వాజ్‌పేయి సంతాప సమావేశంలో పడీపడీ నవ్వుతున్న మంత్రులు
రాయ్‌పూర్ : దేశం గర్వించదగ్గ రాజకీయ నేత వాజ్‌పేయి. కాంగ్రెసేతర ప్రధానిగా మూడు సార్లు పదవి బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయి, తీవ్ర అనారోగ్య ఇబ్బందులతో ఈ నెల 16వ తేదీని కన్నుమూశారు. ఆయన మరణవార్తతో యావత్ భారత దేశం మూగబోయింది. వాజ్‌పేయి చితాభస్మాలను అన్ని రాష్ట్రాల నదీ జలాల్లో నిమజ్జనం చేపడుతున్నారు. అంతేకాక సంతాప సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహించిన వాజ్‌పేయి సంతాప సభలో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాపసభ రాయ్‌పూర్‌లో బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరయిన వారంతా వాజ్‌పేయికి విషణ్ణ వదనంతో నివాళులర్పించారు. కానీ, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అజయ్ చంద్రకర్, వ్యవసాయ శాఖా మంత్రి బ్రిజ్‌మోహన్ అగర్వాల్ మాత్రం ముందున్న బల్లను కొట్టుకుంటూ పడీపడీ నవ్వుతూ సంతాప సభను అపహాస్యం చేశారు. సంతాప సభలో పక్కపక్కను కూర్చున్న వీరిద్దరూ జోకులేసుకుంటూ బిగ్గరగా నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చంద్రకర్ ముందున్న టేబుల్ కొడుతూ పడీపడీ నవ్వుతున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ ధరమ్‌లాల్ కౌశిక్ ఆయన చేతిని పట్టుకుని, వారి నవ్వులను ఆపాలని పలుసార్లు సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
మంత్రుల వ్యవహరించిన తీరుపై వాజ్‌పేయి అభిమానుల నుంచి, విపక్ష సభ్యుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. నెటిజన్లు ఈ మంత్రులిద్దరిపై సోషల్ మీడియా సాక్షిగా దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన వాజ్‌పేయికి సొంత పార్టీ నేతలిచ్చే గౌరవమిదేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. వాజ్‌పేయి బతికి ఉన్నప్పుడే, ఆయన్ను బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదని, మీ నేతకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేత శైలేష్ నితిన్ త్రివేది, విమర్శించారు. ‘బీజేపీ నేతలు అటల్ జీకి గౌరవం ఇవ్వలేకపోతే, కనీసం ఆయనను తక్కువ చేయొద్దు. అటల్ జీ చనిపోయిన తర్వాత ఆయనపై బీజేపీ, రమణ్ సింగ్ చూపిస్తున్న ప్రేమ, గౌరవం ఏమీ లేదు. ఇదంతా కేవలం డ్రామానే’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment