Madhya Pradesh Government
-
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
భోపాల్: అటవీ శాఖ మినహా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సివిల్ సరీ్వసెస్(స్పెషల్ ప్రొవిజన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఉమెన్) రూల్స్–1997కు సవరణ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇకపై మహిళలకు 35 శాతం కోటా అమలవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పోలీసు శాఖతోపాటు ఇతర ప్రభుత్వ పోస్టుల్లో 35 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు టీచర్ల పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. -
బీజేపీ ఉమాభారతి సంచలన ప్రకటన
బోఫాల్: బీజేపీ ఫైర్‌బ్రాండ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారామె. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లిక్కర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. ఇకపై గో శాలల కింద మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టానంటూ ప్రకటించారామె. మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కారణమని బలంగా నమ్ముతున్నారామె. ఈ క్రమంలో బోఫాల్ అయోధ్య నగర్‌లోని ఓ ఆలయం వద్దకు చేరుకుని(సమీపంలోని లిక్కర్ షాప్ ఉంది) నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలన్న డిమాండ్‌తో ఆమె దీక్ష కొనసాగించారు. మంగళవారం ఆ దీక్ష ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఆమె మధుశాలా మే గోశాల(లిక్కర్ దుకాణాల్లో గో శాల) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారామె. రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, అదే రాముడి గుడి దగ్గర్లో లిక్కర్ దుకాణాలు(ఓర్చా ప్రాంతంలో పరిస్థితిని ఉదాహరిస్తూ..) పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె మధ్యప్రదేశ్ సర్కార్‌ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకు.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పించడం నిజమైన అభివృద్ధి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక.. పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వర్గంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. మద్యం నిషేధంపై ఉద్యమించినంత మాత్రానా నాకు ప్రధాని పదవి దక్కుతుందా?.. ఇది చాలా విడ్డూరంగా ఉంది.. ఒక వర్గం ఇలా ప్రచారం చేయడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. లిక్కర్ పాలసీ కోసం ఎదురు చూపులు ఉండబోవని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లిక్కర్ షాపులను దగ్గరుండి తానే గోశాలలుగా మారుస్తానని ఆమె ప్రకటించారు. అలాంటి దుకాణాల బయట 11 ఆవుల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తన బృందానికి ఆదేశాలు జారీ చేశానని.. తనను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారామె. ఈమధ్యే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన ఉమాభారతి.. లిక్కర్ పాలసీలో కొన్ని సవరణలు సూచిస్తూ.. కొత్త విధానం తేవాలని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు కూడా. అయితే.. ఆచరణలోనే అది కనిపించలేదు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
ఇతర రాష్ట్రాల్లోనూ పశు వైద్య రథాలు
సాక్షి, అమరావతి: మూగ జీవాల ఆరోగ్య సంరక్షణకు సైతం అత్యంత ప్రాధాన్యమిస్తూ 108 అంబులెన్స్‌ల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మొబైల్ అంబులేటరీ క్లినిక్స్’ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జార్ఖండ్‌లో ఇప్పటికే వీటిని అందుబాటులోకి తీసుకురాఆ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెలాఖరు నాటికి సేవలందించనున్నాయి. పంజాబ్‌లో టెండర్లు పిలవగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలు దేశంలోనే తొలిసారిగా రైతుల ముంగిటకు వెళ్లి మూగ జీవాలకు వైద్య సేవలందించే సంకల్పంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున తొలి విడతలో 175 వైఎస్సార్ సంచార పశు వైద్యసేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అంబులెన్స్‌ల తయారీతో పాటు రెండేళ్ల పాటు నిర్వహణ కోసం రూ.133.13 కోట్లు ఖర్చు చేస్తోంది. గతేడాది మే 19న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటి సేవలను ప్రారంభించి టోల్ ఫ్రీ నంబర్ 1962తో అనుసంధానించారు. ప్రత్యేకంగా రూ.7 కోట్లతో కాల్ సెంటర్ నెలకొల్పారు. మూగ జీవాలకు ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు చిన్నపాటి సర్జరీలు అక్కడే నిర్వహించేలా తీర్చిదిద్దారు. అంబులెన్స్‌లో మినీ ల్యాబ్ ఏర్పాటు చేశారు. వెయ్యి కిలోల బరువున్న జీవాలను సునాయాసంగా తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ జాక్ లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి వాహనానికి డ్రైవర్ కమ్ అటెండర్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కమ్ కాంపౌండర్, ఒక వైద్యుడిని నియమించారు. 1.72 లక్షల మూగ జీవాలకు సేవలు ఫోన్ కాల్ వచ్చిన అరగంటలోపే మూగ జీవాలకు వైద్యసేవలు అందిస్తూ అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 3.52లక్షల ఫోన్‌కాల్స్ రాగా, వాహనాలు 1.20లక్షల ట్రిప్పులు తిరిగాయి. 2,127 ఆర్బీకేల పరిధిలో 1.72లక్షల మూగ, సన్నజీవాలకు గత 8 నెలలుగా సేవలందిస్తున్నాయి. రెండో విడతలో రూ.119.18 కోట్లతో మరో 165 అంబులెన్స్‌లను ఈ నెలాఖరుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సర్వత్రా ప్రశంసలు అంబులెన్స్‌లలో సమకూర్చిన సౌకర్యాలు, అందిస్తున్న సేవలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అధికారుల బృందాల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇదే తరహాలో సంచార పశు వైద్య సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తే ఆర్థిక చేయూతనిస్తామని ప్రకటించడంతో పలు రాష్ట్రాలు ఏపీ బాట పట్టాయి. కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్ర బృందాలు ఏపీలో పర్యటించి వీటి సేవలపై అధ్యయనం చేశాయి. మన రాష్ట్రంలో సమర్ధంగా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థకే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో వాహనాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. సీఎం ఆలోచనలు స్ఫూర్తిదాయకం సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టినవే మొబైల్ అంబులేటరీ క్లినిక్స్. మూగజీవాలకు సైతం నాణ్యమైన సేవలందించే లక్ష్యంతో తెచ్చిన వీటి సేవలను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలు పోటీపడుతుండడం గర్వ కారణం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖమంత్రి పలు రాష్ట్రాలు సంప్రదిస్తున్నాయి.. ఏపీ తరహాలో అంబులెన్స్‌లు ప్రవేశపెట్టి నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు పలు రాష్ట్రాలు సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మాతో కలసి పని చేసేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయి. – ఎస్.రామకృష్ణవర్మ, ఈఎంఆర్ఐ ఆపరేషన్స్ ఏపీ స్టేట్ హెడ్ -
హిందీలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలు
భోపాల్: వైద్య విద్యను హిందీలో అందించే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ మూడు సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందిస్తున్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని అన్నారు. ఇది స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని అభివర్ణించారు. ఆదివారం భోపాల్ మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్‌లోని మెడికల్ బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. సాంకేతిక, వైద్య విద్యను మరో 8 భాషల్లోనూ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ఇంగ్లిష్ తమకు రాదనే ఆత్మనూనతతో విద్యార్థులు బాధపడాల్సిన పనిలేదన్నారు. మాతృభాషల్లోనూ విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. ఈ పాఠ్యపుస్తకాలను 97 మంది వైద్యులతో కూడిన బృందం రూపొందించిందని సీఎం చౌహాన్ చెప్పారు. కాగా, ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో తీసుకురావడం వైద్యవిద్యలో సానుకూల పరిణామమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
Sivasena: శభాష్ చౌహన్‌జీ.. దేశానికి మార్గం చూపారు
ముంబై: ప్రస్తుత కరోనా సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్ర సేవలను ప్రశంసించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు అభినందనలు తెలిపింది. ఒక బీజేపీ ముఖ్యమంత్రికి అభినందనలు తెలపడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగులుతున్న చిన్నారులకు ఉచిత విద్యతో పాటు నెలకు పింఛన్ రూపేణ రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై తాజాగా శివసేన స్పందించింది. ఆ పార్టీ గొంతుకగా భావించే ‘సామ్నా’ పత్రికలో మధ్యప్రదేశ్‌ప్రభుత్వ చర్యలను కొనియాడుతూ సంపాదకీయం ప్రచురించింది. ఈ పిల్లల బాధ్యత చూసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలపడం అభినందనీయమని శివసేన కొనియాడింది. ఉచిత విద్యతో పాటు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామనడంపై అభినందించింది. (‘సామ్నా’ సంపాదకీయం చదవండి) ‘కరోనాతో దేశం వెనకబడుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.5 వేల పింఛన్ అందిస్తామని ప్రకటించడంపై అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇది మానవత్వంలో గొప్ప అడుగు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దేశానికి ఒక సందేశం అందిస్తున్నారు’ అని సంపాదకీయంలో శివసేన పేర్కొంది. అనాథ చిన్నారుల విషయంలో దేశానికి మధ్యప్రదేశ్‌ప్రభుత్వం ఒక మార్గం చూపిందని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కీర్తిస్తూనే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా’ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రూ.25,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అవనసరంగా శివసేన ‘సామ్నా’లో స్పష్టం చేసింది. -
నా బలం.. స్పూర్తి నువ్వే: సీఎం
భోపాల్: ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆనందంలో ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్య సాధ్నాను పొగడ్తలతో ముంచెత్తారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ‘విజయం సాధించినందుకు అభినందనలు’ అంటూ సాధ్నా బుధవారం తెల్లవారుజామున ట్వీట్ చేశారు. తన భర్తకు స్వీట్ తినిపిస్తున్న ఫోటోను దీనికి జత చేశారు. ‘నీవేనా బలం, నా ప్రేరణకు మూలం నువ్వే. నా జీవితంలో ప్రతీ విజయంలో నీ సహకారం ఉంది. నీవు నాతో ఉంటే ఎల్లప్పుడు నాదే విజయం’ అంటూ భార్య ట్వీట్‌కు శివరాజ్ సింగ్ సమాధానమిచ్చారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఉప ఎన్నికల్లో బీజేపీ 28 సీట్లకు గానూ 19 స్థానాల్లో గెలిచి, ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బతిని 8 సీట్లకే పరిమితమైంది. 25 మంది శాసన సభ్యుల రాజీనామా, ముగ్గురు సభ్యుల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 28 శాసన సభ స్థానాలకు నవంబర్ 3న జరిగిన పోలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం మొదలైన కౌంటింగ్ బుధవారం తెల్లవారు జామున ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చౌహాన్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో విజయాన్నిమధ్యప్రదేశ్ ప్రజల విజయంగా అభివర్ణించారు. అభివృద్ధికి, ప్రభుత్వంపై గల విశ్వాసానికి, ప్రజాసౌమ్యానికి ప్రతీకగా ఈ విజయాన్ని పేర్కొన్నారు. బీజేపీ పైగల విశ్వాసంతో ఓట్ల రూపంలో మధ్యప్రదేశ్ ప్రజలు దీవించారన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిజ్ఞ చేశారు. (చదవండి: బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!?) -
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో టీ షర్టు ధరించడం పద్దతి కాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్వాలియర్ డివిజన్లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్, టీ షర్టులు ధరించకుండా నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్ కమిషనర్ ఎంబీ ఓజా సర్క్యూలర్ జారీ చేశారు. ఉద్యోగులందరూ హుందాగా, సంప్రదాయంగా ఉండే దుస్తులను ధరించి విధి నిర్వాహణకు రావాలని ఆదేశించారు. (మెహబూబా నిర్బంధం మరో 3 నెలలు) కాగా జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్సౌర్ ఇల్లాలోని ఓ అధికారి పద్దతిగా లేని దుస్తులు (టీ షర్టు) ధరించి హాజరయ్యాడు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. తమ ఉత్తర్వులను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ కంటే ముందు అనేక రాష్ట్రాలు టీ షర్టు, జీన్స్ పై నిషేధం విధించాయి. గత ఏడాది బిహార్, తమిళనాడు ప్రభుత్వాలు సైతం సచివాలయంలోని ఉద్యోగులు ఈ దుస్తులు ధరించరాదని ఉత్తర్వులు జారీ చేశాయి. (సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10 వేలు ఫైన్) -
అక్కడ అరనిమిషం ‘నో మాస్క్’
భోపాల్: కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. రెండు నెలల లాక్డౌన్ అనంతరం కరోనా నిబంధనలను దశల వారీగా కొంత సడలించారు. అయితే మధ్య ప్రదేశ్ పోలీసులు మాత్రం మరో కొత్త రూల్‌ని అమలులోకి తెచ్చారు. బ్యాంకులు, బంగారం షాపులను సందర్శించేవారు 30 సెకన్ల పాటు మాస్క్‌ని తీసివేయాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను కోరింది. (బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారాహిత్యమా?) ఇంతకీ విషయం ఏమిటంటే మాస్క్‌లు ధరించి బ్యాంకుల్లోనూ, బంగారం షాపుల్లోనూ దోపిడీలకు పాల్పడే ప్రమాదం ఉందనీ, అలా జరిగితే మాస్క్‌ల కారణంగా సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయినప్పటికీ వారిని గుర్తించడం కష్టం కనుక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ఈ నోమాస్క్ ఆదేశాలు జారీచేసింది. 30 సెకన్ల పాటు మాస్క్‌తీయడం వల్ల వారిని సీసీటీవీ కెమెరాల్లో బంధించే వీలుంటుంది. తప్పు చేస్తే, తప్పించుకునే అవకాశం కూడా ఉండదు. (మాస్క్ లేకుంటే శిక్ష తప్పదు ) -
కోవిడ్-19: ఖైదీలకు శుభవార్త!
భోపాల్: భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో జైళ్లలో రద్దీని నివారించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 8వేల మంది ఖైదీలను విడుదల చేసేందుకు అవసరమైన ప్రక్రియను సోమవారం ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 8,000 మంది ఖైదీలలో 5,000 మందిని 60 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేయనుండగా, గరిష్ట శిక్ష కాలం ఐదేళ్ల లోపు ఉన్న 3 వేలమంది ఖైదీలను 45 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తామని ఆ రాష్ట్ర జైళ్ల డైరెక్టర్ జనరల్ సంజయ్ చౌదరి జాతీయ మీడియాతో పేర్కొన్నారు. జైళ్లలో ఎక్కువమంది ఉన్నందున కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. గరిష్టంగా ఏడు సంవత్సరాల శిక్ష విధించిన కేసులలో ఖైదీలను పెరోల్ లేదా మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయడాన్ని పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాష్ట్రంలో 125 జైళ్లలో 28,601 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం మాత్రమే ఉన్నా ప్రస్తుతం 42 వేల మంది ఖైదీలు ఉన్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా 47 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, నలుగురు మరణించారు. (కరోనా: కేజ్రివాల్ ప్రభుత్వం కీలక చర్యలు) -
చిక్కుల్లో ప్రజ్ఞా ఠాకూర్
భోపాల్: భోపాల్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై 12ఏళ్ల క్రితం నమోదైన హత్యకేసును మధ్యప్రదేశ్ ప్రభుత్వం తిరిగి విచారించాలని నిర్ణయించింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో ప్రజ్ఞాసింగ్ విజయం సాధించనున్నారని తేలిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్‌జోషి హత్యకేసులో ప్రజ్ఞాసింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిప్పటికీ ఈ కేసును పునర్విచారించేందుకు న్యాయసలహా తీసుకుంటున్నామని న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ మంగళవారం వెల్లడించారు. 2007 డిసెంబర్ 29న దేవస్ జిల్లాలో సునీల్‌జోషి హత్యకు గురయ్యారు. సరైన సాక్ష్యాధారాలులేని కారణంగా 2017లో ప్రజ్ఞాసింగ్, మరో ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే సునీల్ జోషి హత్యకేసు పునర్విచారణకు ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని శర్మ తెలిపారు. -
మద్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం
-
సింధియా-చౌహాన్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పై జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తితో ఉన్నారా? మధ్యప్రదేశ్ సీఎం పదవి దక్కలేదన్న బాధ వెంటాడుతోందా? బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌చౌహాన్‌తో సింధియా భేటీ ఆంతర్యం ఏంటి? మర్యాదపూర్వకంగా కలిశామని నేతలు చెబుతున్నా.. రాజకీయ కారణం ఉందన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ యువనేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం , బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలువడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భోపాల్‌కి దూరంగా ఉండే సింధియా సోమవారం సిటీకొచ్చారు. తన సన్నిహితులను కలిసిన తర్వాత చౌహాన్ ఇంటికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరిద్దరూ చర్చలు జరిపారు. తర్వాత బయటకొచ్చిన చౌహాన్, సింధియా.. మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. అనంతరం కారు వరకూ వెళ్లి సింధియాకు వీడ్కోలు పలికారు శివరాజ్‌సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రస్తుతం దావోస్‌లో ఉన్నారు. ఆయన రాష్ట్రంలో లేని సమయంలో సింధియా.. చౌహాన్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. మర్యాదపూర్వకంగానే కలిశామని ఇద్దరు నేతలూ చెబుతున్నా.. రాజకీయ నేపథ్యం ఉండే ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించి ఇటీవలే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కీలకంగా వ్యవహరించారు. సీఎం పదవి కోసం ఇద్దరూ పోటీపడ్డారు. చివరికి సీనియర్ అయిన కమల్‌నాథ్ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఇది సింధియా వర్గీయులను ఒకింత అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన సింధియా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడాలని అనుచరులకు సర్దిచెప్పుకున్నారు. తాజాగా ఆయన చౌహాన్‌తో భేటీ అవడంతో ఈ విషయం మళ్లీ తెరమీదకి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి కారణంగానే సింధియా.. చౌహాన్‌ను కలిశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను అస్థిరపరచాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్నదే త్వరలో మధ్యప్రదేశ్‌లోనూ జరిగే అవకాశం ఉందని కోల్‌కతాలో జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి హెచ్చరించారు. ఒక్క సీటే తేడా అయినా, మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వమే. ఎస్పీ, బీఎస్పీ సహకారంతో కమల్‌నాథ్ ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సింధియా ఎర్రజెండా చూపిస్తే, ప్రభుత్వం పడిపోవడం ఖాయం. అందుకే, సింధియా- చౌహాన్ భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే, అభివృద్ధి కార్యక్రమాల్లో చౌహాన్ మద్దతు కోరేందుకే సింధియా ఆయనను కలిశారని.. పుకార్లు నమ్మొద్దని కాంగ్రెస్ చెబుతోంది. -
క్షీణిస్తున్న ‘కాషాయ ప్రభ’!
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో వచ్చే నెలలో జరగనున్న శాసన సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుందా లేక కాంగ్రెస్ పునరుత్తేజితమై అధికారాన్ని చేపడుతుందా అన్నది మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తేలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఈ సారి ఎదురుగాలులు బలంగా వీచనున్నాయి. సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటం వల్ల సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇంత వరకు ఆ పార్టీకి వెన్ను కాసిన గిరిజనులు, ఉన్నత కులీనులు, రైతులు ఈ సారి ఎదురుతిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో బీజేపీ గెలుపు నల్లేరుమీద నడక కాదని స్పష్టమవుతోంది. అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యతిరేక పవనాలను తనక అనుకూలంగా ఎంత వరకు మార్చుకుంటుందన్నది అనుమానమే. గత మూడు ఎన్నికల్లో కాషాయందే పై చేయి బీజేపీ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై పైచేయి సాధిస్తూనే ఉంది. ఓట్లు, సీట్ల శాతాన్ని కూడా పెంచుకుంటోంది. 2013 ఎంపీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో 30 ఏళ్లలో బీజేపీకి పడ్డ అత్యధిక శాతం ఓట్లు ఇవే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, బీజేపీ మొత్తం సీట్లలో 72 శాతం సీట్లను గెలుచుకుంది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం తక్కువే (9%) ఉన్నా సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ కంటే బీజేపీ బాగా ముందుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో శాసన సభలో ఉన్న 230 సీట్లలో బీజేపీ 165 స్థానాలు గెలుచుకుంది. వీటిలో 92 నియోజకవర్గాల్లో బీజేపీ 10 శాతం కంటే ఎక్కువ ఆధిక్యత సాధించింది. 58 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ కేవలం 17 చోట్ల మాత్రమే 10 శాతం కంటే ఎక్కువ ఆధిక్యత నిలుపుకుంది. రాష్ట్రంలో రిజర్వుడు స్థానాల్లోనూ, జనరల్ సీట్లలోనూ కూడా బీజేపీ గణనీయమైన ఆధిపత్యం ప్రదర్శించింది. రిజర్వుడు స్థానాల్లోనూ ముందంజ మధ్యప్రదేశ్ జనాభాలో షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) 21 శాతం ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 47 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ 47 సీట్లలో 31 చోట్ల గెలిచింది. 80 శాతం కంటే ఎక్కువ గిరిజనులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగరడానికి సంఘ్ పరివార్ కృషే ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గిరిజన గూడేల్లో సంఘ్ పరివార్ చేసిన సామాజిక సేవలే దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో బీజేపీ విజయానికి బాటలు వేశాయని 2008లో వెలువడిన ఒక అధ్యయన పత్రంలో రాజకీయ విశ్లేషకులు తారిఖ్ తచిల్, రోనాల్డ్ హెరింగ్లు పేర్కొన్నారు. సంఘ్ పరివార్ కార్యక్రమాల వల్ల బీజేపీ పరపతి పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో హిందూత్వ భావన కూడా పెరిగిందని వారు చెప్పారు. హిందూత్వ కార్డు ప్రయోగం రాష్ట్ర జనాభాలో 91శాతం ఉన్న హిందువులను ఆకట్టుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారాల్లో తమ హిందూత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దూరమవుతున్న కీలక ఓటు బ్యాంకు ఇటీవలి కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రంలో ఆ పార్టీ పరపతిని నీరుగారుస్తున్నాయి. ఇంత వరకు పార్టీకి అండగా నిలిచిన గిరిజనులు, ఎస్టీలు, రైతులతో పాటు అగ్ర వర్ణాలు కూడా ఇప్పుడు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణల విషయంలో బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి ఇటు గిరిజనులకు అటు అగ్ర వర్ణాలకు కూడా రుచించలేదు. అలాగే, దళితులపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడంలో ప్రభుత్వ తీరును గిరిజనులు తప్పు పడుతున్నారు. మరోవైపు ఎస్సీఎస్టీ చట్టానికి సుప్రీం కోర్టు సూచించిన సవరణలను తిరస్కరించడం ద్వారా కేంద్రం దళితులపట్ల పక్షపాతం చూపుతోందన్న భావన ఉన్నత వర్గాల్లో నెలకొంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోలాగే మధ్య ప్రదేశ్‌లో కూడా అగ్ర వర్ణాల వారు బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితి మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ ప్రధానమైన మధ్య ప్రదేశ్‌లో స్రంపదాయకంగా రైతులు బీజేపీకే మద్దతు పలుకుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన పరిణామాలు, ప్రభుత్వాల తీరుతో రైతులు బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం రేపు ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో పది అతిపేద జిల్లాలతో పోలిస్తే పది ధనిక జిల్లాల్లోనే బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. గత ఎన్నికల్లో బీజేపీ ధనిక జిల్లాల్లో 50శాతం ఓట్లు సంపాదించుకుంటే పేద జిల్లాల్లో 39శాతంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. రైతుల అసంతృప్తి ఈ సారి ఎన్నికల్లో పేద జిల్లాలో బీజేపీపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.(ప్రజల ఆస్తులు, సౌకర్యాల తదితర అంశాల ఆధారంగా మింట్స్ డిస్ట్రిక్ట్ వెల్త్ ట్రాకర్ సంస్థ రాష్ట్రంలో పేద, ధనిక జిల్లాలను గుర్తించింది) కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందా ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలులు వీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే, వీటిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది అనుమానమే. రైతులు, గిరిజనులు, అగ్రవర్ణాల వ్యతిరేకతతో పాటు సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత( ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది)కు క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే, ముఠా కుమ్ములాటలకు పేరొందిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎంత వరకు నెగ్గుకు రాగలదో చెప్పలేం. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి ముఠా తగవులే ప్రధాన కారణమని లోక్‌నీతి–సిఎస్‌డిఎస్ కు చెందిన శ్రేయాస్ సర్దేసి 2014లో నిర్వహించిన అధ్యయనంలో తేల్చారు. కాంగ్రెస్ పార్టీ తన కొచ్చే ఓట్లను సీట్లుగా మార్చుకోగలిగితే రాష్ట్రంలో, దేశంలో కూడా మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉందని సర్దేసి అభిప్రాయపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చూపగలిగితే హిందీ రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నట్టవుతుంది. ఈ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు 2019 ఎన్నికలను ఉత్సాహంతో ఎదుర్కొంటారు. ఇక నాలుగో సారి అధికార పీఠం కోసం చూస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సారి కూడా నెగ్గితే రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
సామ్నా తరహాలో సర్కారీ దినపత్రిక!
శివసేన అధికారిక పత్రిక సామ్నా తరహాలోనే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దినపత్రికను ప్రారంభించనున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ ఎలక్షన్ సెల్ కార్యవర్గ సభ్యులకు, పార్టీ అధికారిక ప్రతినిధులకు, నిర్వాహక కార్యదర్శులకు ఇచ్చిన విందు సందర్భంగా ఆయనీ విషయం వెల్లడించారు. ఈ పత్రిక సాయంతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని, అలాగే వివిధ అంశాలపై ప్రభుత్వం, పార్టీ ఏమనుకుంటున్నాయో స్పష్టంగా రాయచ్చని చౌహాన్ అన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న వాళ్లు ఈ పత్రికలో రాస్తారని, ఇది రాష్ట్రంలోని దాదాపు పది లక్షల మంది కార్యకర్తలకు వెళ్తుందని చెప్పారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. -
ఐఏఎస్ జంటను విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం
భోపాల్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెందిన ఐఏఎస్ అధికారుల జంట అరవింద్ జోషి, టిను జోషిలను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలిగించినట్లు ఉన్నతాధికారులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అందుకు సంబంధించి ఆదేశాలు సోమవారం వారికి అందాయని తెలిపారు. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఆ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2010 ఫిబ్రవరిలో ఆ దంపతుల నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో రూ.350 కోట్లతో పాటు రూ. 3 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు కనుగొన్నారు. దాంతో అరవింద్ జోషి, టిను జోషిలను ప్రభుత్వ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సదరు దంపతుల వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని... ఈ నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అరవింద్, టీనులను విధుల నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఐఏఎస్ జంటను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తమను సర్వీస్ నుంచి తొలిగించడం అక్రమం అంటూ ఆ జంట రాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.