సంకీర్ణ ప్రభుత్వాలు ఎలా కూలాయి? | How Coalition Governments Collapsed | Sakshi
Sakshi News home page

సంకీర్ణ ప్రభుత్వాలు ఎలా కూలాయి?

Published Fri, Feb 15 2019 4:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

How Coalition Governments Collapsed - Sakshi

సాక్షి, న్యూఢిలీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకిగానీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని కూటమికిగానీ, మరో పక్షానికిగానీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంపూర్ణ మెజారిటీ వచ్చే ఆస్కారమే లేదని పలు సర్వేలు సూచిస్తున్న నేపథ్యంలో మరోమారు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా ? అలా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలంపాటు మనుగడ సాగించగలదా? గతంలోలాగే కూలిపోయే అవకాశం ఉందా ? గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఎందుకు కూలిపోయాయి ? అందుకు బాధ్యులెవరు ? సంకీర్ణ ప్రభుత్వాలు మనుగడ సాగించేందుకు అవకాశమే లేదా ? 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలకు నాంది పడింది. నాడు కాంగ్రెస్‌ పార్టీకి 197 సీట్లురాగా, జనతాదళ్‌కు 143 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి జనతాదళ్‌ తిరస్కరించింది. స్వయంగా ప్రధాని అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధపడి వీపీ సింగ్‌ పేరును ప్రతిపాదించింది. సైద్ధాంతికంగా పూర్తి భిన్నమైన బీజేపీ, వామపక్షాలు వీపీ సింగ్‌కు మద్దతివ్వడంతో ఆయన ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. 

ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు
దేశంలోని ఇతర వెనకబడిన వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వీపీ సింగ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దేశంలోని అగ్ర వర్ణాల వారికి కోపం తెప్పించింది. బీజేపీకీ కూడా కోపం వచ్చింది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్న అగ్రవర్ణాలతోపాటు అయోధ్య రాముడి పేరిట మధ్యతరగతికి చెందిన హిందువులనంతా ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అడ్వానీ, 1990, సెప్టెంబర్‌ 25వ తేదీన గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ నుంచి రథయాత్రను ప్రారంభించారు. ఆయన యాత్ర షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 30వ తేదీన అయోధ్య చేరుకొని అక్కడ కరసేవకుల మధ్య ముగియాలి. 

అడ్వానీ రథయాత్ర కారణంగా వివిధ రాష్ట్రాల్లో మత ఉద్రిక్తతలు తలెత్తి అవి ఘర్షణలకు దారితీయడంతో అడ్వానీ యాత్రను ఆపాల్సిందిగా వీపీ సింగ్‌ ప్రభుత్వం మీద వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి లొంగిపోయినట్లయితే మద్దతు ఉపసంహరించుకుంటామని వీపీ సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ అల్టిమేటమ్‌ జారీ చేసింది. అడ్వానీ యాత్ర బీహార్‌లో ప్రవేశించినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అక్టోబర్‌ 23వ తేదన అడ్వానీ యాత్రను అడ్డుకొని ఆయనను అరెస్ట్‌ చేసింది. పర్యవసానంగా వీపీ సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో నవంబర్‌ ఏడవ తేదీన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో వీపీ సింగ్‌ ప్రభుత్వం ఓడిపోయి కూలిపోయింది. 

‘మీరు ఎలాంటి దేశాన్ని సష్టించానుకుంటున్నారు ?’ అని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ఉద్దేశించి వీపీ సింగ్‌ ప్రశ్నించారు. నేడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీజేపీని ఉద్దేశించి పదే పదే ఇదే ప్రశ్న వేస్తున్నారు. అప్పుడు చంద్రశేఖర్‌ జనతాదళ్‌లో చీలిక తీసుకొచ్చి 57 మంది ఎంపీలతో జనతాదళ్‌ (సమాజ్‌వాది) పార్టీని ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో నవంబర్‌ 10వ తేదీన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే తమిళనాడులోని ‘ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే)’ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ చంద్రశేఖర్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. 

ఎల్‌టీటీఈకీ మద్దతు ఇస్తున్నారన్న కారణంగా......
‘లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈళం’ మిలిటెంట్ల నిర్మూలనకు డీఎంకే ప్రభుత్వం సహకరించడం లేదని, పైగా వారికే మద్దతు ఇస్తోందన్నది కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణ. వాస్తవానికి తన మిత్రపక్షమైన అన్నా డీఎంకే సూచన మేరకే కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో చంద్రశేఖర్‌ ప్రభుత్వం 1991, జనవరిలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసింది. ఎలాగైనా మధ్యంతర ఎన్నికలను తీసుకరావాలని కోరుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ, చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చేందుకు కుట్రలు పన్నడం ప్రారంభించింది. రాజీవ్‌ గాంధీ నివాసంపై ఇద్దరు హర్యానా పోలీసులతో ప్రధాని చంద్రశేఖర్, డిప్యూటీ ప్రధాని దేవీలాల్‌లు నిఘాను ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం అందుకుంది. 

చంద్రశేఖర్‌ రాజీనామా 
కాంగ్రెస్‌ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ 1991, మార్చి ఆరవ తేదీన చంద్రశేఖర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మే నెలలో రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు. జూన్‌ నెలలో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనంత మెజారిటీ సీట్లు రాలేదు. అయినప్పటికీ పలు పార్టీల మద్దతుతో కాంగ్రెస్‌ నుంచే పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన పలు ఎత్తులు, జిత్తులతో ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగారు. నలుగురు జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎంపీలకు ముడుపులు ఇవ్వడం ద్వారా ఆయన అవిశ్వాస తీర్మానం గట్టెక్కారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

1996లో సంకీర్ణం పునరావతం
1996లో జరిగిన ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ రాజకీయాలు పునరావతం అయ్యాయి. బీజేపీ, దాని మిత్రపక్షాలకు 200 సీట్లకు లోపురాగా, కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు 150 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 13 ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు, జనతాదళ్‌ కలిసి ఐక్య సంఘటనగా ఏర్పడ్డాయి. 190 సీట్లు కలిగిన ఐక్య సంఘటన కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే ఐక్య సంఘటనను చీల్చే ప్రయత్నాల్లో ఉన్న అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పీవీ నరసింహారావు సకాలంలో మద్దతు ప్రకటించకపోవడంతో రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటుకు అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీకి అవకాశం ఇచ్చారు. 

ప్రధానిగా వాజపేయి ఎన్నిక, రాజీనామా
1996, మే 16వ తేదీన బీజేపీ సీనియర్‌ నాయకుడు అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అవసరమైన మెజారిటీని సమకూర్చుకోలేక పోవడంతో  ఆయన మే 27వ తేదీనా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ మద్దతుతో ఐక్యఫ్రంట్‌ అభ్యర్థిగా హెచ్‌డీ దేవెగౌడ్‌ జూన్‌లో ప్రధాని అయ్యారు. పీవీ నరసింహారావు స్థానంలో సీతారాం కేసరి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అవడంతో ఆయనకూ కష్టాలు ప్రారంభమయ్యాయి. కేరళ కాంగ్రెస్‌ నాయకుడు కరుణాకరన్‌ను ఎనిమిది సార్లు కలుసుకున్న దేవెగౌడ కేసరిని మాత్రం రెండు సార్లకు మించి కలుసుకోలేదు. మైనర్‌ కంటి ఆపరేషన్‌ చేయించుకున్న పీవీ నరసింహారావును ఆస్పత్రికి వెళ్లి పలకరించిన దేవెగౌడ, వైరల్‌ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన కేసరిని పట్టించుకోలేదు. దాంతో కోపం వచ్చిన కేసరి, దేవెగౌడపై ఒత్తిడి రాజకీయాలు ప్రారంభించారు. 

యూపీ గవర్నర్‌ తొలగింపునకు ఒత్తిడి
ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న రొమేశ్‌ భండారీని తొలగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. ఐక్యఫ్రంట్‌ సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉండడంతో దేవగౌడ ఆ చర్య తీసుకోవడానికి నిరాకరించారు. దాంతో 1997, మార్చి 30న కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. పర్యవసానంగా ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన విశ్వాస పరీక్షలో దేవగౌడ ఓడిపోయారు. పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు ఐక్య ఫ్రంట్‌ అంగీకరించలేదు. ఫ్రంట్‌ను చీల్చేందుకు కేసరి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీని రాకుండా అడ్డుకునేందుకుగాను ఫ్రంట్‌ అభ్యర్థినే ప్రధానిగా కాంగ్రెస్‌కు ఒప్పుకోక తప్పలేదు. 

ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌
కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఐక్యఫ్రంట్‌ తరఫున ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ ప్రధాన మంత్రి అయ్యారు. ఇంతలో రాజీవ్‌ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిన ఎంసీ జైన్‌ కమిషన్‌ మధ్యంతర నివేదిక బయటకు వచ్చింది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రాజీవ్‌ గాంధీకి తగిన రక్షణ కల్పించలేక పోయిందని కమిషన్‌ అభిప్రాయపడింది. దాంతో ఐక్య ఫ్రంట్‌ నుంచి డీఎంకేను తప్పించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఐక్యఫ్రంట్‌పై ఒత్తిడి తెచ్చింది. అందుకు ఫ్రంట్‌ ససేమిరా అంది. పర్యవసానంగా 1997, నవంబర్‌ 28వ తేదీన గుజ్రాల్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. అదే రోజు గుజ్రాల్‌ రాజీనామా చేసి లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేశారు. 

మరోసారి వాజపేయి
1998లో జరిగిన ఎన్నికల్లో మిత్ర పక్షాల మద్దతుతో బీజేపీ నాయకుడు అటల్‌ బిహారి వాజపేయి మరోసారి ప్రధాని అయ్యారు. ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో 1999, ఏప్రిల్‌ నెలలో వాజపేయి ప్రభుత్వం కూలిపోయింది. తమ నాయకురాలు జయలలితపై దాఖలైన 42 అవినీతి కేసులు ముందుకు సాగకుండా అడ్డుకోవాల్సిందిగా ఏఐడీఎంకే ఒత్తిడి తెచ్చింది. ఆమెను విచారిస్తున్న ప్రాసిక్యూటర్లను, ఆదాయం పన్ను అధికారులను వాజపేయి ప్రభుత్వం బదిలీ చేసింది. అంతటితో సంతప్తి చెందని ఏఐడిఎంకే అప్పుడు అధికారంలో ఉన్న డీఎంకేను డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

అందుకు వాజపేయి అంగీకరించకపోవడంతో మద్దతు ఉపసంహరించుకొంది. అప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తూ వాజపేయి విశ్వాస తీర్మానానికి ముందుకు వచ్చారు. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి పదవి నుంచి తప్పుకున్నారు. వాజపేయి ప్రభుత్వానికి ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడం మినహా మిగతా అన్ని సందర్భాల్లో జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌ల వల్లనే సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోయాయ. ఆ రెండు పార్టీలు కూడా ప్రభుత్వం సుస్థిరతకన్నా తమ పార్టీ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యతను ఇచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement