మోరేనా : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచార హోరు పెంచారు. భారీ బహిరంగ సభల్లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మోరేనాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. మోదీ హవాభావాలతో ప్రసంగిస్తూ.. ‘మిత్రులారా..! నన్ను ప్రధాన మంత్రి అని పిలవకండి. వాచ్‌మెన్ అని పిలవండి’ అంటూ తియ్యగా మాట్లాడి నరేంద్ర మోదీ ప్రజల్ని మభ్యపెడతాడని రాహుల్ ఎద్దేవా చేశారు.
ప్రజలను మిత్రులారా అని పేర్కొంటూ రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో వేల కోట్లు ఎగవేసిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలకు ‘సోదరుడి’గా వ్యవహరిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. కాగా, రాఫెల్ డీల్‌లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించిందనే ఆరోపణలతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ వరసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నుంచి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment