న్యూలుక్‌.. హైటెక్‌ | Each party have their own strategy | Sakshi
Sakshi News home page

న్యూలుక్‌.. హైటెక్‌

Published Sat, Nov 3 2018 3:01 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Each party have their own strategy - Sakshi

ఎన్నికల్లో గెలవాలంటే అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకం. వందల సీట్లకు పోటీ పడే వేల మందిలో గెలుపు గుర్రాలెవరన్నది అంచనా వేయడం అంత సులభం కాదు. అభ్యర్ధిని ఎంచుకోవడం ఒక ఎత్తుకాగా, తిరుగుబావుటా ఎగరేసిన అసంతృప్తులను బుజ్జగించడం మరో ఎత్తు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపికలో ఒక్కో పార్టీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. పాతవాళ్లను తప్పించడం ఒక పార్టీ వ్యూహం కాగా వివిధ సర్వేలతో ఎంచుకోవడం ఇంకొక పార్టీ పాలసీ. ఎలా ఎంచుకుంటేనేంటి గెలవడమే ముఖ్యమనేది అన్ని పార్టీల కామన్‌ పాలసీ. ప్రసుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో గెలుపు గుర్రాలను గుర్తించడం కోసం బీజేపీ, కాంగ్రెస్‌ వివిధ వ్యూహాలను అనుసరిస్తున్నాయి. 

యాప్‌తో ఎంపిక
ఇంత వరకు కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ఎంపిక అధిష్టానం అభీష్టం మేరకు జరుగుతూ వస్తోంది. తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థినే స్థానిక కార్యకర్తలు భరించాల్సి వచ్చేది. దీనివల్ల చాలా చోట్ల పార్టీ విజయావకాశాలు దెబ్బతినేవి. రాహుల్‌ వచ్చాక ఈ పరిస్థితి మారింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నేతల అభ్రిపాయాల మేరకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, దానివల్ల విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నిర్ణయించారు. దీంతో ఈ సారి బూత్‌ స్థాయి కార్యకర్తల అభిమతం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ రెడీ అవుతోంది. ఇందుకోసం శక్తి పేరిట ఒక యాప్‌ను సిద్ధం చేశారు. బూత్‌ స్థాయి కార్యకర్తలందరూ ఈ యాప్‌ ద్వారా తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి పంపుతారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. 

ఇంత వరకు 4 లక్షల మంది ఈ యాప్‌ ద్వారా అభిప్రాయాలు పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌లలో ఇంత వరకు 35,82,595 మంది శక్తి యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారని, రాజస్థాన్‌లో నూరు శాతం బూత్‌లను కవర్‌ చేయడం జరిగిందని తెలిపాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల ప్రచారాంశాలుగా వేటిని తీసుకోవాలన్న అంశంపై కూడా బూత్‌ స్థాయి కార్యకర్త అభిప్రాయాలను తెలుసుకుని వాటి ఆధారంగా ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేయనున్నారు. 

కొత్త ముఖాలకు టికెట్లు
ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ఒకటే పాలసీ అనుసరిస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో కొందరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం బీజేపీలో ఆనవాయితీ. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకతను కొంత వరకు అధిగమించవచ్చని కమలనాధుల ఆలోచన. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యూహాన్నే అమలు పరచేవారు. ఈదఫా ఇదే పాలసీని ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో 14 మందికి టికెట్‌ ఇవ్వలేదు. వీరిలో ఒక మంత్రి కూడా ఉన్నారు. రాజస్థాన్‌లో కూడా ఈ ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇక్కడ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో సగం మందికి ఈ సారి టికెట్‌ రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే కొత్త వాళ్లని పెడితే తప్పనిసరిగా గెలుస్తారన్న హామీ ఏమీ లేదు. సాధారణంగా పార్టీ ఓడిపోతుందని అంచనా ఉన్న నియోజకవర్గాల్లోనే కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తారు.ఆ అభ్యర్థి నెగ్గితే పార్టీకి అదనపు లాభం వస్తుంది. ఒకవేళ ఓడిపోతే ముందే తెలుసు కాబట్టి పార్టీకి పెద్దగా పోయేదేం లేదు. 2013 ఎన్నికల్లో కొత్త ముఖాలు అందించిన అదనపు విజయం వల్లే బీజేపీ  మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది.

గతంలో...
- రాజస్తాన్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ  న్యూలుక్‌ వ్యూహాన్ని అమలుపరిచింది, అయితే నూరుశాతం ఫలితం రాలేదు. 
2008 ఎన్నికల్లో బీజేపీ 193 స్థానాల్లో పోటీ చేసింది. వాటిలో 135 చోట్ల కొత్త ముఖాలనే బరిలోకి దింపింది.అయితే, వారిలో 55 మందే గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. 
2013 ఎన్నికల్లో బీజేపీ 92 మంది కొత్తవాళ్లకి టికెట్‌ ఇస్తే వారిలో 68 మంది నెగ్గారు. ఈ ఎన్నికలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement