
కరుణా శుక్లా
రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మేనకోడలు కరుణా శుక్లాను కాంగ్రెస్ బరిలోకి దించనుంది. రాష్ట్రంలో నవంబర్ 12న మొదటి విడత జరిగే ఎన్నికలకు గాను ఆరుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రత్యర్థిగా రాజ్‌నందన్‌గావ్ నుంచి ఆమె రంగంలోకి దిగనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మాజీ ఎంపీ అయిన కరుణా శుక్లా బీజేపీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదంటూ 2013 ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి, 2014లో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆమె బీజేపీ పాలనపై, సీఎం రమణ్‌సింగ్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే 18 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా.. రెండు విడతలకు కలిపి బీజేపీ 78 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది.