భోపాల్: మధ్యప్రదేశ్లో లోకాయుక్త అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సీనియర్ ఐఏఎస్ దంపతుల అవినీతిపై విచారణకు అనుమతి లభించగా, తాజాగా మరో అధికారి అడ్డంగా దొరికిపోయారు. రెవెన్యూ శాఖ సంయుక్త కమిషనర్ రవికాంత్ ద్వివేది అవినీతికి పాల్పడటం ద్వారా దాదాపు 70 కోట్ల రూపాయిల విలువైన ఆస్తులు పోగేసుకున్నట్టు లోకాయుక్త వెలికితీసింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ద్వివేదిని సస్పెండ్ చేసింది.
లోకాయుక్త పోలీసులు ఇటీవల ద్వివేది ఇంటిపై దాడి చేసి ఆస్తుల్ని సీజ్ చేసింది. శనివారం రాత్రి మరోసారి తనిఖీ చేయగా, ఆయన భార్య పేరిట బ్యాంక్ లాకర్లో ఉన్న దాదాపు 50 లక్షల రూపాయిల విలువైన బంగారం, లక్షల రూపాయిల నగదు సీజ్ చేశారు. వీటితో పాటు 15 లక్షల రూపాయిల నగదు, ప్లాట్లు, ఇళ్లు, హోటల్, బంగారు, వ్యవసాయ భూములకు సంబంధించి 25 డాక్యుమెంట్లను గుర్తించారు. ఆయన అక్రమాస్తులకు సంబంధించి లోకాయుక్త వివరాలు సేకరించే పనిలో ఉంది. వీటి నిజ విలువ ఎంతన్న విషయంపై ఇంకా నిర్ధారించాల్సివున్నా, 70 కోట్ల రూపాయిల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇదిలావుండగా, ఈ ఆరోపణలను ద్వివేది కొట్టిపారేశారు. తనపై కుట్ర జరుగుతోందని అన్నారు.
అవినీతి ఐఏఎస్ ఆస్తులు రూ. 70 కోట్లు
Published Sun, Feb 2 2014 4:04 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement