె. ‘బీజేపీ అనుకుంటున్నట్లు అటల్‌ జీ ఓటు బ్యాంకు కాదు. విలువలకు, సిద్ధాంతాలకు మూర్తీభవించిన రూపం ఆయన. వాజ్‌పేయి బతికుండగా గుర్తుకు రాలేదెవ్వరికీ.

ప్రాణం పోగానే (ఈ ఏడాది ఆగస్ట్‌ 16వ తేదీన ఆయన ఎయిమ్స్‌లో తుదిశ్వాస వదిలారు) ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టుకుంటోంది, ఛత్తీస్‌గఢ్‌లో ఒక నగరానికి ఆయన పేరు పెట్టాలని కూడా నిర్ణయించింది’ అని తన ప్రచార సభల్లో ఉద్ఘాటిస్తున్నారు కరుణాశుక్లా. ‘నెహ్రూ ఎదుట చిన్నాన్న పార్లమెంట్‌లో మాట్లాడినప్పుడు.. ‘ఈ కుర్రాడు భవిష్యత్తులో ఈ దేశానికి ప్రధాని అవుతాడు’ అన్నారాయన. చిన్నాన్నకు అలా నెహ్రూజీ ఆశీస్సులు అందాయి’ అని కూడా పదే పదే గుర్తు చేస్తున్నారామె.

విమర్శనాస్త్రాలు
కరుణా శుక్లా 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందడంతో, అప్పటి నుంచి పార్టీలో ఆమెకు నిరాదరణే ఎదురైంది. పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్న పరిస్థితులను జీర్ణించుకోలేక ఆమె పార్టీని వీడారు. పార్టీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా గెలిచి పార్టీకి, ప్రజలకు సేవలందించిన సంగతిని ఆ పార్టీ మర్చిపోయిందనేది కూడా ఆమె ఆవేదన.

అయితే ‘ఓటమి కారణంగా ఆమె నిరాశ, ఆందోళనల్లో మునిగిపోవడంతో పార్టీ మీద ఆరోపణ చేశారు తప్ప, నిజానికి ఆమె నిరాదరణకు గురి కాలేద’ని పెద్దలు సర్దిచెప్పుకున్నారు, ఆమెను బుజ్జగించి పార్టీలో కొనసాగడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. ఆమె బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరినప్పుడే వాజ్‌పేయి పాటించిన విలువలకు తిలోదకాలిచ్చారని రమణ్‌ సింగ్‌ కొడుకు అభిషేక్‌ సింగ్‌ (రాజ్‌నంద్‌గాన్‌ పార్లమెంట్‌ సభ్యుడు) కరుణాశుక్లా మీద ఎదురు దాడి చేస్తున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూ– గాంధీ కుటుంబాల త్యాగాలను ఆమె విపరీతంగా ప్రశంసించడం మీద కూడా విమర్శలొచ్చాయి.

ప్రత్యర్థికి దీటుగా
‘రమణ్‌ మీద విశ్వాసం ఉంచండి, కమలం అభ్యుదయానికి నిర్వచనం’ అనే నినాదంతో జనంలోకి వెళ్తోంది కమలం పార్టీ. గడచిన 2013 ఎన్నికల్లో రమణ్‌ సింగ్‌ 35 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల ఓటర్లు సింగ్‌కు బాసటగా నిలిచారప్పుడు.

ప్రస్తుతం ఆ ఓటు బ్యాంకును ఛేదించడం మీద కరుణాశుక్లా తీవ్రంగా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో మితిమీరుతున్న లిక్కర్‌ అమ్మకాలు, యువతకు అవకాశాల లేమి, నిరుద్యోగం, రైతుల శ్రేయస్సు తదితర అంశాలను ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో రైతులు నిర్వహించిన ఆందోళనలు కూడా తనకు కలిసి రావచ్చని కరుణాశుక్లా ఆశిస్తున్నారు. ఆ (రైతుల) ఆందోళన పట్ల రమణ్‌ సింగ్‌ లోలోన కొంచెం ఆందోళనకు గురవుతున్నారు.

మరి.. ముఖ్యమంత్రి ఎవరు?
‘ముఖ్యమంత్రిని కానీ, ప్రధానమంత్రిని కానీ ఎన్నికల తర్వాత అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ శాసనసభ, పార్లమెంట్‌ సభ్యులు సమావేశమై నిర్ణయిస్తారని, ముందుగానే ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎన్నికలకు వెళ్లడం మీద తనకు నమ్మకం లేద’ని లౌక్యంగా చెప్పారు కరుణా శుక్లా. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆమెను నిలబెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. కానీ కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు వస్తే కరుణాశుక్లా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి అవుతారని ఎక్కడా ప్రకటించలేదా పార్టీ.

అయితే కరుణ సమాధానంలో ఎక్కడా ‘తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థి మీద పోటీ చేస్తున్నానంతే’ అని కమిట్‌ కావడం లేదు కూడా. నూటపాతికేళ్ల పార్టీ వ్యవహరిస్తున్నంత లౌక్యంగానే ఉంటోందామె మాట కూడా. తాను రాజ్‌నంద్‌గాన్‌లో గెలిచి,∙కాంగ్రెస్‌పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ కనుక వస్తే... ముఖ్యమంత్రిని ఎన్నుకునే క్రమంలో ‘తనను ముఖ్యమంత్రిని చేయాల్సిందే’నని డిమాండ్‌ చేయడానికి అనువుగానే మాట్లాడుతున్నారు కరుణా శుక్లా.

అక్టోబర్‌ 22న కాంగ్రెస్‌ పార్టీ కరుణాశుక్లా పేరు ప్రకటించే వరకు రాజ్‌నంద్‌గాన్‌ నియోజకవర్గం పెద్దగా వార్తల్లో లేదు. ఎప్పటిలాగానే రమణ్‌సింగ్‌ పోటీ చేసి గెలిచే సీటుగానే అందరి అభిప్రాయం అప్పటి వరకు. కరుణా శుక్లా పేరు వినిపించినప్పటి నుంచి గెలుపు మీద అంచనాలు, విశ్లేషణలు మొదలయ్యాయి. ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ప్రధాన భూమికను పోషిస్తున్నారు కరుణాశుక్లా.
 

చిన్నాన్న నుంచి కవిత్వం
కరుణాశుక్లా అనేక సందర్భాల్లో వాజ్‌పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ‘‘స్కూల్లో పాటలు, కథలు, కవితల పోటీలు జరిగినప్పుడు నేను చిన్నాన్నను అడిగేదాన్ని. ఆయన ఆశువుగా చెప్పిన కవితలను రాసుకుని వెళ్లి స్కూల్లో చదివితే, ఒకటే చప్పట్లు. నాకు ఎంతో గౌరవం దక్కేది. చిన్నాన్న పుట్టిన కుటుంబంలోనే నేనూ పుట్టడం, ఆ కుటుంబీకుల్లో నేను ఒకదానిని కావడం నా అదృష్టం అనుకునేదాన్ని. పువ్వులకు చుట్టిన వస్త్రానికి కూడా పూల వాసన అంటినట్లే, చిన్నాన్నలో ఉన్న కవి పరిమళం నాకు తావి అయ్యింది’’ అని స్నేహితులతో సంతోషంగా పంచుకునేవారు కరుణాశుక్లా.


– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement