
కాదేదీ కవితకనర్హం అన్నట్లు కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం అంటున్నారు పందేల రాయుళ్లు. ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటించగానే పార్టీలు, లీడర్లు, ఓటర్లు, మీడియాతో పాటు బెట్టింగ్ వీరుల జోరు మొదలైంది. షెడ్యూల్ ప్రకటన నుంచి అభ్యర్ధుల ఎంపిక, గెలుపు, ఓటమి, మెజార్టీ ఇలా ప్రతి అంశంపై కోట్ల రూపాయల బెట్టింగులు జరుగుతున్నాయి. పందెంరాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ కాక పుట్టిస్తున్నారు.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు తాజా ఎన్నికలు సెమీఫైనల్‌గా అందరూ భావిస్తున్న వేళ పందెంకోళ్లు శివాలెత్తుతున్నాయి. వివిధ సర్వేల ఆధారంగా ఎవరు గెలుస్తారు?, ఎంత మెజార్టీ రావచ్చు?, ఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు? అంటూ ప్రతి అంశంపై బెట్టింగ్ వీరులు పందెం కాస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అనుకూలంగా, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా బెట్స్ నడుస్తున్నాయి. ‘‘మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్‌కు అవకాశాలు తక్కువ. ఛత్తీస్‌గఢ్‌లో కూడా కమలానిదే వికాసం. రాజస్థాన్ ఒక్కటే కాంగ్రెస్ అనుకూలంగా ఉంది. ఈ ఏడాది ఎన్నికల బెట్టింగ్‌లు క్రికెట్‌ని మించిపోయాయి.
అభ్యర్థుల ఖరారైతే మార్కెట్‌లో జోష్ ఇంకా పెరుగుతుంది. పందెంలో తేడాలు కూడా రావచ్చు’’అని బుకీ ఒకరు చెప్పారు. ఈ సారి బెట్టింగ్‌లకు హైటెక్ హంగులు కూడా అద్దుకున్నాయి. కేవలం ఫోన్‌ల ద్వారా మాత్రమే కాదు మొబైల్ యాప్స్, వెబ్ సైట్లల ద్వారా కూడా పందేలు కాసే అవకాశం ఉంది. దీంతో కూర్చున్న చోట నుంచి కదలకుండా తమకు ఇష్టమైన పార్టీపై పందెం కాస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా పందేలు సాగుతూ ఉండడంతో వాటిని కట్టడి చేయడం కూడా పోలీసులకు సవాల్‌గా మారింది.
‘‘ఆన్‌లైన్ బెట్టింగ్ రూపంలో కేఫ్‌లు, బహిరంగ ప్రదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పందేలు కాస్తున్నారు. అందుకే వారిని పట్టుకోవడం కాస్త కష్టంగా మారింది’’అని మధ్యప్రదేశ్ డిఐజీ ధర్మేంద్ర చౌదరి చెప్పారు. ఆన్‌లైన్ వ్యవహారాలపైన కూడా ఓ కన్నేసి ఉంచామని ఏ చిన్న క్లూ దొరికినా దాడులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సైబర్ సెల్ మొబైల్ యాప్స్, వెబ్‌సైట్స్‌పై నిరంతర నిఘా పెట్టిందన్నారు.
ఇలా బెట్ చేస్తారు..
గెలుస్తుందన్న అంచనాలున్న పార్టీపై పందెం కట్టి గెలిస్తే కేవలం ఒక్క శాతం లాభం వస్తుంది. అదే ఓడిపోతుందన్న పార్టీపై పందెం కట్టి గెలిస్తే వందకు వంద శాతం, ఒక్కోసారి వందకు రెండొందల శాతం చొప్పున లాభం వస్తుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుస్తుందని రూ. 10 వేలు కడితే పందెం రాయుడికి వచ్చే లాభం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. అంటే మొత్తం రూ. 11 వేలు తిరిగి వస్తుంది. అదే కాంగ్రెస్‌పై రూ. 4,400కి పందెం కాస్తే ఏకంగా 10 వేలు చేతికొస్తుంది. అంటే 5,600 రూపాయలు లాభం అన్నమాట. విజయావకాశాలను బట్టి బెట్టింగ్ రేట్లు మారుతుంటాయి.
అంతా లాభమేనా...
బెట్టింగ్ వదులుకోలేని వ్యసనం. దీనికి అలవాటుపడ్డవాళ్లు ఉన్నదంతా ఊడ్చి మరీ పందేలు కాస్తూ ఉంటారు. రేసుల్లో పాల్గొనేవాళ్లు చేసినట్లు చాలా లెక్కలు కట్టి పందేలు కడుతుంటారు. అలాగని కట్టిన లెక్కలన్నీ ఫలిస్తాయా? అంటే చెప్పలేం. చాలాసార్లు బెట్టింగ్‌ల్లో ఓటమే ఎదురవుతుంటుంది.
లాభాలు వస్తే పరిమితంగా, నష్టం వస్తే అపరిమితంగా ఉండడం బెట్టింగ్స్‌లో సహజం. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలా మంది బీజేపీ ఓడిపోతుందంటూ కోట్లరూపాయల పందెం కాశారు. చివరకు సర్వస్వాన్ని కోల్పోయారు. మరి ఈసారి బెట్టింగ్ ఎన్ని చిత్రాలు చేస్తూందో చూడాలి.
ఫలోది.. పందెంలో అందెవేసిన చెయ్యి
ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటే చాలు.. ఆ ఊళ్లో పందేలు మొదలైపోతాయి. వర్షం ఎంత కురుస్తుంది ? ఎంతసేపు కురుస్తుంది ? రోడ్లు జలమయం అవుతాయా ? నాలాలు పొంగి ప్రవహిస్తాయా? ఇలా వాన లాంటి విషయం చుట్టూనే కాసుల జడి వాన కురుస్తూ ఉంటుంది. అలాంటిది ఎన్నికల సీజన్ వచ్చిందంటే వేరే చెప్పాలా ? రాజస్థాన్‌లోని ఫలోదిలో ఎక్కడలేని హడావుడి కనిపిస్తుంటుంది.
జోధ్‌పూర్‌కు 120 కిలో మీటర్ల దూరంలో ఉండే ఆ పట్టణంలో జనాభా లక్ష వరకు ఉంటుంది. ఆ పట్టణ ప్రజలకు పందెం అంటే ఎంతో సరదా. అక్కడ ఐపీఎల్ సీజన్‌లో 2,500 నుంచి 3 వేల కోట్ల రూపాయల వరకు చేతులు మారుతుంటాయి. అలాంటిది ఎన్నికల సీజన్‌లో ఐదారువేల కోట్లవరకు బెట్టింగ్‌లు జరగవచ్చని అంచనా. ఈ ఊరల్లో బుకీలకు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉంది. ఫలోదిలో దాదాపుగా 20–25 మంది పెద్ద బుకీలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment