జైపూర్ : తన ప్రభుత్వంపై మాట్లాడేందుకు అంశాలు కరువైనందునే కాంగ్రెస్ నేతలు రాహుల్ అనుమతితో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మూడు దశాబ్ధాల కిందట మరణించిన తన తండ్రిని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. రాజస్ధాన్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. వంద తరాలుగా తన కుటుంబానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
గుజరాత్‌లోని మారుమూల గ్రామంలోని ఓ పేద చిన్నకుటుంబం తమదని మోదీ చెప్పుకొచ్చారు. తన కుటుంబాన్ని బయటకు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించిన మోదీ మోదీ కూడా తమ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని రాహుల్ చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ కుటుంబ సభ్యుల గురించి తానేమీ మాట్లాడటం లేదని, దేశ మాజీ ప్రధానులు, కాంగ్రెస్ పార్టీ మాజీ నేతల గురించే తాను ప్రస్తావిస్తున్నానన్నారు.
కాంగ్రెస్ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కాగా ప్రధాని మోదీ తన తండ్రి ఎవరో చెప్పాలంటూ కాంగ్రెస్ నేత విలాస్‌రావు ముత్తెంవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రాజ్‌బబ్బర్ రూపాయి విలువ మోదీ తల్లి వయసు స్ధాయికి క్షీణిస్తోందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Comments
Please login to add a commentAdd a comment