బీజేపీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి సర్తాజ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అభ్యర్థిత్వం దక్కలేదని కంటతడి పెట్టిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సర్తాజ్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ గురువారం వెల్లడించిన అభ్యర్ధుల మూడో జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన సింగ్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. హోషంగాబాద్ జిల్లా సియోని మాల్వా నుంచి రెండు సార్లు ప్రాతినిథ్యం వహించిన 77 ఏళ్ల సింగ్‌కు వయోభారం కారణంగా టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది.
పార్టీ నిర్ణయం పట్ల మనస్ధాపం చెందిన సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించిన మీదట భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని ప్రకటించారు. అయితే అనూహ్యంగా సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి తీపికబురు అందింది. బీజేపీ సీనియర్ నేతలను కరివేపాకులా తీసిపారేస్తోందని, అందుకు అద్వానీయే సంకేతమని ఆ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రతినిధి భూపీందర్ గుప్తా అన్నారు. సింగ్‌కు హోషంగాబాద్ నుంచి తమ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment