అరవింద్ జోషి, టిను జోషి
భోపాల్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెందిన ఐఏఎస్ అధికారుల జంట అరవింద్ జోషి, టిను జోషిలను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలిగించినట్లు ఉన్నతాధికారులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అందుకు సంబంధించి ఆదేశాలు సోమవారం వారికి అందాయని తెలిపారు. మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన ఆ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2010 ఫిబ్రవరిలో ఆ దంపతుల నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో రూ.350 కోట్లతో పాటు రూ. 3 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు కనుగొన్నారు.
దాంతో అరవింద్ జోషి, టిను జోషిలను ప్రభుత్వ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సదరు దంపతుల వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని... ఈ నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అరవింద్, టీనులను విధుల నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఐఏఎస్ జంటను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తమను సర్వీస్ నుంచి తొలిగించడం అక్రమం అంటూ ఆ జంట రాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.