క్షీణిస్తున్న ‘కాషాయ ప్రభ’! | BJP Would Face A Hardships In MP Elections Due To Long Term Regime | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 26 2018 10:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

BJP Would Face A Hardships In MP Elections Due To Long Term Regime - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో వచ్చే నెలలో జరగనున్న శాసన సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుందా లేక కాంగ్రెస్‌ పునరుత్తేజితమై అధికారాన్ని చేపడుతుందా అన్నది మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తేలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఈ సారి ఎదురుగాలులు బలంగా వీచనున్నాయి. సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటం వల్ల సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇంత వరకు ఆ పార్టీకి వెన్ను కాసిన గిరిజనులు, ఉన్నత కులీనులు, రైతులు ఈ సారి ఎదురుతిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో బీజేపీ గెలుపు నల్లేరుమీద నడక కాదని స్పష్టమవుతోంది. అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌ పార్టీ  బీజేపీ వ్యతిరేక పవనాలను తనక అనుకూలంగా ఎంత వరకు మార్చుకుంటుందన్నది అనుమానమే.

గత మూడు ఎన్నికల్లో కాషాయందే పై చేయి
బీజేపీ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై పైచేయి సాధిస్తూనే ఉంది. ఓట్లు, సీట్ల శాతాన్ని కూడా పెంచుకుంటోంది. 2013 ఎంపీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో 30 ఏళ్లలో బీజేపీకి పడ్డ అత్యధిక శాతం ఓట్లు ఇవే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, బీజేపీ మొత్తం సీట్లలో 72 శాతం సీట్లను గెలుచుకుంది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం తక్కువే (9%) ఉన్నా  సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్‌ కంటే బీజేపీ బాగా ముందుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో శాసన సభలో ఉన్న 230 సీట్లలో బీజేపీ 165 స్థానాలు గెలుచుకుంది. వీటిలో 92 నియోజకవర్గాల్లో బీజేపీ 10 శాతం కంటే ఎక్కువ ఆధిక్యత సాధించింది. 58 సీట్లలో గెలిచిన కాంగ్రెస్‌ కేవలం 17 చోట్ల మాత్రమే 10 శాతం కంటే ఎక్కువ ఆధిక్యత నిలుపుకుంది. రాష్ట్రంలో రిజర్వుడు స్థానాల్లోనూ, జనరల్‌ సీట్లలోనూ కూడా బీజేపీ  గణనీయమైన ఆధిపత్యం ప్రదర్శించింది.

రిజర్వుడు స్థానాల్లోనూ ముందంజ
మధ్యప్రదేశ్‌ జనాభాలో షెడ్యూల్డ్‌ తెగలు(ఎస్‌టీ)  21 శాతం ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 47 సీట్లు ఎస్‌టీలకు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ 47 సీట్లలో 31 చోట్ల గెలిచింది. 80 శాతం కంటే ఎక్కువ గిరిజనులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగరడానికి సంఘ్‌ పరివార్‌ కృషే ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గిరిజన గూడేల్లో సంఘ్‌ పరివార్‌ చేసిన సామాజిక సేవలే దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో బీజేపీ విజయానికి బాటలు వేశాయని 2008లో వెలువడిన ఒక అధ్యయన పత్రంలో రాజకీయ విశ్లేషకులు తారిఖ్‌ తచిల్, రోనాల్డ్‌ హెరింగ్‌లు పేర్కొన్నారు. సంఘ్‌ పరివార్‌ కార్యక్రమాల వల్ల బీజేపీ పరపతి పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో హిందూత్వ భావన కూడా పెరిగిందని వారు చెప్పారు.

హిందూత్వ కార్డు ప్రయోగం
రాష్ట్ర జనాభాలో 91శాతం ఉన్న హిందువులను ఆకట్టుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారాల్లో తమ హిందూత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

దూరమవుతున్న కీలక ఓటు బ్యాంకు
ఇటీవలి కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రంలో ఆ పార్టీ పరపతిని నీరుగారుస్తున్నాయి. ఇంత వరకు పార్టీకి అండగా నిలిచిన గిరిజనులు, ఎస్‌టీలు, రైతులతో పాటు అగ్ర వర్ణాలు కూడా ఇప్పుడు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు

ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణల విషయంలో బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి ఇటు గిరిజనులకు అటు అగ్ర వర్ణాలకు కూడా రుచించలేదు. అలాగే, దళితులపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడంలో ప్రభుత్వ తీరును గిరిజనులు తప్పు పడుతున్నారు. మరోవైపు ఎస్సీఎస్టీ చట్టానికి సుప్రీం కోర్టు సూచించిన సవరణలను తిరస్కరించడం ద్వారా కేంద్రం దళితులపట్ల పక్షపాతం చూపుతోందన్న భావన ఉన్నత వర్గాల్లో నెలకొంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోలాగే మధ్య ప్రదేశ్‌లో కూడా అగ్ర వర్ణాల వారు బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితి మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వ్యవసాయ ప్రధానమైన మధ్య ప్రదేశ్‌లో స్రంపదాయకంగా రైతులు బీజేపీకే మద్దతు పలుకుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన పరిణామాలు, ప్రభుత్వాల తీరుతో రైతులు బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం రేపు ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో పది అతిపేద జిల్లాలతో పోలిస్తే పది ధనిక జిల్లాల్లోనే బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. గత ఎన్నికల్లో బీజేపీ ధనిక జిల్లాల్లో 50శాతం ఓట్లు సంపాదించుకుంటే పేద జిల్లాల్లో 39శాతంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. రైతుల అసంతృప్తి  ఈ సారి ఎన్నికల్లో పేద జిల్లాలో బీజేపీపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.(ప్రజల ఆస్తులు, సౌకర్యాల తదితర అంశాల ఆధారంగా మింట్స్‌ డిస్ట్రిక్ట్‌ వెల్త్‌ ట్రాకర్‌ సంస్థ రాష్ట్రంలో పేద, ధనిక జిల్లాలను గుర్తించింది)
 

కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటుందా
ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలులు వీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే, వీటిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్‌ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది అనుమానమే. రైతులు, గిరిజనులు, అగ్రవర్ణాల వ్యతిరేకతతో పాటు సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత( ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న పార్టీపై  సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది)కు క్యాష్‌ చేసుకోవాలని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. అయితే, ముఠా కుమ్ములాటలకు పేరొందిన రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో ఎంత వరకు నెగ్గుకు రాగలదో చెప్పలేం. 

2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయానికి ముఠా తగవులే ప్రధాన కారణమని లోక్‌నీతి–సిఎస్‌డిఎస్‌ కు చెందిన శ్రేయాస్‌ సర్దేసి 2014లో నిర్వహించిన అధ్యయనంలో తేల్చారు. కాంగ్రెస్‌ పార్టీ తన కొచ్చే ఓట్లను సీట్లుగా మార్చుకోగలిగితే రాష్ట్రంలో, దేశంలో కూడా మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉందని  సర్దేసి అభిప్రాయపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చూపగలిగితే హిందీ రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నట్టవుతుంది. ఈ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు 2019 ఎన్నికలను ఉత్సాహంతో ఎదుర్కొంటారు. ఇక నాలుగో సారి అధికార పీఠం కోసం చూస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ సారి కూడా నెగ్గితే రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement