పట్నా : రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే తన మాటల వల్ల బాధ పడి ఉంటే ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని జేడీ(యూ) బహిష్కృత నేత శరద్ యాదవ్ అన్నారు. ఈ మేరకు క్షమాపణ కోరుతూ ఆమెకు లేఖ కూడా రాస్తానని పేర్కొన్నారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్ యాదవ్ వసుంధర రాజేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అల్వార్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న యాదవ్... ‘వసుంధరకు కొంత విశ్రాంతి ఇవ్వండి.. ఈ మధ్య ఆమె చాలా అలసిపోయారు. అలాగే లావయ్యారు కూడా. ఆమె సన్నబడాల్సి ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే బాడీ షేమింగేనని బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అంతేకాకుండా శరద్ యాదవ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన విమర్శల పాలయ్యారు.
కాగా శరద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన వసుంధర రాజే శుక్రవారం మాట్లాడుతూ.. ‘ షాక్‌కు గురయ్యాను. నిజంగా చాలా అవమానకరంగా అన్పించింది. ఇలా మహిళలను కించపరచడం ద్వారా యువతకు ఆయన ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘం తప్పకుండా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల నేతలు వారి భాషను నియంత్రించుకోవాలి’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment